అందులో కోటి 30 లక్షల మంది ప్రయాణం..

4 Dec, 2023 15:52 IST|Sakshi

సామాన్యులకు విమాన ప్రయాణాన్ని అందుబాటులోకి తీసుకురావాలని కేంద్రం ఉడాన్‌ యోజన(ఉడే దేశ్‌కా అమ్‌ నాగరిక్‌) పథకాన్ని ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. అందుకు అనుగుణంగా విమానయాన కంపెనీలకు కొన్ని రాయితీలు ఇస్తోంది. కేంద్రం ఇచ్చే రాయితీ గడువు ముగిసిన తర్వాత కొన్ని సర్వీసులు ఆగిపోయాయనే వాదనలు ఉన్నాయి. కొన్ని అంతకు ముందు నిలిచిపోయినట్లు తెలిసింది. అయితే తాజాగా కేంద్రం రూట్లను తగ్గించి విమానాలు నడుపుతున్నారని పలువురు భావిస్తున్నారు. దాంతో సామాన్య ప్రజలు ఎంతో ఇబ్బందులు పడుతున్నారు. చాలా పార్టీల నేతలు వాటిపై ఎలాంటి ప్రశ్నలు అడగడంలేదు. అయితే తాజాగా జరుగుతున్న పార్లమెంట్‌ సమావేశాల్లో ఆంధ్రప్రదేశ్‌ ఎంపీ విజయసాయిరెడ్డి అడిగిన ప్రశ్నకు పౌర విమానయానశాఖ మంత్రి జ్యోతిరాధిత్యసింథియా స్పందించారు.  ఇప్పటికే కోటి 30 లక్షల మంది విమానాల్లో ప్రయాణించారని తెలిపారు. 

‘దేశ వ్యాప్తంగా ప్రభుత్వం కేటాయించిన రూట్లలో మూడేళ్ల కన్సెషన్‌ గడువు ముగిసింది. దాంతో కేవలం 7 శాతం (54 రూట్లు) మాత్రమే కార్యకలాపాలు సాగుతున్నట్లుగా కాగ్‌ నివేదిక వెల్లడిస్తోంది. మిగిలిన రూట్లు కన్సెషన్‌ గడువు వరకు కూడా ఎందుకు మనుగడ సాగించలేకపోయాయి’ అంటూ సోమవారం రాజ్యసభ ప్రశ్నోత్తరాల సమయంలో వైఎస్సార్‌సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి జవాబిచ్చారు.

‘ఉడాన్‌ యోజన పథకం ద్వారా ఇప్పటి వరకు కోటి 30 లక్షల మంది విమాన ప్రయాణం చేశారు. దేశ వ్యాప్తంగా 76 ఎయిర్‌పోర్టులు ఉడాన్‌ యోజనలో భాగంగా ఉన్నాయి. ఈ స్కీం కింద కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న వయబిలిటీ గ్యాప్‌ ఫండింగ్‌ (వీజీఎఫ్‌) వల్ల ఇప్పటి వరకు 2 కోట్ల 75 లక్షల విమాన ప్రయాణాలు జరిగాయి. విమానయాన ప్రయాణానికి దూరంగా ఉన్న ఈశాన్య రాష్ట్రాలు  దేశంలోని ప్రధాన నగరాలతో అనుసంధానం చేయబడ్డాయి. ఈ రాష్ట్రాల్లో కొత్తగా 9 ఎయిర్‌పోర్ట్‌ల నిర్మాణం జరిగింది. అందులో 6 ఎయిర్‌పోర్ట్‌లు కేవలం ఉడాన్‌ యోజన కిందే ఏర్పాటయ్యాయి. ఈ పథకం కింద ఆయా రూట్లలో విమానాలు నడిపే సంస్థలకు మూడేళ్లపాటు  వయబిలిటీ గ్యాప్‌ ఫండింగ్‌ను చెల్లించాలని ప్రతిపాదించాం. దాంతో ఈ పథకం ద్వారా మొదట్లో వేయి రూట్లను లక్ష్యంగా చేసుకున్నాం. ఇందులో 74 రూట్లలో మూడేళ్ళ కాల వ్యవధి తర్వాత కూడా కార్యకలాపాలు కొనసాగుతున్నాయి. అయితే మూడేళ్ల తర్వాత గిట్టుబాటు కాని రూట్ల స్థానాల్లో కొత్త రూట్లను గుర్తిస్తున్నాం. ప్రజలు విమాన ప్రయాణానికి అలవాటు పడుతున్న కొద్దీ ఈ రూట్ల సంఖ్య కూడా పెరుగుతుంది. 1920లో కోటి 44 లక్షలు ఉన్న విమాన ప్రయాణికుల సంఖ్య 2030 నాటికి 42 కోట్లకు చేరుతుందని అంచనా వేస్తున్నాం’అని మంత్రి వివరించారు.

దేశంలో ఇటీవల నెలకొన్న ప్రత్యేకపరిస్థితుల వల్ల గరిష్ఠంగా ఒకరోజు 4 లక్షల మంది విమానాల్లో ప్రయాణించారు. కొవిడ్‌కు ముందు 2019 లెక్కల ప్రకారం దేశీయంగా నడిచే విమానాల్లో వారానికి దాదాపు 90 వేల మంది ప్రయాణించారని సమాచారం. 

 ఇదీ చదవండి: ప్రపంచంలోనే నాసా కంటే ఎక్కువ డేటా ట్రాన్స్‌ఫర్‌..! కానీ..

ఏపీలో గతంలో మొత్తం 4 రౌండ్ల బిడ్డింగ్ తర్వాత 40 ఉడాన్ రూట్లను గుర్తించారు. ఉడాన్ రూట్లలో భాగంగా కడప, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, రాజమండ్రి, కర్నూలు, ప్రకాశం బ్యారేజి (సీ ప్లేన్) నుంచి విమాన సర్వీసులకు అనుమతులు మంజూరయ్యాయి. హైదరాబాద్, బెంగళూరు, చెన్నై వంటి మెట్రో నగరాలతో పాటు బెలగాం, కొల్హాపూర్, హుబ్లి, జగ్‌దల్‌పూర్, కలబురిగి (గుల్బర్గా), కలైకుండ ప్రాంతాల నుంచి విమాన సర్వీసులు నడిపేలా ఆమోదం తెలిపారు.

>
మరిన్ని వార్తలు