దాహం.. దాహం

17 Feb, 2014 04:13 IST|Sakshi

నడిగడ్డ ప్రాంతంలో వేసవికి ముందే నీటిఎద్దడి తీవ్రరూపం దాల్చింది. చెంతనే రెండుజీవనదులు ఉన్నా తాగడానికి గుక్కెడునీళ్లు దొరకడం లేదు.   సమస్యను శాశ్వతంగా పరిష్కరించేందుకు తాగునీటి పథకాలు నిర్మించినా దాహార్తిని తీర్చలేకపోతున్నాయి. కోట్లు ఖర్చుచేసినా ఫలితం లేకుండా పోతోంది. ఈ నేపథ్యంలో బిందెనీటి కోసం ప్రజలకు మైళ్ల దూరం నడక తప్పడంలేదు.
 
 తుంగభద్ర, కృష్ణా రెండు జీవనదుల మధ్య ఉన్న అలంపూర్ ప్రజలను నిత్యం నీటికష్టాలు వెంటాడుతున్నాయి. నియోజకవర్గంలోని 145 గ్రామాల్లో సుమారు 50 గ్రామాలకు నాలుగు పథకాల ద్వారా అరకొరగా నీటిని సరఫరా చేస్తున్నారు. కాగా, నీటిఎద్దడి తీవ్రరూపం దాల్చుతుండటంతో సుమారు రూ.39 కోట్ల వ్యయంతో నాలుగు నీటిపథకాలను నిర్మిస్తున్నారు. అయితే వీటిలో కొన్ని నిర్మాణాలు పూర్తిచేసుకున్నా నీటిసరఫరా జరగడం లేదు. ఫలితంగా ఏటా వేసవిలో గత మూడేళ్లుగా ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేస్తున్నారు.  
 - న్యూస్‌లైన్, అలంపూర్  
 
 లీకేజీలతో నీటి వృథా....
 మానవపాడు మండలం బొంకూరు, చిన్నపోతులపాడు, పెద్దపోతులపాడు, చెన్నుపాడు, అలంపూర్ చౌరస్తా, పుల్లూరు గ్రామాలకు నీటిని అందించాల్సి ఉంది. కానీ నిత్యం పైప్‌లైన్‌ల లీకేజీ వంటి సమస్యలతో ఇప్పటికే ఈ పథకం నుంచి రెండు గ్రామాలకు నీటి సర ఫరా నిలిచిపోయింది.అలంపూర్ చౌరస్తాలో ఇటీవల రూ.6.50 లక్షల వ్యయంతో అదనపు పైప్‌లైన్ వేశారు. కానీ ఇప్పటికీ కనెక్షన్ ఇవ్వకపోవడంతో నీటి సమస్యకు పరిష్కారం లభించడం లేదు. అలాగే మానవపాడు, వడ్డేపల్లి మండలంలోని ఐదు గ్రామాలకు నీటిని అందించేందుకు మద్దూరు వద్ద ఈ పథకాన్ని నిర్మించారు. కానీ పథకం ఉందన్న మాటే కానీ నీటి సరఫరా మాత్రం కొండెక్కింది.  
 
 5 గ్రామాలకే నీళ్లు...
  బీచుపల్లి తాగునీటి పథకం ద్వారా 33 గ్రామాలకు నీటి సరఫరా జరగాల్సి ఉంది. మొదటి విడతలో రూ.నాలుగుకోట్ల వ్యయంతో పనులకు శ్రీకారం చుట్టారు. రెండోవిడతలో మంజూరైన రూ.ఐదుకోట్లతో 10 గ్రామాలకు మాత్రమే పైప్‌లైన్ పనులు జరుగుతున్నాయి. అయిదేళ్లుగా నిర్మిస్తున్న ఈ పథకం ద్వారా కేవలం ఐదు గ్రామాలకు మాత్రమే నీళ్లను అందిస్తున్నారు.
 

మరిన్ని వార్తలు