ఆత్మలకు ఓట్లు!

19 Dec, 2013 05:49 IST|Sakshi

సాక్షి ప్రతినిధి, ఆదిలాబాద్ : ప్రజాస్వామ్యంలో ఓటు ప్రజల చేతిలో పాశుపతాస్త్రం వంటిది. అటువంటి ఓటు ప్రాధాన్యతను గుర్తించిన ఎన్నికల సంఘం తప్పులు లేని ఓటర్ల జాబితాను తయారు చేయాలని అధికారులను ఆదేశించింది. కానీ, ఓటర్ల జాబితాలో సిత్రాలు చోటు చేసుకుంటూనే ఉన్నాయి. జాబితా అంతా తప్పుల తడకగా మారింది. ఓటర్ల జాబితాను సవరించాల్సిన అధికారులు, సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండటంతో పొరపాట్లు దొర్లుతూనే ఉన్నాయి.
 
 కొందరు చనిపోయి ఏళ్లు గడుస్తున్నా వారి పేర్లు జాబితాలో ఉన్నాయి. ఒక్కొక్కరు రెండు, మూడేసి చోట్ల నమోదు చేసుకున్నా జాబితాలో నుంచి వారి పేరు తొలగించలేదు. పేరు ఒకరిది అయితే ఫొటో మరొకరిది, పురుషులకు బదులుగా మహిళలు, భర్త పేరుకు బదులు తండ్రి పేరు, వృద్ధుల ఫొటోకు యువకుల వయసు, యువకుల ఫొటోలకు బదులు వృద్ధుల ఫొటోలు.. ఇలా ఓటర్ల జాబితాలో తప్పులు ఉన్నా ఎప్పటికి సవరిస్తారో తెలియడం లేదు. ఈ నేపథ్యంలో 2014లో జరిగే ఎన్నికలు కీలకం కాగా నేతల తలరాతలు మార్చేది కూడా బోగస్ ఓటర్లేనన్న చర్చ కూడా జరుగుతోంది.
 
 ప్రత్యేక ఫారాలున్నా తప్పని ‘బోగస్’ బెడద
 ఓటర్ల నమోదు సందర్భంగా జిల్లా ఉన్నతాధికారులు బోగస్ ఓటర్ల తొలగింపునకు కూడా ప్రాధాన్యత ఇస్తున్నారు. ఇందుకోసం గ్రామ, మండల, నియోజకవర్గం, జిల్లాస్థాయిల్లో అవగాహన సదస్సులు నిర్వహించారు. ప్రత్యేకంగా రూపొందించిన ఫారాల ద్వారా బోగస్ ఓటర్లను తొలగించే ప్రయత్నం కూడా చేస్తున్నారు. జిల్లాలో లక్ష వరకు బోగస్ ఓటర్లుంటారని అంచనా వేసిన అధికారులు కొత్తగా 2,20,920 ఓటర్లను నమోదు చేసుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. మొదట ఎన్నికల సంఘం ప్రకటించిన విధంగా మంగళవారంతో గడువు ముగియగా.. ఈ నెల 23 వరకు గడువు పెంచారు. ఇప్పటికీ జిల్లాలో కొత్తగా ఓటుహక్కును పొందేందుకు 1,76,045 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఓటర్ల నమోదుపై జిల్లా యంత్రాంగం బాగానే స్పందించినా బోగస్ ఓటర్లను తొలగించడం నిర్లక్ష్యం కనిపిస్తుందన్న విమర్శలు ఉన్నాయి. కొత్తగా నమోదు చేసుకునే ఓటర్ల విషయంలో తప్పులు దొర్లకుండా ఉండేందుకు, తప్పులు దొర్లితే సవరించడానికి ఒక ప్రత్యేకమైన 8 నంబర్ ఫారం రూపొందించినా ఫలితం లేదు. బోగస్ ఓటర్ల తొలగింపు, కొత్త ఓటర్ల నమోదులో తప్పులు లేకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నామని చెప్తున్నా.. ఆ జాబితాలో బోగస్ పేర్లు ఉండటంపై సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి.
 
 ఓటర్ల జాబితాలో తప్పులు మచ్చుకు కొన్ని..
     తాండూర్ మండలం మాదారం-3 ఇంక్లైన్‌కు చెందిన మీసాల భీమయ్య, బాపుగూడెంకు చెందిన జైనేని పోశం, అచ్చలాపూర్‌కు చెందిన ఈర్ల మల్లయ్య, రేపల్లెవాడకు చెందిన రేగుల పోశం, ఆకుల వెంకటి, రేగుల ఓదెలు, ముడ్రాతి శారద, మేడి శంకర్.. చౌటపల్లి గ్రామపంచాయతీకి చెందిన దాడి వెంకటేశ్, మాసాడి చంద్రయ్య, గజ్జెల చంద్రశేఖర్, నల్లుల పెంటయ్య, మాసాడి నారాయణ, కొమ్మ పోచయ్యలు మృతి చెందినా వీరి పేర్లు ఓటర్ల జాబితా నుంచి తొలగించలేదు. మాదారం గ్రామానికి చెందిన మేదరి ఓదెలు, కాపర్తి మమత, ఏబూసి లక్ష్మీతోపాటు చాలా మంది గతంలో ఓటు హక్కు వినియోగించుకున్నా ప్రస్తుత ఓటరు జాబితాలో వీరి పేర్లు తొలగించారు.
 
     నెన్నెల మండల కేంద్రానికి చెందిన ఓరుగంటి చంద్రమ్మ మూడేళ్ల క్రితం మృతి చెందింది. ప్రస్తుతం రూపొందించిన జాబితాలో ఆమె పేరు అలాగే  ఉంది. నెన్నెలకు చెందిన మహిళ గౌషియాబేగం ఫొటోకు బదులు పురుషుడి ఫొటోను ఆమె పేరు పక్కన పొందుపర్చారు. రమేశ్ చెన్నో జీ ఫొటో సరిగానే ఉన్నప్పటికీ మరొకరి పేరు ముద్రించారు. నెన్నెలలోని షేక్‌దావుద్ పేరు సరిగానే ఉన్నప్పటికీ ఫొటో ఇంకొకరిది ఉంది.
 
     ఇచ్చోడ మండల కేంద్రంలోని ఎస్సీ కాలనీకి చెందిన దుబ్బక నర్సింగు, జన్నరపు రాజన్న   కొన్ని రోజలు క్రితం మృతిచెందారు. కానీ, వారి పేర్లు జాబితా నుంచి తొలగించలేదు. మండల కేంద్రంలోని 97 పోలింగ్ స్టేషన్ పరిధిలో రాజలింగు పేరుకు బదులుగా కోజలింగు నమోదు అయింది. అదే పోలింగ్‌స్టేషన్‌లో జల్లి దుర్గయ్యకు బదులుగా, లక్ష్మి అని ఓటరు లిస్టులో ఉంది.
 
     జైపూర్ మండలం వేలాల గ్రామానికి చెందిన మీసాల మొండక్క, మీసాల దుర్గయ్య మృతి చెందినా వారి పేర్లు, ఫొటోలు ఓటరు జాబితాల నుంచి తొలగించలేదు.
 

మరిన్ని వార్తలు