ఓటేసి అభిమానం చాటుకుంటాం..

21 Oct, 2018 10:44 IST|Sakshi
జగన్‌మోహన్‌రెడ్డిని కలిసిన యువతులు

వచ్చే ఎన్నికలలో వైఎస్సార్‌సీపీకి ఓట్లేసి అభిమానం చాటుకుంటాం. ప్రస్తుత టీడీపీ  ప్రభుత్వం చేసిందేమీ లేదు.  ఒకసారి జగనన్నకు అవకాశం ఇస్తాం. ఆయన తండ్రి దివంగత ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డి అందించిన పాలన మళ్లీ రావాలంటే వైఎస్సార్‌సీపీ అధికారంలోకి రావాల్సిందే. – బి.లావణ్య, ఈ.మోహిని, జి.భవానీ, మౌనిక, నాగమణి, తదితరులు గున్నతోటవలస, బొబ్బిలి మండలం  

బిల్లు ఇవ్వలేదు...
ఇల్లు మంజూరైందని చెప్పడంతో పాత ఇల్లును పూర్తిగా తొలగించి నూతన గృహం పనులు ప్రారంభించాను. పది బస్తాల సిమెంట్‌ ఇచ్చారు. పునాదులు పూర్తయిన తర్వాత బిల్లు కోసం అధికారులను అడిగితే శ్లాబు లెవిల్‌ తర్వాత బిల్లు ఇస్తామని చెప్పడంతో అప్పు చేసి మరీ ఇల్లు పూర్తి చేశాను. అధికారులు మాత్రం బిల్లులు మంజూరు చేయలేదు. నాతో కట్టిన వారందరికీ బిల్లులు మంజూరు చేసి నాకు మొండిచేయి చూపారు. మీరైనా నాలాంటి వారికి న్యాయం చేయాలి.     – పెంకి లలిత, అలజంగి గ్రామం, బొబ్బిలి మండలం

ఫీజులు పెంచేశారు..
మాది బొబ్బిలి గెస్ట్‌ హౌస్‌ కాలనీ. నేను 8వ తరగతి, తమ్ముడు ధనుష్‌ నాలుగో తరగతి చదువుతున్నాం. మా స్కూల్‌ ఫీజులు విపరీతంగా పెంచేశారు. మా అమ్మ సెకెండ్‌ ఏఎన్‌ఎంగా పనిచేస్తోంది. ఆమె వేతనం అంతా మా ఫీజులకే సరిపోతోంది. మీరు అధికారంలోకి రాగానే ఫీజులు తగ్గేలా చర్యలు తీసుకోవాలి.       – ఎం. భువనేశ్వరి, ఎనిమిదో తరగతి, గెస్ట్‌ హౌస్‌ కాలనీ, బొబ్బిలి

ఆర్టీసీని విలీనం చేయాలి...
ఏపీఎస్‌ ఆర్టీసీ సంస్థను ప్రభుత్వంలో విలీనం చేసి మా బతుకులు బాగు చేయాలి. సంస్థ బాగుపడాలంటే ప్రభుత్వంలో విలీనం చేయడం ఒక్కటే మార్గం. రాబోయే ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ విజయం ఖాయం. టీడీపీ పాలనలో అన్ని విధాలా  నష్టపోయాం. మీరు ముఖ్యమంత్రి అయిన తర్వాత మమ్మల్ని ఆదుకోవాలి.  – కె. శంకరరావు, వర్కింగ్‌ ప్రెసిడెంట్, ఆర్టీసీ ఎంప్లాయీస్‌ యూనియన్, పార్వతీపురం

ఆసరా లేదు...
ఆశ వర్కర్లకు వేతనం ప్రకటించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేటికీ మంజూరు చేయలేదు. మా చేత పలు ప్రభుత్వ కార్యక్రమాలకు ప్రచారం చేయించుకుంటున్నారు. కానీ వేతనాలు ఇచ్చేందుకు ప్రభుత్వం ముందుకు రావడం లేదు. ప్రజలకు ఆరోగ్యం గురించి ప్రచారం చేస్తున్నాం. కానీ మా ఆరోగ్యం.. మా బతుకుల గురించి ఎవ్వరూ పట్టించుకోవడం లేదు. మీ ప్రభుత్వం వచ్చాక మాకు దారి చూపండి.. 
–  జి. కుమారి, బి. లక్ష్మి, డి. లక్ష్మి, రామభద్రపురం

మరిన్ని వార్తలు