ప్రభుత్వ పారదర్శకతకు ఇదే ఉదాహరణ: మంత్రి అనిల్‌

17 Dec, 2019 12:08 IST|Sakshi

రివర్స్‌ టెండరింగ్‌ ద్వారా రూ. 1100 కోట్లు ఆదా

సాక్షి, అమరావతి: సోమశిల హై లెవల్‌ కెనాల్‌కు సంబంధించి 2013లో రూ.1500 కోట్లతో ప్రాజెక్టు నిర్మాణానికి అనుమతులు వచ్చాయని రాష్ట్ర నీటిపారుతల శాఖమంత్రి అనిల్‌ కుమార్‌ యాదవ్‌ శాసనసభలో తెలిపారు. ప్రాజెక్టు నిర్మాణానికి ఇప్పటి వరకు కేవలం 2,690 ఎకరాల భూసేకరణ మాత్రమే జరిగిందన్నారు. ఫస్ట్‌ ఫేజ్‌ కింద రూ. 840 కోట్లు కేటాయించినట్లు చెప్పారు. మంగళవారం అసెం‍బ్లీ సమావేశాల్లో భాగంగా సోమశిలపై సభలో చర్చ జరిగింది. ఈ సందర్భంగా మంత్రి అనిల్‌ కుమార్‌ మాట్లాడుతూ.. గత ప్రభుత్వం ఇరిగేషన్‌ ప్రాజెక్టులపై పూర్తిగా నిర్లక్ష్యం వహించిందని మండిపడ్డారు. తమ ప్రభుత్వం రాష్ట్రంలోని ప్రాజెక్టులను పూర్తి చేసేందుకు చిత్తశుద్ధితో ఉందన్నారు.

ముఖ్యంగా నెల్లూరు జిల్లాలోని ఇరిగేషన్‌ ప్రాజెక్టులను త్వరితగతిన పూర్తి చేయాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశించారని అనిల్‌ చెప్పారు. గత ప్రభుత్వం ఆర్‌అండ్‌ఆర్‌ ప్యాకేజీని పట్టించుకోలేదని విమర్శించారు. రివర్స్‌ టెండరింగ్‌ ద్వారా పెద్ద మొత్తంలో ఆదాయం ఆదా అయిందని సభలో వివరించారు. తమ సొంత పార్టీకి చెందిన ఎంపీ ఆదాల ప్రభాకర్‌ రెడ్డి నిర్వహిస్తున్న కాంట్రాక్టుపై కూడా రివర్స్‌ టెండరింగ్‌ చేపట్టామని మంత్రి తెలిపారు. రివర్స్‌ టెండరింగ్‌ ద్వారా రూ. 1100 కోట్ల రూపాయలు ఆదా చేశామని వెల్లడించారు. తమ ప్రభుత్వం పారదర్శకంగా ఉందని చెప్పేందుకు ఇదే పెద్ద ఉదాహరణ అని  స్పష్టం చేశారు.

మరిన్ని వార్తలు