విజయవాడ రమేష్‌ ఆసుపత్రి గిన్నిస్‌ రికార్డ్‌

14 Nov, 2019 16:36 IST|Sakshi

సాక్షి, విజయవాడ: ఇరవై వేల గుండె ఆపరేషన్లు నిర్వహించి విజయవాడ రమేష్‌ ఆసుపత్రి గిన్నిస్‌ వరల్డ్‌ రికార్డ్‌ను సొంతం చేసుకుంది. గురువారం ఆస్పత్రి యాజమాన్యం... 1,020 మంది పేషేంట్లను ఒకే వేదికపై సమావేశపరిచింది. ఈ కార్యక్రమంలో ఆసుపత్రి అధినేత డా.రమేష్‌, సినీ హీరో రామ్‌ పాల్గొన్నారు. ఈ సందర్భంగా డాక్టర్‌ రమేష్‌ మాట్లాడుతూ.. గిన్నిస్‌ రికార్డు సొంతం చేసుకోవడంతో తమపై మరింత బాధ్యత పెరిగిందని తెలిపారు. ఆసుపత్రిలో పనిచేస్తున్న 3 వేల మంది సిబ్బంది సహకారంతోనే ఇది సాధ్యమయిందన్నారు. 1996లో ఆసుపత్రి ప్రస్థానం ప్రారంభమయ్యిందని, ఈస్ట్‌ కోస్ట్‌ ఏరియాలో మంచి గుర్తింపు తెచ్చుకున్నామని తెలిపారు. విజయవాడను ప్రపంచ పటంలో నిలపాలన్నదే ధ్యేయం అని పేర్కొన్నారు. 20 సంవత్సరాల్లో 20 వేల గుండె ఆపరేషన్లు విజయవంతంగా నిర్వహించామని వెల్లడించారు. త్వరలో హార్ట్‌ ట్రాన్స్‌ప్లాన్‌టేషన్‌ (గుండె మార్పిడి) కూడా చేపట్టబోతున్నామన్నారు. నిబద్ధత,పారదర్శకత ద్వారానే ఈ స్థాయికి చేరామని తెలిపారు.

>
మరిన్ని వార్తలు