పండగకు ప్రయాణమెట్టా?

26 Dec, 2018 07:09 IST|Sakshi

విజయవాడ, విశాఖ, హైదరాబాద్‌

మార్గాల్లో వందల్లో వెయిటింగ్‌ లిస్ట్‌

ఇప్పటికే రిజర్వేషన్‌ రిగ్రెట్‌ వస్తోందని ఆందోళన

పై మార్గాల్లో పెరగని ‘ఈక్యూ’ కోటాలు అదనపు బోగీలుండవు...

సౌకర్యంగా నడవని ప్రత్యేక రైళ్లు

రానున్నవంతా నూతన సంవత్సరం.. సంక్రాంతి పండుగల సెలవులే. అత్యధికులు వారి సొంత ఊళ్లకు వచ్చివెళ్లేందుకు రైల్వే ప్రయాణాన్నే సౌకర్యంగా భావిస్తారు. కానీ వరుస సెలవులు.. ప్రయాణికుల రద్దీపై రైల్వే మంత్రిత్వ శాఖ, జోనల్‌ అధికారులు శ్రద్ధ చూపని కారణంగా పండగ  సెలవుల్లో ప్రయాణం ఎట్టా...? అనే ఆందోళన సగటు ప్రయాణికుడిలో వ్యక్తమవుతోంది..

విశాఖపట్నం: నూతన సంవత్సరం, సంక్రాంతి పండగలకు సొంత ఊళ్లకు వెళ్లేందుకు సిద్ధమవుతోన్న ప్రయాణికులకు ‘ రైల్వే’ అవస్థలు వెంటాడుతున్నాయి. రాష్ట్రం విడిపోకముందు విజయవాడ, విశాఖ మార్గాల్లో ఉన్న రైళ్లే ఇప్పటికీ శరణ్యంగా ఉండడం కూడా ప్రయాణికుల ఆందోళనకు మరో కారణం. విజయవాడకు రాజధాని మారిన తర్వాత 13 జిల్లాల నుంచి రాకపోకలు సాగించే వారి సంఖ్య లక్షల్లో పెరిగింది. పెరిగిన రద్దీకి సౌకర్యంగా ప్రత్యేక రైళ్లు నడుపుతున్నామని చెబుతున్నా అనువైన తేదీల్లో లేని కారణంగా అవి నామమాత్రంగా మారాయి. ఉన్న రైళ్లకు అదనపు బోగీల ఏర్పాటులో మాత్రం రైల్వేశాఖ ఏటêవిఫలమవుతూనే ఉంది. ఒక్కో రైలుకు గరిష్టంగా 1200 మంది చొప్పున ప్రయాణించినా అన్ని రైళ్లలో పట్టుమని 6వేల మంది కూడా ప్రయాణించే సౌకర్యం ఉండడం లేదు. రాజధాని విజయవాడకు మారాక విజయనగరం, విశాఖ, శ్రీకాకుళం జిల్లాల నుంచి రోజూ భారీ సంఖ్యలో వెళ్లివస్తున్నారు. సకాలంలో, సరైన రైళ్లులేక వారి ప్రయాణ అవస్థలు వర్ణనాతీతంగా ఉంటున్నాయి. పండగ సెలవుల్లో ఆ రద్దీ రెట్టింపు ఉన్నట్టు రైల్వే గణాంకాలు వెల్లడిస్తున్నాయి. దీంతో రానున్న పండగల సెలవుల్లో రైల్వే ప్రయాణికులకు అవస్థలు తప్పేలా లేవు.

చాంతాడంత వెయిటింగ్‌ లిస్ట్‌
సాధారణ రోజుల్లోనే విశాఖపట్నం, విజయవాడ రైళ్లకు రిజర్వేషన్‌  టికెట్ల వెయిటింగ్‌ లిస్ట్‌ 180కి పైగా దాటుతోంది. కొందరైతే వెయిటింగ్‌ లిస్ట్‌లకు భయపడి ప్రయాణాలను వాయిదా వేసుకుంటున్నారు. ఈ మార్గాల్లో రైళ్లకు నెల రోజుల ముందు టికెట్లు కొనుక్కున్నా ప్రయాణించే రోజుకు బెర్త్‌లు కన్ఫర్మ్‌ అయ్యే పరిస్థితులు ఉండడం లేదు. ఇవన్నీ ఒక ఎత్తయితే... సంక్రాంతివరుస సెలవులకు ఇంకా 20 రోజులు గడువు ఉన్నప్పటికీ రిజర్వేషన్‌  టికెట్లు మంజూరుకాక రిగ్రెట్‌ వస్తోందని ప్రయాణికులు చెబుతున్నారు.

పెరగని ‘ఈక్యూ’ కోటాలు
అన్ని వర్గాల ప్రజలకు ఎంతో సౌకర్యంగా ఉండేలా రైల్వే ప్రయాణాలకు అత్యవసర సమయాల్లో ఎమర్జెన్సీ కోటా(ఈక్యూ) ద్వారా బెర్తులు మంజూరు చేసే విధానం అమలులో ఉంది. ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు విజయవాడ, హైదరాబాద్‌ మార్గాల రైళ్లకు ఉన్నన్ని ఈక్యూ బెర్తులే ఇప్పటికీ అమలు కావడంతో నిత్యం రైల్వే అధికారులకు సైతం బెర్తుల విషయంలో తల ప్రాణం తోకకు వచ్చినంత పనవుతోంది. అందుకు తెలంగాణ మార్గాల్లోని రైళ్లకు అమలు చేస్తున్న ‘ఈక్యూ’ కోటాను బాగా తగ్గించి, ఏపీలోని రైళ్లకు కోటా పెంచడం ఒక్కటే మార్గంగా తెలుస్తోంది.

మరిన్ని వార్తలు