వైద్యుల స్పందన భేష్‌

8 May, 2020 04:52 IST|Sakshi
కేజీహెచ్‌లో చికిత్స పొందుతున్న బాధితులు

కేజీహెచ్‌లో 193 మందికి చికిత్స

వీరిలో 44 మంది చిన్నారులు

సకాలంలో స్పందించిన కేజీహెచ్‌ సిబ్బంది

ఆక్సిజన్‌ అందించడంతో కుదుటబడ్డ బాధితులు

వేర్వేరు ప్రైవేట్‌ ఆస్పత్రుల్లో 66 మందికి చికిత్స

రెండు సీహెచ్‌సీల్లో మరో 57 మంది

డాబాగార్డెన్స్‌/పాత పోస్టాఫీసు (విశాఖ దక్షిణ): తెలతెలవారుతోంది.. కేజీహెచ్‌ వైద్యులకు ఫోన్‌.. గ్యాస్‌ లీకయింది.. బాధితులు వస్తున్నారని. తర్వాత కొద్దిసేపటికే అంబులెన్సులు, కార్లు, జీపులు, బస్సుల్లో బాధితులను తెస్తున్నారు. పిల్లలు, పెద్దలు, వృద్ధులు.. వస్తూనే ఉన్నారు. వైద్యులు, సిబ్బంది వారిని చకచకా బెడ్ల మీదకు చేర్చారు. ఆక్సిజన్‌ పెట్టారు. వేగంగా వైద్యం అందించారు. నేవీ నుంచి కూడా అధునాతన ఆక్సిజన్‌ యంత్రాలను తెప్పించారు. అలుపెరగకుండా వైద్యం అందించారు. బాధితుల ప్రాణాలను కాపాడారు. విషవాయువును పీల్చి తీవ్ర అస్వస్థతకు గురైన వారితో కేజీహెచ్‌ అంతా నిండిపోయింది. క్యాజువాలిటీతో పాటు రాజేంద్రప్రసాద్‌–ఎ, రాజేంద్రప్రసాద్‌–బి, రాజేంద్రప్రసాద్‌–డి, పీడియాట్రిక్‌ వార్డు, ఎస్‌–1.. ఇలా పలు వార్డుల్లో క్షతగాత్రులను చేర్పించి చికిత్స అందిస్తున్నారు. వార్డులన్నీ నిండిపోవడంతో చాలామంది కొద్దిసేపు బయటే ఉండిపోవాల్సి వచ్చింది.

ఊపిరి ఆడకపోవడంతో పాటు కళ్ల మంటలతో కొందరు.. చర్మంపై దద్దుర్లతో మరికొందరు.. కడుపులో వికారంతో ఇంకొందరు.. ఇలా పలు లక్షణాలతో ఎందరో అస్వస్థతకు గురయ్యారు. వీరందరికీ కేజీహెచ్‌ వైద్యులు, సిబ్బంది అత్యవసర చికిత్స అందిస్తున్నారు. మొత్తం 193 మందిని కేజీహెచ్‌కు తరలించారు. వీరిలో 44 మంది చిన్నారులు ఉన్నారు. ప్రాణాపాయంలో ఉన్న ఆరుగురిని ఐఆర్‌సీయూలో ఉంచి వైద్యం చేస్తున్నారు. ఉదయం 11 గంటల సమయంలో వీరంతా కుదుటపడ్డారు. ఐఆర్‌సీయూలో ఉన్న ఆరుగురి ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు ఆస్పత్రి సూపరింటెండెంట్‌ తెలిపారు. కాగా, ఈ ఘటనలో తీవ్ర అస్వస్థతకు గురై ఆస్పత్రిలో చేరిన వారిలో ఎవరెవరు ఎక్కడెక్కడ ఉన్నారో తెలీక కుటుంబ సభ్యులు కంగారుపడ్డారు. మృతిచెందిన వారి కోసం మార్చురీ వద్ద పడిగాపులు కాసిన వారు ఇంకొందరు. ఇలా కేజీహెచ్‌లో గురువారం రోజంతా ఉద్విగ్న వాతావరణం నెలకొంది.

కేజీహెచ్‌లో చికిత్స పొందుతున్న బాధితులు

ప్రైవేట్‌ ఆస్పత్రుల్లో.. 
ఇదే ఘటనలో అస్వస్థతకు గురైన మరికొందరిని నగరంలోని వివిధ ప్రైవేట్‌ ఆస్పత్రులకు తరలించారు. కేర్‌ ఆస్పత్రి–1లో 18 మంది, సెవెన్‌హిల్స్‌లో నలుగురు, క్యూ–1లో ముగ్గురు, అపోలోలో 28 మంది, ఎంబీ ఆస్పత్రిలో 12 మంది, పినాకిల్‌ ఆస్పత్రిలో ఒకరు మొత్తం 66 మంది చికిత్స పొందుతున్నారు. అలాగే, గోపాలపట్నం కమ్యూనిటీ హెల్త్‌ సెంటర్లో 32 మంది, పెందుర్తి కమ్యూనిటీ హెల్త్‌ సెంటర్‌లో 25 మంది, కొత్తవలసలో హెల్త్‌ సెంటర్‌లో 32 మంది చికిత్స పొందుతున్నారు.

ఇంటి బయటే స్పృహ కోల్పోయా
గ్యాస్‌ లీకైన తర్వాత ఇంటి బయటకు వచ్చి స్పృహ కోల్పోయాను. ఆస్పత్రికి ఎవరు తీసుకువచ్చారో తెలీదు. ఇక్కడకు వచ్చాకే మెలకువ వచ్చింది. గ్యాస్‌ పీల్చిన సమయంలో ఊపిరి ఆడలేదు. ప్రస్తుతం బాగుంది. – డి.నాగేంద్రబాబు, బాధితుడు

ఏం జరిగిందో అర్థంకాలేదు
తెల్లవారుజామున నిద్రలోనే గ్యాస్‌ పీల్చడంవల్ల తీవ్ర అస్వస్థతకు గురయ్యాను. కళ్లు, ముక్కు మండిపోయాయి. ఇంటి వెలుపలికి వచ్చి స్పృహ కోల్పోయాను. కళ్లు తెరిచేసరికి కేజీహెచ్‌లో ఉన్నాను. ఏం జరిగిందో అర్ధంకాలేదు. – ఇల్లపు శివాజీ, బాధితుడు

>
మరిన్ని వార్తలు