‘విజయ’ కాంతులు!

20 Oct, 2019 18:51 IST|Sakshi

సాక్షి, విజయవాడ : పావన కృష్ణాతీరం విద్యుత్‌ కాంతులీనుతోంది. ఈ ఏడాది ఆశించిన మేర వర్షాలు కురవడం.. కృష్ణమ్మ పరవళ్లతో ఈ ప్రాంతంలో పచ్చదనం పరిఢవిల్లడంతోపాటు సాయంత్రం వేళ విజయవాడ దేదీప్యమానంగా వెలుగొందుతోంది. తాడేపల్లి నుంచి ఓమారు ఈ ‘వాడ’ను చూస్తే  ఇంద్రలోకం ఇక్కడ కొలువైందన్న భావన కలుగుతోంది. అటు దుర్గమ్మ కొండ, ఇటు కాళేశ్వరరావ్‌ మార్కెట్‌ పరిసరాలు, పద్మావతీ ఘాట్‌.. ఇలా ఒకటేమిటీ కృష్ణాజలాల్లో  సాయంత్రం వేళ ఆయా ప్రతిబింబాలు విద్యుత్‌ కాంతులతో మెరసిపోతున్నాయి. అలా మెరుస్తున్న విజయవాటికను ‘సాక్షి’ కెమెరాలో క్లిక్‌మనిపించింది.

                                               
కష్టం.. వర్ణనాతీతం 
మగువల అందాలను ద్విగుణీకృతం చేసే రంగు రంగుల చీరల వెనుక కార్మికుల కాయాకష్టం అపారం. శ్వేతవర్ణంలోని నూలును వేడి నీళ్లలో ఉడకబెట్టి, రంగుల తొట్టెల్లో ముంచి నానబెట్టి, వాటిని పిండి ఆరబెట్టి కట్టల రూపంలో కట్టి అమ్ముతారు. నూలు కండెలను రంగుల్లో ముంచి ఇనుప కడ్డీలు ఉపయోగించి పిండేటప్పుడు తమ బలమంతా ఉపయోగిస్తారు. ఎప్పుడైనా పట్టుతప్పితే ఇనుప కడ్డీలతో ప్రమాదం పొంచి ఉంటుంది. చేతికి ఎటువంటి తొడుగులు లేకుండా.. కనీసం ఒంటిమీద బట్టలు కూడా సరిగా లేకుండా, తువాలు చుట్టకుని ఎర్రటిఎండలో తమ ఆరోగ్యాన్ని పణంగా పెట్టి పొట్టకూటికోసం వారు పడుతున్న కష్టం వర్ణనాతీతం. గత 30 ఏళ్లుగా ఇదే వృత్తిలో ఉంటున్న వారిని చూస్తే రంగుల దారాల వెనుకున్న కష్టం తెలుస్తోంది. మంగళగిరి సమీపంలో కనిపించిన కార్మికుల చిత్రాలను దృశ్యాలను ‘సాక్షి’ కెమెరాలో బంధించింది.

చక్కగా... చిక్కగా...!
కృష్ణమ్మ పరవళ్లు మత్స్యకారులకే కాదు.. జీవరాశులకు కూడా కడుపునింపుతున్నాయి. గంటలకొద్దీ చెరువుల్లో ఒంటికాలివీుద నిలబడి చేపలు దొరికే వరకు ఎదురుచూడాల్సిన అగత్యం లేకుండానే ప్రకాశం బ్యారేజీ చెంత నీటికొంగలకు చేపలు ఇట్టే చిక్కిపోతున్నాయి. నీటి ఉధృతిలో కొట్టుకుపోతున్న వీటిని కొంగలు అలవొకగా నొట చిక్కించుకుని కడుపులో వేసుకుంటున్నాయి!. శనివారం మధ్యాహ్నం బ్యారేజ్‌లో వద్ద ఎదురైన ఈ దృశ్యాలు పర్యాటకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. 

మరిన్ని వార్తలు