భిక్షగాళ్లు లేని బెజవాడగా మార్చేస్తాం

7 Jul, 2018 13:12 IST|Sakshi
బిచ్చగాళ్లతో మాట్లాడుతున్న మున్సిపల్‌ కమిషనర్‌ జె.నివాస్‌

వీఎంసీ కమిషనర్‌ జె.నివాస్‌

సాక్షి,అమరావతి బ్యూరో: నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో భిక్షగాళ్లు లేని బెజవాడగా మార్చేందుకు చర్యలు చేపడుతున్నామని వీఎంసీ కమిషనర్‌ జె.నివాస్‌ పేర్కొన్నారు. శుక్రవారం నగరంలోని నవజీవన్‌ బాల భవన్‌లో విజయవాడ రైల్వేస్టేషన్‌ పరిసర ప్రాంతాల్లోని భిక్షగాళ్లను వీఎంసీ ఆధ్వర్యంలో స్పెషల్‌ డ్రైవ్‌ చేపట్టారు. గుర్తించిన 80 భిక్షగాళ్లను తెలంగాణకు చెందిన అమ్మ, నాన్న అనాథాశ్రయానికి అప్పగించే కార్యక్రమాన్ని కమిషనర్‌ నివాస్‌ పర్యవేక్షించారు. ఈసందర్భంగా భిక్షగాళ్లకు బిస్కెట్లు అందజేశారు.

అనంతరం మీడియాతో మాట్లాడుతూ హైదరాబాద్‌కు చెందిన  అమ్మ, నాన్న ఫౌండేషన్‌ భిక్షగాళ్లను, అనాథలను అక్కున చేర్చుకొనే మంచి çసంస్థ అని చెప్పారు. సంస్థకు అప్పగించే ప్రతిఒక్కరి ఫొటోలు పూర్తి వివరాలు సేకరించినట్లు వివరించారు. అలాగే వారికి ప్రభుత్వ పథకాలు వర్తింపజేసేందుకు రేషన్‌ కార్డులు ఇచ్చేలా ఈ సంస్థ నిర్వాహకులు ఏర్పాటు చేస్తారని ఆయన పేర్కొన్నారు. భిక్షగాళ్లు్ల లేని బెజవాడగా తీర్చిదిద్దేందుకు ఇది తొలిఅడుగు అని అభిప్రాయపడ్డారు. త్వరలోనే మిగిలిన భిక్షగాళ్లను కూడా ప్రత్యేక డ్రైవ్‌ ద్వారా అమ్మ, నాన్న ఎన్‌జీవో సంస్థకు అప్పగించనున్నట్లు వెల్లడించారు..

రాజీవ్‌ గాంధీ హోల్‌సేల్‌ మార్కెట్‌ తరలింపు
విజయవాడ: నగరంలో రాజీవ్‌గాంధీ హోల్‌సేల్‌ మార్కెట్, పూల మార్కెట్‌లు వేరే ప్రాంతాలకు తరలించనున్నట్లు మున్సిపల్‌ కమిషనర్‌ జె.నివాస్‌ తెలిపారు. నగర పాలక సంస్థ కార్యాలయంంలో తన చాంబర్‌లో హోల్‌సేల్‌ మార్కెట్‌ వ్యాపారులతో శుక్రవారం సమావేశం నిర్వహించారు. కమిషనర్‌ మాట్లాడుతూ మార్కెట్‌ తరలింపునకు సహకరించాలని కోరారు.  విజయవాడ– అమరావతి గేట్‌వే ప్రాజెక్ట్‌ కింద ప్రకాశం బ్యారేజ్‌ నుంచి ఆర్టీసీ బస్టాండ్‌ వరకు ఉన్న ప్రాంతాన్ని అభివృద్ధి చేయనున్నమని వివరించారు. దీని దృష్ట్యా హోల్‌సేల్‌ మార్కెట్‌లను వేరే ప్రాంతాలకు తరలించాల్సిన అవసరం ఏర్పడిందన్నారు. అమరావతి రాజధానికి సమీపంలో విజయవాడ కేంద్ర బిందువు అయిందన్నారు. అందు వలన వ్యాపారాలు మార్కెట్లను తరలించేందుకు సహకరించాలని మున్సిపల్‌ కమిషనర్‌ కోరారు. సమావేశంలో కార్పొరేషన్‌  ఎస్టేట్‌ ఆఫీసర్‌ సి.హెచ్‌.కృష్ణమూర్తి పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు