ఏప్రిల్‌లో జీవోల వెబ్‌సైట్ పునరుద్ధరణ | Sakshi
Sakshi News home page

ఏప్రిల్‌లో జీవోల వెబ్‌సైట్ పునరుద్ధరణ

Published Sat, Mar 26 2016 3:42 AM

GO Website renewal in April

 హైకోర్టుకు నివేదించనున్న సర్కారు

 సాక్షి, హైదరాబాద్: ఏప్రిల్ మొదటి వారం నుంచి జీవోల వెబ్‌సైట్‌ను పునరుద్ధరించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ప్రభుత్వ ఉత్తర్వులుండే వెబ్‌సైట్‌ను ఎప్పుడు పునరుద్ధరిస్తారు.. అందుకు సంబంధించిన పూర్తి వివరాలను తమ ముందుంచాలని ఇటీవలే హైకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ నేపథ్యంలో ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి లేదా మొదటి వారం నుంచి వెబ్‌సైట్‌ను పునరుద్ధరించేలా చర్యలు చేపడుతోంది. గతంలో మాదిరిగా అన్ని జీవోలను వెబ్‌సైట్‌లో పెట్టాల్సిన అవసరం లేదని భావిస్తోంది. ప్రాధాన్య క్రమంలో ఏయే ఉత్తర్వులను వెబ్‌సైట్‌లో ఉంచాలి.. వేటిని పరిహరించాలనే అంశాలపై తుది కసరత్తు చేస్తోంది.

ఇందులో భాగంగా శాఖాపరమైనవాటిని, చిన్న, చిన్న కార్యాలయ ఖర్చులు, ఉద్యోగుల వ్యక్తిగత లోన్లకు సంబంధించిన జీవోలను ఇప్పట్నుంచీ వెబ్‌సైట్‌లో పొందుపరచాల్సిన అవసరం లేదని భావిస్తోంది. రూ.3 లక్షల ఖర్చుకు లోబడిన జీవోలను వెబ్‌సైట్‌లో పొందుపరచకూడదని నిర్ణయించింది. వీటన్నింటినీ పొందుపరిచి జీవోల జారీకి సంబంధించిన మార్గదర్శకాలను సిద్ధం చేయనుంది. వీటిని అన్ని శాఖలకు పంపిన తర్వాత జీవోల వెబ్‌సైట్‌ను ప్రభుత్వం పునరుద్ధరించనుంది. ఈ విషయాన్ని సోమవారం ప్రభుత్వం తరఫున హైకోర్టుకు నివేదించే అవకాశముంది.

Advertisement

తప్పక చదవండి

Advertisement