కరోనా: 250 మంది ఖైదీల తాత్కాలిక విడుదల?

25 Mar, 2020 09:47 IST|Sakshi

కరోనా నేపథ్యంలో ‘సుప్రీం’ మార్గదర్శకాల పర్యవసానం 

ఏడేళ్లలోపు శిక్ష పడ్డ ఖైదీలు, ఎక్కువ కాలం రిమాండ్‌లో ఉన్న వారి జాబితా సిద్ధం 

ఆరిలోవ (విశాఖ తూర్పు): కరోనా వైరస్‌ విజృంభణ నేపథ్యంలో..  విశాఖ కేంద్రకారాగారం నుంచి 250 మందికి తాత్కాలిక విడుదలకు ఆస్కారం కలుగుతోంది. కరోనా జోరు పెరుగుతున్న వేళ.. జైళ్లలో ఉన్న ఖైదీల సంఖ్యను తగ్గించాలని, తాత్కాలికంగా ఖైదీలను విడుదల చేయాలని సుప్రీం కోర్టు జైళ్ల శాఖకు ఆదేశించిన విషయం తెలిసిందే. ఆ సూచనలను గమనంలోకి తీసుకుని జైళ్లలో ఖైదీల విడుదలకు అధికారులు జాబితా సిద్ధం చేస్తున్నారు. (ఈ అమ్మ సెంటిమెంట్లను గౌరవించండి: మోదీ)

విశాఖ కేంద్ర కారాగారంలో నిబంధనల ప్రకారం ఏడేళ్ల లోపు శిక్షపడిన ఖైదీలు, ఎక్కువ కాలం రిమాండ్‌లో ఉన్న ఖైదీల జాబితా సిద్ధం చేస్తున్నామని, వీరంతా కలసి 250 మంది వరకు తాత్కాలికంగా విడుదలయ్యే అవకాశం ఉందని జైల్‌ డిప్యూటీ సూపరింటెండెంట్‌ ఎం.వెంకటేశ్వర్లు తెలిపారు. జైళ్లలో ఎక్కుమంది ఖైదీలుండడంతో, వారి సంఖ్య తగ్గించాలనే నిర్ణయం ప్రకారం తాత్కాలికంగా ఖైదీలను విడుదల చేస్తున్నట్లు తెలిపారు. ప్రస్తుతం ఇక్కడ శిక్ష పడిన, రిమాండ్‌ ఖైదీలు 1,350 మంది వరకు ఉన్నారని తెలియజేశారు.  

ఆరుగురు బంగ్లా దేశీయుల విడుదల 
విశాఖ కేంద్ర కారాగారం నుంచి ఆరుగురు బంగ్లా దేశీయులు మంగళవారం సాయంత్రం విడుదలయ్యారు. కొన్నాళ్ల క్రితం బంగ్లాదేశ్‌ నుంచి కొందరు బెంగళూరుకు కూలి పనుల కోసం వచ్చారు. వారిలో ఆరుగురు తిరిగి వెళ్తూ దారితప్పి విశాఖ చేరుకొని ఇక్కడ పోలీసులకు పట్టుబడ్డారు. వారి వద్ద ఎలాంటి ఆధారాలు లేకపోవడంతో కంచరపాలెం పోలీసులు విశాఖ కోర్టులో హాజరుపరిచారు.

కోర్టు వారికి సుమారు 5 నెలల జైలు శిక్ష విధించింది. అప్పటి నుంచి వారు సెంట్రల్‌ జైలులో శిక్ష అనుభవించారు. మంగళవారం వారి శిక్షా కాలం ముగియడంతో వారిని విడుదల చేసి కంచరపాలెం పోలీసులకు అప్పగించినట్టు జైలు అధికారులు తెలిపారు. అయితే ప్రస్తుతం కరోనా ప్రభావం తీవ్రంగా ఉన్న వేళ వారిని ఎలా బంగ్లాదేశ్‌ పంపాలో పోలీసులకు అర్థం కాని పరిస్థితి ఏర్పడింది. 
 

మరిన్ని వార్తలు