Poonam Gupta: వ్యాపారాన్ని ఫైల్‌ చేసింది!

11 Nov, 2023 01:13 IST|Sakshi

సాధారణంగా చదువు అయి΄ోగానే వెంటనే ఉద్యోగ వేటలో పడతారు చాలామంది. మంచి ఉద్యోగం కోసం వెతికి వెతికి చివరికి చిన్నపాటి జాబ్‌ దొరికినా చేరి΄ోతారు. కొంతమంది మాత్రం తాము కోరుకున్న దానికోసం ఎంత సమయం అయినా ప్రయత్నిస్తూనే ఉంటారు. వీరందరిలాగే ప్రయత్నించింది పూనమ్‌ గుప్తా. కానీ ఎక్కడా ఉద్యోగం దొరకలేదు. దీంతో తనే ఒక వ్యాపారాన్నిప్రారంభించి వందలమందికి ఉద్యోగాలిచ్చే స్థాయికి ఎదిగింది. సమస్య ఏదైనా నిశితంగా ఆలోచిస్తే ఇట్టే పరిష్కారం దొరుకుతుందనడానికి పూనమ్‌ గుప్తానే ఉదాహరణగా నిలుస్తోంది.

ఢిల్లీకి చెందిన ఓ వ్యాపార కుటుంబంలో పుట్టింది పూనమ్‌ గుప్తా. లేడీ శ్రీరామ్‌ కాలేజీలో ఎకనమిక్స్‌తో డిగ్రీ పూర్తి చేసిన పూనమ్‌.. తరువాత ఎమ్‌బీఏ చేసింది. చదువు అయిన వెంటనే ఉద్యోగాన్వేషణప్రారంభించింది. ఎంత ప్రయత్నించినా ఎక్కడా ఉద్యోగం రాలేదు. ఇలా జాబ్‌ ప్రయత్నాల్లో ఉండగానే... 2002లో పునీత్‌ గుప్తాతో వివాహం జరిగింది. పునీత్‌ స్కాట్‌లాండ్‌లో స్థిరపడడంతో పూనమ్‌ కూడా భర్తతో అక్కడికే వెళ్లింది. పెళ్లి అయినా.. దేశం మారినా పూనమ్‌ మాత్రం ఉద్యోగ ప్రయత్నాన్ని మానుకోలేదు. ఎలాగైనా జాబ్‌ చేయాలన్న కోరికతో అక్కడ కూడా ఉద్యోగం కోసం కాళ్లు అరిగేలా తిరిగింది. అనుభవం లేదని ఒక్కరూ ఉద్యోగం ఇవ్వలేదు. స్కాట్‌లాండ్‌లో అయినా జాబ్‌ దొరుకుతుందనుకున్న ఆశ నిరాశగా మారింది.

అలా వచ్చిన ఆలోచనే...
ఉద్యోగం కోసం వివిధ ఆఫీసులకు వెళ్లిన పూనమ్‌కు.. అక్కడ కట్టలు కట్టలుగా పేర్చిన ఫైళ్లు కనిపించేవి. ఉద్యోగం దొరకక సొంతంగా ఏదైనా చేయాలనుకున్నప్పుడు ఆ ఫైళ్లను రీసైక్లింగ్‌ చేయవచ్చు గదా. అన్న ఐడియా వచ్చింది. పేపర్‌ను రీసైక్లింగ్‌ ఎలా చేయాలి, ఈ వ్యాపారంలో ఎదురయ్యే సవాళ్లను క్షుణ్ణంగా తెలుసుకుని కంపెనీ పెట్టాలని నిర్ణయించుకుంది. స్కాటిష్‌ ప్రభుత్వం ఓ పథకం కింద ఇచ్చిన లక్షరూపాయల రుణంతో 2003లో ‘పీజీ పేపర్‌ కంపెనీ లిమిటెడ్‌’ కంపెనీని పెట్టింది.ప్రారంభంలో యూరప్, అమెరికాల నుంచి పేపర్‌ వ్యర్థాలను కొని రీసైక్లింగ్‌ చేసేది. రీసైక్లింగ్‌ అయిన తరువాత నాణ్యమైన పేపర్‌ను తయారు చేసి విక్రయించడమే పూనమ్‌ వ్యాపారం. ఏడాదికేడాది టర్నోవర్‌ను పెంచుకుంటూ కంపెనీ విలువ ఎనిమిది వందల కోట్లకు పైకి చేరింది. ప్రస్తుతం అరవై దేశాల్లో పీజీ పేపర్స్‌ వ్యాపారాన్ని విస్తరించింది. అమెరికా, చైనా, ఇండియా, ఈజిప్టు, స్వీడన్‌లలో సొంతకార్యాలయాలు ఉన్నాయి.

పూనమ్‌కు అండగా...
పీజీ పేపర్స్‌ని పూనమ్‌ ప్రారంభించిన రెండేళ్లకు భర్త పునీత్‌గుప్తా కూడా ఎనభై లక్షల జీతం వచ్చే ఉద్యోగాన్ని వదిలేసి కంపెనీలో చే రారు. భార్యాభర్తలు ఇద్దరు కలిసి వ్యాపారాభివృద్ధికి కృషిచేశారు. దీంతో  అనతి కాలంలోనే పీజీ పేపర్స్‌ ప్రపంచవ్యాప్తంగా మంచి గుర్తింపుని తెచ్చుకుంది. పేపర్‌ ట్రేడింగ్‌ కంపెనీతోపాటు డెంటల్‌ హెల్త్‌ వంటి వ్యాపారాల్లోనూ పూనమ్‌ రాణిస్తోంది.
 
అందరూ అదర్శమే...
‘‘నాకు చాలామంది రోల్‌ మోడల్స్‌ ఉన్నారు. ఒక్కోక్కరి నుంచి ఒక్కో విషయాన్ని నేర్చుకుని ఈ స్థాయికి ఎదిగాను. నాన్న, మామయ్య, టీచర్స్‌ నన్ను చాలా ప్రభావితం చేశారు. పెద్దయ్యాక మదర్‌ థెరిసా, ఇందిరా గాంధీ వంటి వారు మహిళలు ఏదైనా చేయగలరని నిరూపించి చూపించారు. వీరిని ఆదర్శంగా తీసుకుని ధైర్యంగా ముందుకెళ్తూ విజయాలు సాధిస్తున్నాను’’.
– పూనమ్‌ గుప్తా

మరిన్ని వార్తలు