ఉద్యోగాల సందడి

20 Sep, 2019 11:40 IST|Sakshi

విడుదలైన గ్రామసచివాలయ ఉద్యోగాల ఫలితాలు

పరీక్ష నిర్వహించిన పది రోజుల్లో ఫలితాలు విడుదల

5,915 పోస్టులకు 1,04,830 మంది హాజరు

కేటగిరీ–బిలో ఓసీ విభాగంలో రాష్ట్రస్థాయిలో ప్రథమ స్థానం సాధించిన జిల్లా విద్యార్థి

సంబరాల్లో విజేతలు

ఈ నెల 23 నుంచి 25వరకు ధ్రువపత్రాల పరిశీలన 

సాక్షి, విజయనగరం ఫోర్ట్‌:  ప్రభుత్వ కొలువుల కోసం ఏళ్లతరబడి ఎదురు చూస్తున్న నిరుద్యోగ యువత కల సాకరమయ్యే రోజు వచ్చింది. సచివాలయ ఉద్యోగ ఫలితాలు గురువారం విడుదల కావడంతో అధిక మార్కులు సాధించిన అభ్యర్థులు ఆనందపడుతున్నారు. సీఎం జగన్‌మోహన్‌రెడ్డి తీసుకున్న ఉద్యోగాల విప్లవం నిర్ణయంతో చిరకాల స్వప్నం నెరవేరనుందంటూ సంబరపడుతున్నారు. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో నోటిఫికేషన్లు, ఉద్యోగాల భర్తీల కోసం ఏళ్లతరబడి నిరీక్షణే మిగిలిందని చెబుతున్నారు. జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం ఉద్యోగాల జాతరను తీసుకొచ్చిందని, ప్రకటిం చిన తేదీ ప్రకారం ఉద్యోగాల భర్తీకి కృషిచేస్తోందన్నారు. పరీక్ష జరిగిన 10 రోజుల్లోనే ఫలితాలు విడుదల చేయడం దేశంలోనే చరిత్రాత్మకమని పేర్కొంటున్నారు. శుక్రవారం నాటికి మార్కులు పూర్తిస్థాయిలో తెలుస్తాయని అధి కారులు చెబుతున్నారు. ఇందులో ప్రతిభ ప్రకారం ఎవరికి పోస్టులు వస్తాయన్న విషయం స్పష్టత రానుంది.

1:1 నిష్పత్తిలో ఎంపిక..
జిల్లాలో 5,915 పోస్టులకు 14 రకాలు పరీక్షలు నిర్వహించారు. ఇందులో నాలుగు పరీక్షలు ఇంగ్లిష్‌లో, మిగిలిన పది పరీక్షలు ఇంగ్లిష్, తెలుగులో ప్రశ్నపత్రాలతో నిర్వహించారు. పరీక్షలకు మొత్తం 91.55 శాతం మంది హాజరయ్యారు. విడుదల చేసిన ఫలితాల్లో మెరిట్‌లో ఉన్న వారికి ఉద్యోగాలు వస్తాయి. పోస్టులు ప్రాప్తికి అభ్యర్థులను 1:1 నిష్పత్తిలో ధువపత్రాలు పరిశీలనకు పిలుస్తామని జెడ్పీ సీఈవో వెంకటేశ్వరరావు తెలిపారు.

జిల్లా స్థాయిలో ప్రతిభ కనపరిచిన అభ్యర్థులు.. 
జిల్లా స్థాయిలో సచివాలయ పరీక్షల్లో పలువురు తమ ప్రతిభ చాటారు. ప్రభుత్వం విడుదల చేసిన జాబితా ప్రకారం కొందరు పేర్లు విడుదల చేశారు. ఇందులో కేటగిరి–2(గ్రూప్‌–బీ) విభాగంలో పురుషులు విభాగంలో టి. సందీప్‌చంద్ర 118.5మార్కులు సాధించి జిల్లా,(రాష్ట్ర)స్థాయిలో ప్రథమస్థానంలో నిలిచాడు. 115 మార్కులతో మహిం తి సూరిబాబు రెండోస్థానంలో నిలిచాడు. పప్పల వెంకట ఉదయ కుమార్‌ 113 మార్కులు, కసిరెడ్డి వాసుదేవ 112.5 మార్కులతో తర్వాత స్థానాల్లో నిలిచారు. గ్రూప్‌–ఎ విభాగానికి సంబంధించి మెంటాడ సాయిరాం 113.5 మార్కులతో ప్రథమ స్థానంలో నిలిచాడు. మహిళలు విభాగంలో కేటగిరి–2 (గ్రూప్‌–ఎ) 108 మార్కులతో గేదెల మానస ప్రథమ స్థానం సాధించారు. విలేజ్‌ అగ్రి కల్చర్‌ అసిస్టెంట్‌(గ్రేడ్‌–2) విభాగంలో 104 మార్కులతో బొడ్డు గాయత్రి ప్రథమ స్థానం, 103 మార్కులతో చొక్కాపు సాయిబిందు రెండోస్థానం, ఏఎన్‌ఎం(గ్రేడ్‌–3) విభాగంలో శంబంగి పోలినాయిని సుకన్య 102.75 మార్కులు సాధించి ప్రథమ స్థానంలో నిలిచారు. ప్రభుత్వం విడుదల చేసే మెరిట్‌ జాబితా ప్రకారం సచివాలయం ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు ఈ నెల 23 నుంచి 25వ తేదీ వరకు ధ్రువపత్రాలు పరిశీలించనున్నారు.  

మరిన్ని వార్తలు