‘నీరు-చెట్టు’కు పురిటి కష్టాలు

26 Mar, 2016 03:45 IST|Sakshi
‘నీరు-చెట్టు’కు పురిటి కష్టాలు

ఆదిలోనే పథకానికి అడ్డంకులు
311కుగాను 37 చెరువుల్లోనే పనులు
ఇంజినీర్లపై ఒత్తిడి పెంచుతున్న కలెక్టర్
సెలవుల్లో వెళ్లే యోచనలో అధికారులు
ఇద్దరు ఈఈలు ఇప్పటికే సెలవు బాట  

 
చెరువుల్లో పేరుకుపోయిన పూడికను తొలగించి వాటి నిల్వ సామర్థ్యం పెంచేందుకు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన నీరు-చెట్టు కార్యక్రమానికి పురిటి కష్టాలు పీడిస్తున్నాయి. గతేడాది ప్రారంభించిన ఈ కార్యక్రమాన్ని ఈ ఏడాది కూడా కొనసాగించేందుకు అధికారులు చర్యలు తీసుకున్నారు. అయితే పనులు మొదలు పెట్టకుండానే ఇక్కట్లు చుట్టుముట్టాయి. వంద ఎకరాలకుపైగా ఆయకట్టున్న చెరువుల్లో నీటి వినియోగదారుల సంఘాలు, ఆ లోపు ఆయకట్టున్న చెరువుల్లో జన్మభూమి కమిటీలతో పూడికతీత పనులు చేయించాలని ప్రభుత్వం ఇటీవలే ఉత్తర్వులు జారీ చేసింది. జిల్లాలో ఇప్పటి వరకు నాలుగు విడతల్లో 311 చిన్ననీటి పారుదల శాఖ, పంచాయతీరాజ్ శాఖల చెరువులకు కలెక్టర్ అనుమతులు ఇచ్చారు.

వెంటనే పనులు ప్రారంభించాలని భావిస్తున్న కలెక్టర్ ఆ మేరకు అధికారులను పరుగులు పెడుతుండగా అంతతొందరెందుకంటూ అధికార పార్టీ నేతలు అడ్డంకులు సృష్టిస్తున్నారు. దీంతో జల వనరుల శాఖ ఇంజినీర్లు సతమతమవుతున్నారు. మరోవైపు ఇంజినీర్ల కొరత, పంచాయతీరాజ్ శాఖ చెరువుల్లో పూడికతీత పనులకు జన్మభూమి సభ్యుల పోటాపోటీ కారణంగా వివాదాలు ముదురుతున్నాయి. ఆళ్లగడ్డ, నందికొట్కూరు, నంద్యాల, బనగానపల్లె మండలాల్లో ఒక్క చెరువు పని కూడా మొదలు కాలేదని అధికారులే చెబుతున్నారు. ఇదే సమయంలో యంత్రాల కొరత, పూడిక మట్టిని పొలాలకు తరలించుకునేందుకు రైతులు ముందుకు రాకపోవడం కూడా ఇందుకు పనులు ప్రారంభం కాకపోవడానికి కారణంగా తెలుస్తోంది. మొత్తంగా 311 చెరువులకు గాను గురువారం వరకు 37 చె రువుల్లో మాత్రమే పనులు ప్రారంభం కావడం గమనార్హం.

 యంత్రాల ఏర్పాటుపై వివాదం..
పూడికతీత పనులకు చాలా చోట్ల ప్రొక్లెయిన్‌ల కొరత వేధిస్తుండడంతో వాటిని సమకూర్చేందుకు కలెక్టర్ హామీ ఇచ్చారు. దీంతో ఆయా గ్రామాల్లోని చెరువుల్లో పనులు ప్రారంభించాలంటూ  ఏఈఈలు నీటి సంఘాల అధ్యక్షులపై ఒత్తిడి పెంచుతున్నారు. అయితే యంత్రాలను తామే ఏర్పాటు చేసుకుంటామని చెబుతున్నా పట్టించుకోరేంటని ఆయా గ్రామాల్లోని అధికార పార్టీ నేతలు ఇంజినీర్లపై మండిపడుతున్నారు. పనులు ప్రారంభించాలని ఓ వైపు కలెక్టర్ ఒత్తిడి పెంచుతుండగా అధికారపార్టీ నేతల నిర్వాకంతో జాప్యం తప్పడం లేదు.

మరోవైపు కరువు కారణంగా చాలా మంది పశ్చిమ ప్రాంతాల చిన్న, సన్నకారు రైతులు ఇతర ప్రాంతాలకు వలస వెళ్లడంతో పూడిక మట్టిని పొలాలకు తరలించుకునే వారు కరువయ్యారు. అయితే స్థానికంగా నెలకొన్న పరిస్థితులను ఇంజినీర్లు కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లే సాహసం చేయడం లేదని తెలుస్తోంది. కలెక్టర్ మాత్రం పనులు చేయించాలని వెంటపడుతుండడంతో చాలా మంది ఇంజినీర్లు అనారోగ్య కారణాలు చూపి సెలవుల్లో వెళ్లే యత్నాల్లో ఉన్నట్లు సమాచారం. ఇప్పటికే కేసీ కాల్వ ఈఈ కొండారెడ్డి దీర్ఘకాలిక సెలవుల్లో వెళ్లారు. మైనర్ ఇరిగేషన్ కర్నూలు డివిజన్ ఈఈ శ్రీనివాసులు బుధవారం నుంచి ఇదే బాట పట్టినట్లు తెలిసింది.
 

మరిన్ని వార్తలు