కూలీ డబ్బులన్నీ ఇప్పుడు ఇంటికే  

23 Jun, 2020 10:43 IST|Sakshi

మద్య నియంత్రణతో కుటుంబాల్లో వెలుగులు

దశాబ్దాలుగా బానిసలైన వారిలోనూ మార్పు

తూర్పు గోదావరిలో ఆవిష్కృతమైన కొత్త చిత్రం

సాక్షి, కాకినాడ: తూర్పు గోదావరి జిల్లాలో టీడీపీ హయాంలో 535  మద్యం దుకాణాలు ఉండగా ఇప్పుడు 425కి పరిమితమయ్యాయి. ఈ నెలాఖరు కల్లా మరో 60 షాపులు తగ్గించేందుకు కసరత్తు జరుగుతోంది. ఇక 3,000కిపైగా ఉన్న బెల్ట్‌ షాపులను పూర్తిగా నిర్మూలించారు. బార్లలో అమ్మకాలు నిలిపివేయడంతో మద్యం అమ్మకాలు 50 శాతం, బీరు విక్రయాలు 90 శాతం తగ్గాయి. విక్రయాల్లో సమయ పాలన పకడ్బందీగా అమలు చేయడం, పరిమితి విధించడంతో మద్యం రక్కసిని నియంత్రించగలిగారు.

గడ్డు కాలం నుంచి గట్టెక్కాం..
ఇంటి యజమాని తాగుడుకు బానిస కావడంతో ఛిద్రమైన ఎన్నో కుటుంబాలను చూశా. ఆ గడ్డు పరిస్థితుల నుంచి ఇప్పుడు మేం పూర్తిగా కోలుకున్నాం. మా ఆయన సత్యన్నారాయణ తాగుడుకు స్వస్తి చెప్పడం తో కూలీ డబ్బులన్నీ ఇంటికి చేరుతున్నాయి. చేతి ఖర్చులకు రూ.10, 20 తీసుకొని మిగతావి మాకే ఇవ్వడంతో సంసారం ఒడిదుడుకులు లేకుండా సాగిపోతోంది. – పొత్తూరి వెంకటలక్ష్మి (బూరుగపల్లి, రాజవొమ్మంగి మండలం)

కొనలేక మానేశా..
‘25 ఏళ్లుగా మందు తాగుతున్నా. గతంలో క్వార్టర్‌ బాటిల్‌ రూ.110కే దొరకడంతో కూలీ డబ్బుల్లో సగం ఖర్చు పెట్టి మద్యం తాగేవాడిని. బెల్టుషాపుల ద్వారా 24 గంటలు దొరికేది. ఇప్పుడు ధరలు భారీగా పెరగడంతో క్వార్టర్‌ బాటిల్‌ రూ.350 పెట్టి కొనలేక మద్యం మానేశా. నా కుమార్తె రాణికి గ్రామ వలంటీర్‌గా ఉద్యోగం కూడా వచ్చింది. ముఖ్యమంత్రి జగన్‌ తీసుకున్న నిర్ణయాలతో మా కుటుంబంలో ఆనందం వెల్లివిరుస్తోంది’– అండ్రు నాగేంద్రుడు (గోకవరం మండలం సంజీవయ్యనగర్‌)

దూరం వెళ్లలేక మానుకుంటున్నాం..
మా ఊళ్లో మద్యం షాపు లేదు. మద్యం దుకాణానికి వెళ్లాలంటే 4 కిలోమీటర్ల దూరంలోని వెల్ల గ్రామానికి వెళ్లాలి. గత ప్రభుత్వంలో బెల్టు షాపుల వల్ల మద్యం దొరికేది. వీలున్నప్పుడల్లా మద్యం తీసుకునే వాళ్లం. ప్రస్తుతం ప్రభుత్వం బెల్టు షాపులు కూడా లేకుండా చేయడంతో ఊర్లో చాలా మందిమి మద్యం అలవాటు మానుకున్నాం. నేను కల్లు గీత వృత్తి ద్వారా వచ్చిన ఆదాయంతో ఇద్దరు పిల్లలను చక్కగా  పోషించుకుంటున్నాను.  – వాసంశెట్టి నాగ ఆంజనేయులు,తాడిపల్లి, రామచంద్రపురం మండలం)

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు