అన్ని దారులు ఇచ్ఛాపురం వైపే..

9 Jan, 2019 08:07 IST|Sakshi
ఫైలాన్‌ వద్ద అనకాపల్లి పార్లమెంటు కో ఆర్డినేటర్‌ వరుదు కళ్యాణి, పార్టీ మహిళా నేతలు పిరియా విజయ, మళ్లా శ్రీదేవి

మహోజ్వలఘట్టంలో భాగస్వాములయ్యేందుకు ఉత్సాహం

ఉత్తుంగ తరంగంలా ఉరకలెత్తుతున్న విశాఖ జనం

పార్టీలకతీతంగా కదులుతున్న విశాఖ దండు

సాక్షి, విశాఖపట్నం: అందరి చూపులు అక్కడే... అన్ని దారులు అటువైపే.. వస్తున్నాయ్‌.. వస్తున్నాయ్‌ జగన్నాథ రథచక్రాలొస్తున్నాయ్‌ అన్నట్టుగా వేలు.. లక్షలు.. కోట్ల అడుగులు అటువైపు కదులుతున్నాయి. వజ్రసంకల్పంతో దాదాపు 14 నెలల పాటు సాగిన ప్రజాసంకల్పయాత్ర ముగింపు పండగలో భాగస్వాములవ్వాలని ప్రతి ఒక్కరూ ఉత్తుంగ తరంగాల్లో ఉరకలెత్తు తున్నారు. ఈ మహోజ్వల ఘట్టానికి వేదికవుతున్న శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం వెళ్లేందుకు పార్టీలకతీతంతా జనసైన్యం కదులుతోంది. కదం తొక్కుతోంది. ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి గతేడాది నవంబర్‌ 6వ తేదీన చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర బుధవారంతో ముగియనుంది. నిప్పులు చెరిగే ఎండను, కుండపోతవర్షాన్ని, వణికించే చలిని సైతం లెక్క చేయ కుండా మొక్కవోని సంకల్పంతో నగరాలు, పట్టణాలు, పల్లెలనే తేడాలేకుండా అలుపెరగకుండా సాగిన పాదయాత్ర నేటి మధ్యాహ్నంతో ముగియనుంది.

ప్రజాసంకల్ప యాత్ర ముగింపును పురస్కరించుకుని ఇచ్ఛాపురంలో ఏర్పాటు చేసిన 88 అడుగుల భారీ ఫైలాన్‌ ఆవిష్కరించి అనంతరం జరిగే భారీబహిరంగసభలో జగన్‌మోహన్‌ రెడ్డి ప్రసంగించనున్నారు. ఈ మహోజ్వల ఘట్టంలో భాగస్వాములవ్వాలని విశాఖ వాసులు ఉవ్విళ్లూరుతున్నారు. ఈ చరిత్రాత్మక పాదయాత్ర ముగింపు పండుగలో పాల్గొనేందుకు జిల్లా వాసులు వేలాదిగా తరలి వెళ్తున్నారు. ఇచ్ఛాపురం, బరంపురం వైపు వెళ్లే ఆర్టీసీ బస్సులు, రైళ్లన్నీ మంగళవారం సాయంత్రం నుంచే కిక్కిరిసిపోయాయి. ఇప్పటికే అనకాపల్లి పార్లమెంటు కో ఆర్డినేటర్‌ వరుదు కళ్యాణితో పాటు పెద్ద సంఖ్యలో పార్టీ నేతలు, శ్రేణులు ఇచ్చాపురానికి తరలి వెళ్లారు. పార్టీ సీనియర్‌ నేత బొత్స సత్యనారాయణ, మాడుగుల ఎమ్మెల్యే బూడి ముత్యాలనాయుడు, విశాఖ, అనకాపల్లి పార్లమెంటు జిల్లా అధ్యక్షులు తైనాల విజయకుమార్, గుడివాడ అమర్‌నాథ్, విశాఖ సిటీ అధ్యక్షుడు మళ్ల విజయప్రసాద్, పార్లమెంటు కో ఆర్డినేటర్లు ఎంవీవీ సత్యనారాయణ, గొడ్డేటి మాధవిలతోపాటు అసెంబ్లీ కో ఆర్డినేటర్లు, పార్టీ, అనుబంధ విభాగాల రాష్ట్ర, జిల్లా, నియోజక వర్గ నేతలు బుధవారం తెల్లవారుజామున బయల్దేరి తరలి వెళ్తున్నారు. బస్సులు, కారులు, ప్రత్యేక వాహనాల్లో పార్టీ శ్రేణులతో పాటు పార్టీలకతీతంగా వివిధ వర్గాల ప్రజలు కూడా ఇచ్ఛాపురం తరలివెళ్తున్నారు.

మరిన్ని వార్తలు