‘ఆ అధికారులను వెంటనే తొలగించండి’

25 Mar, 2019 18:23 IST|Sakshi

టీడీపీ అనుకూలంగా ఏపీ డీజీపీ.. కొందరు అధికారులు

వారిని తొలగిస్తేనే ఎన్నికలు పారదర్శకంగా జరుగుతాయి

కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసిన వైఎస్సార్‌సీపీ

సాక్షి, న్యూఢిల్లీ: సార్వత్రిక ఎన్నికల్లో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుకి అనుకూలంగా వ్యవహరిస్తున్న ప్రభుత్వ అధికారులను విధుల నుంచి తొలగించాలని కోరుతూ.. కేంద్ర ఎన్నిక‌ల సంఘానికి వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఫిర్యాదు చేసింది. సోమవారం సీఈసీతో భేటీ అనంతరం ఆ పార్టీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి మీడియాతో మాట్లాడారు. ఏపీ డీజీపీ ఆర్పీ ఠాకూర్‌ టీడీపీ సహాయకుడిగా పనిచేస్తున్నారని, ప్రభుత్వం చేస్తోన్న అధికార దుర్వినియోగంపై చర్యలు తీసుకోవాలని ఈసీని కోరినట్లు ఆయన వెల్లడించారు. అడీషనల్‌ డీజీ ఇంటిలిజెన్స్‌ వెంకటేశ్వరరావు, యోగానంద్‌లను ఎన్నికల విధుల నుంచి తప్పించాలని, నిష్పక్షపాతంగా ఎన్నికలు జరిగేలా చూడాలని ఈసీకి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు వైఎస్సార్‌సీపీ నేతలు ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, వేమిరెడ్డి ప్రభాకర్‌ రెడ్డి, వైవీ సుబ్బారెడ్డి కేంద్ర ఎన్నికల సంఘంతో సోమవారం ప్రత్యేకంగా సమావేశమైయ్యారు.

ఉమ్మడి రాష్ట్రంలో ఆరుగురు డీజీలు ఉండేవారిని, విభజన అనంతరం చట్టవిరుద్ధంగా తొమ్మిది మందిని నియమించారని విజయసాయి రెడ్డి వెల్లడించారు. తమ పార్టీకి చెందిన కార్యకర్తలపై టీడీపీ ప్రభుత్వం అక్రమంగా 438 కేసులు పెట్టినట్లు ఈసీ దృష్టికి తీసుకెళ్లామని ఆయన తెలిపారు. వైఎస్సార్‌సీపీకి అనుకూలంగా ఉన్న ఓట్లను ప్రభుత్వం కుట్రపూరితంగా తొలగిస్తోందని ఫిర్యాదు చేసినట్లు వెల్లడించారు. పోలీసు విభాగంలో 37 మంది అధికారుల‌కు చట్టవిరుధంగా ప‌దోన్నతి క‌ల్పించార‌ని, డీజీపీగా ఠాకూర్‌ ఉంటే ఎన్నికలు పారదర్శకంగా జరిగే అవకాశం లేదని ఆయన అన్నారు.

చ‌ట్ట వ్యతిరేకంగా శ్రీకాకుళం, విజ‌య‌న‌గ‌రం జిల్లా ఎస్పీలుగా నాన్‌ క్యాడ‌ర్ ఆఫీసర్‌లను నియ‌మించార‌ని ఆయన పేర్కొన్నారు. పోలీసుల సాయంతో డ‌బ్బును ఓటర్లకు పంచుతున్నారని, వాటికి సంబంధించిన పూర్తి ఆధారాలను ఈసీకి అప్పగించామని తెలిపారు. ప్రజాశాంతి పార్టీ గుర్తు హెలికాప్టర్ గుర్తు మార్పు విషయంలో రివ్యూ పిటిషన్‌ దాఖలు చేస్తూ.. పార్టీ అభ్యంతరాలను ఈసీకి నివేధించారు.

మరిన్ని వార్తలు