నియంతలా వ్యవహరిస్తే పతనమే..!

20 Oct, 2019 18:31 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : సీఎం కేసీఆర్ ప్రవర్తన నిజాంను తలపిస్తోందని మాజీ మంత్రి మోత్కుపల్లి అన్నారు. సుందరయ్య విజ్ఞాన భవన్‌లో ఆర్టీసీ కార్మికుల ఐకాస, విపక్షనేతల సమావేశం జరిగింది. కార్యక్రమం అనంతరం మాజీ మంత్రి మోత్కుపల్లి మాట్లాడుతూ.. తెలంగాణలో ఇంటికో ఉద్యోగం ఇస్తానని కేసీఆర్ రాష్ట్ర ప్రజలను ఇప్పటికే మోసం చేశాడని చెప్పారు. ఆర్టీసీ కార్మికులను సెల్ఫ్‌ డిస్మిస్ అనడానికి కేసీఆర్‌కు అర్హత లేదన్నారు. ఆర్టీసీ కార్మికులపట్ల కేసీఆర్‌ వ్యవహరిస్తున​ తీరు దుర్మార్గమరైనదన్నారు. ఆర్టీసీ ఆస్తులను అమ్మి సొంత ఆస్తులు పెంచుకొనే పనిలో కేసీఆర్ పడ్డాడని ఆరోపించారు. కేసీఆర్‌ ఓ నియంతలా వ్యవహరిస్తున్నారని, ఆయనను ఎదుర్కొనేందుకు రాజకీయపార్టీలనీ ఏకతాటిపైకి రావాల్సిన అవసరం ఉందన్నారు. ఈ సందర్భంగా ఆర్టీసీ సమ్మెపై స్పందించినందుకు గవర్నర్‌కు ధన్యవాదాలు తెలిపారు. 
టీజేఎస్ చీఫ్ కోదండరామ్ మాట్లాడుతూ.. హైకోర్టు తీర్పును సీఎం కేసీఆర్ గౌరవించి ఆర్టీసీ కార్మికులను వెంటనే చర్చలకు పిలవాలని అన్నారు. ఆర్టీసీ కార్మికులకు అండగా విపక్షాలు చేపట్టే నిరసన కార్యక్రమాల్లో అందరూ క్రియాశీలకంగా పాల్గొని, ఆర్టీసీని కాపాడుకోవాలని పిలుపునిచ్చారు.

ప్రభుత్వం సానుకూలంగా స్పందించకపోతే రేపటి నుంచి సమ్మెను మరింత ఉదృతం చేస్తామని తెలిపారు.
బీజేపీ నేత జితేందర్‌ రెడ్డి మాట్లాడుతూ.. ఆర్టీసీని రక్షించుకోవాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. కేసీఆర్ ఇచ్చిన హామీ మేరకు ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా ఆర్టీసీ కార్మికులకు జీతాలు ఇవ్వాలన్నారు. ఆర్టీసీ కార్మికుల సమ్మెకు, జేఏసీ తలపెట్టిన నిరసన కార్యక్రమాలకు భారతీయ జనతా పార్టీ సంపూర్ణ మద్దతుంటుందని తెలిపారు.
తెలంగాణ టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు రమణ మాట్లాడుతూ.. 65 నెలల కేసీఆర్‌ పాలనలో లక్షల కోట్లు అప్పులు తెచ్చుకున్నా.. ఆర్టీసీ అప్పులు మాత్రం చెల్లించలేక పోయారని విమర్శించారు. ఆర్టీసీ కార్మికుల ఆత్మహత్యలన్నీ ప్రభుత్వం చేసిన హత్యలేనని రమణ ఆరోపించారు. 65 నెలల కేసీఆర్‌ పాలనలో అప్పులపై శ్వేతపత్రం విడుదల చేయాలని టీడీపీ అధ్యక్షుడు రమణ డిమాండ్‌ చేశారు. 
కాంగ్రెస్‌నేత వీహెచ్‌ మాట్లాడుతూ.. ఆర్టీసీ కార్మికుల నిరసన కార్యక్రమాలకు కాంగ్రెస్‌ పార్టీ సంపూర్ణంగా మద్దతిస్తుందన్నారు. ఆర్టీసీ కార్మికుల సమస్యలు పరిష్కారమయ్యే చివరి క్షణం వరకు కార్మికులకు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. 

మరిన్ని వార్తలు