ఇంటింటి కుళాయి ఇంతేనా?

9 Mar, 2019 09:30 IST|Sakshi
తాగు నీరు సరిపడా రాలేదంటూ ఖాళీ బిందెలతో నిరసన వ్యక్తంచేస్తున్న మారుతీకాలనీ మహిళలు

పల్లెవాసులకు తప్పని తాగునీటి కష్టాలు

రక్షిత మంచినీటి పథకాల మంజూరులో  సర్కారు నిర్లక్ష్యం

అదనపు నీటిపథకాలు లేక జనం అవస్థలు

అవస్థలు పడుతున్నా... పట్టని పాలకులు

ఏటా జనాభా పెరుగుతున్నారు. నివాసాలు విస్తరిస్తున్నాయి. ఎప్పుడో ఏర్పాటు చేసిన మంచినీటి పథకాలే ఇప్పటికీ కొనసాగుతున్నాయి. కొత్త పథకాల ఏర్పాటుపై ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు. కేవలం ప్రకటనలు... అనవసర సమావేశాల ఆర్భాటాలు... ఏమీ ఇవ్వకపోయినా.. ఏదో ఇచ్చామని నమ్మించే ప్రయత్నాలు... ఇవి తప్ప జనం బాధలు పట్టించుకునే తీరిక పాలకులకు లేదు. వేసవి వచ్చిందంటే చాలు... జలజగడాలు పెరిగిపోతున్నాయి. నీటికోసం కిలోమీటర్ల దూరం ప్రయాణాలు తప్పనిసరిగా మారుతోంది. ఇదేదో కొండల్లోనో... గిరిజన ప్రాంతాల్లోనో అనుకుంటే పొరపాటు పడ్డట్టే. మైదాన ప్రాంతాల్లోనూ ఈ సమస్యలు తప్పడం లేదు.

విజయనగరం, రామభద్రపురం(బొబ్బిలి): వేసవి కాలం ముంచుకొస్తోంది. అప్పుడే పల్లెల్లో దాహం కేకలు మిన్నంటుతున్నాయి. తాగునీటికోసం జనం అల్లాడిపోతున్నారు. అయినా ఇవేవీ పాలకులకు పట్టడం లేదు. అదనపు రక్షిత మంచినీటి పథకాలు మంజూరు చేసి ఇంటింటికీ కుళాయి ఏర్పాటు చేస్తామని గొప్పగా చెప్పిన పాలకులు దానిని అమలు చేయడంలో పూర్తిగా విఫలమయ్యారు. ఫలితం... పథకం లేని గ్రామాలు,ప్రజలు ఎక్కువగా ఉన్న చోట మొక్కుబడి పథకం ద్వారా సరఫరా అవుతున్న నీరు చాలక నానా ఇబ్బందులు పడుతున్నారు.

అదనపు పథకాల ఊసే మరిచారు
పాలకుల ఆదేశాలతో అధికారులు జిల్లా వ్యాప్తం గా రూ.1200 కోట్లతో ప్రతిపాదనలు తయారు చేయగా ఎస్‌కోట, గజపతినగరం, చీపురుపల్లి, విజయనగరం నియోజకవర్గాలకు మాత్రమే అదనపు రక్షిత మంచినీటి పథకాల ఏర్పాటుకు రూ.300 కోట్లు మంజూరయినట్లు సమాచారం. మిగిలిన నియోజకవర్గాలకు మంజూరు చేయకపోగా... మంజూరైన నియోజకవర్గాలలో ప««థకాల నిర్మాణానికి ఇప్పటికీ టెండర్లు పిలవలేదంటే దీనిపై ఏపాటి చిత్తశుద్ధి ఉందో స్పష్టమవుతోంది. అదనపు రక్షితమంచినీటి పథకాలు మంజూరైతే ఇంటింటి కుళాయి వస్తుందని, తాగునీటికి ఇబ్బం ది తీరిపోతుందని కలలు గన్న ప్రజల ఆశలు అడియాశలుగానే మిగిలిపోతున్నాయి. బొబ్బిలి నియోజకవర్గంలోని నాలుగు మండలాల్లో రక్షిత మంచినీటి పథకాలు లేని గ్రామాలకు అధి కారులు సుమారుగా రూ.120 కోట్ల అంచనా వ్యయంతో ప్రతిపాదనలు రూపొందించి పం పారు. ఏళ్లు గడుస్తున్నా అవి కాగితాలకే పరి మితమయ్యాయి. నియోజకవర్గానికి ప్రాతిని« ద్యం వహిస్తున్నది సాక్షాత్తూ మంత్రి సుజ య్‌కృష్ణ రంగారావు అయినా ఇక్కడి ప్రజల కు తాగునీటి కష్టాలు తప్పడం లేదు. సమావేశాల్లో అధికారులు ఏ సమస్యలూ లేవని చెప్తే అదే నిజమనుకుంటున్నారు తప్ప... క్షేత్రస్థాయిలో మహిళలు పడుతున్న అవస్థలేమీ పట్టించుకోవడం లేదు.

ఊటనీటితో అనారోగ్యం
పలు గ్రామాలు నదికి ఆనుకుని ఉన్నాయి. అక్కడివారు చెలమల్లో నీటిని తోడుకుని తెచ్చుకుని తమ అవసరాలు తీర్చుకుంటున్నారు. ఇదెంతవరకు సురక్షితమో అధికారులే చెప్పాలి. ఊట నీటితో రోగాలు విస్తరిస్తాయన్న విషయం అందరికీ తెలిసిందే. అయినా వాటిని పెడచెవిన పెట్టి అత్యవసర పరిస్థితుల్లో ఆ నీటినే తెచ్చుకుని అవసరాలు తీర్చుకుంటున్నారు. పాలకులు ఇప్పటికైనా స్పందించి పల్లెల్లో నెలకొన్న తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని గ్రామీణులు కోరుతున్నారు.

నీటి సమస్య పట్టించుకోవట్లేదు
మా గ్రామంలో మంచి నీటి పథకం పనులు ప్రారంభించి రెండేళ్లు అయింది. ఏదో పూర్తి చేశారంటే నీటిని మాత్రం సరఫరా చేయలేదు. తాగునీటికి నానా అవస్థలు పడుతున్నాం. మా గ్రామ సమీపంలో ఉన్న నర్సరీ యజమానులను బతిమలాడి మంచి నీరు తెచ్చుకోవలసి వస్తోంది. పాలకులు కనీసం పట్టించుకోవడంలేదు.– ఐ.కళావతి, పాడివానివలస, రామభద్రపురం మండలం

మరిన్ని వార్తలు