గబ్బిలం.. దైవంతో సమానం

6 Dec, 2017 12:50 IST|Sakshi

చిట్టమూరు: గబ్బిలం.. ఊరి చివర చెట్లకు తల్లకిందులుగా వేలాడే పక్షిలాంటి జీవి. నిజానికి ఇది క్షీరద జాతికి చెందినదైనా పక్షి తరహాలో సంచరించే ప్రత్యేక జీవి. ఇవి పగలంతా చెట్లకు వేలాడుతూ.. మేత కోసం రాత్రి సమయాల్లో మాత్రమే సంచరిస్తాయి. సుదూర ప్రాంతాలకు వెళ్లి.. ఆహారాన్ని వేటాడి సూర్యోదయానికి తిరిగి చెట్లపైకి చేరుకుంటాయి. ఈ జీవులను దైవంగా భావించేవారూ ఉన్నారు. చిట్ట మూరు మండలం గునపాడు, పొదలకూరు మండలం మర్రిపల్లి, ముత్తుకూరు మండలం కొత్తపాలెం, సైదాపురం మండలం పర్సారెడ్డిపల్లి ప్రజలు గబ్బిలాలు గ్రామంలో ఉంటే శుభం కలుగుతుందని నమ్ముతారు.

వేటగాళ్లు వాటిని పట్టికోకుండా.. ఆకతాయిలు చెదరగొట్టకుండా వాటిని కంటికి రెప్పలా కాపాడుకుంటున్నారు. ఈ గ్రామాల్లో గబ్బిలాలు సుమారు వందేళ్ల నుంచి ఉంటున్నాయని.. అవి వచ్చాకే తమ గ్రామాలు బాగుపడ్డాయని వృద్ధులు కథలుగా చెబుతుంటారు. ఇవి వాన రాకను తెలియజేస్తాయని.. రాత్రివేళ చెట్ల నుంచి కదలకపోతే వర్షం కురవబోతోందని సంకేతమని ఆ గ్రామాల ప్రజలు చెబుతున్నారు. వీటి కదలికల ఆధారంగానే రైతులు వ్యవసాయ పనులకు సమాయత్తం అవుతుంటారు.

ఇవి పక్షులు కాదు
వాస్తవానికి గబ్బిలాలు పక్షులు కాదు. పాలిచ్చే జాతికి చెందిన జంతువులు (క్షీరదాలు). ఇవి గుడ్లను పెట్టవు. పిల్లలను కంటాయి. క్షీరదాలలో ఎగరగలిగిన జంతువు ఇదొక్కటే. వీటికి కళ్లు, చెవులు, నోరు ఉంటాయి. కళ్లతో చూడకుండానే ఇవి దారి తెలుసుకుంటాయి. కటిక చీకట్లోనూ దేనినీ ఢీకొట్టకుండా ఎగరగలుగుతాయి. వీటి కళ్లకంటే చెవులే పవర్‌ ఫుల్‌. గబ్బిలం ఎగురుతున్నప్పుడు నోటితో సన్నని కూత వేస్తుంది. ఆ కూత మామూలు శబ్ద తరంగాల కన్నా ఎక్కువ ఫ్రీక్వెన్సీ కలది కావడంతో మన చెవులకు వినిపించదు. ఈ హై ఫ్రీక్వెన్సీ శబ్ద తరంగాలు ఎదురుగా ఉండే అడ్డంకులకు తగిలి, ప్రతిఫలించి వెనక్కి తిరిగొచ్చి గబ్బిలం చెవులనుయ తాకుతాయి. ఇవి అత్యంత అల్పమైన శబ్దాలను కూడా విని అత్యంత వేగవంతమైన ప్రయాణంలోనూ దిశను మార్చుకోగలుగుతాయి. ఇక్కడి గబ్బిలాలు కేవలం పురుగులను మాత్రమే ఆహారంగా తీసుకుంటాయి.

మరిన్ని వార్తలు