‘కు.ని’కి పాట్లు

9 Aug, 2014 04:46 IST|Sakshi

సాక్షి, ఒంగోలు :  జాతీయ ఆరోగ్యమిషన్ (ఎన్‌ఆర్‌హెచ్‌ఎం) నుంచి జిల్లాకు ఏటా రూ.20 కోట్లకు పైగా నిధులు వస్తున్నాయి. ఇందులో రూ.2 కోట్ల నుంచి రూ.2.5 కోట్ల వరకు కుటుంబ సంక్షేమ పథకాలకు కేటాయిస్తున్నారు. ఈ నిధులతో నాలుగు రకాలుగా కుటుంబ నియంత్రణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.

ఇద్దరు సంతానం పుట్టాక కుటుంబ నియంత్రణ (కు.ని) ఆపరేషన్‌లు చేయడం ఒకటి కాగా, పిల్లల మధ్య ఎడమ కోసం తాత్కాలిక ఆపరేషన్‌లైన కాపర్ టీ వేయించడం, గర్భం దాల్చకుండా నోటిమాత్రలు పంపిణీ చేయడం, కండోమ్‌ల పంపిణీ వంటి కార్యక్రమాలు చేపట్టాల్సి ఉంది. ఇందులో కుటుంబ నియంత్రణ ఆపరేషన్‌లు మినహా అన్ని కార్యక్రమాలు నామమాత్రంగానే సాగుతున్నాయి. క్షేత్రస్థాయిలో కానరాని ప్రగతిని జిల్లా వైద్య,ఆరోగ్యశాఖ అధికారులు మాత్రం గణాంకాల్లో ఘనంగా చూపుతుండటం గమనార్హం.

 వేసెక్టమీలు ఏడు మాత్రమే...
 కుటుంబ నియంత్రణ ఆపరేషన్‌లకు సంబంధించి ఏటా భారీ స్థాయిలో లక్ష్యాలను నిర్దేశించుకుంటూ.. వాటిని అధిగమించే విషయంలో జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ చతికిలపడటం రివాజవుతోంది. ఏటా రూ. కోట్లు ఖర్చుచేస్తున్నా.. లక్ష్యాలు నెరవేరడం లేదు. జిల్లావ్యాప్తంగా పురుషులకు చేసే వేసెక్టమీ ఆపరేషన్‌లు ఈఏడాది మొత్తంలో కేవలం ఏడు మాత్రమే నమోదవడం తాజా ఉదాహరణ.

 వాస్తవ పరిస్థితులిలా..
 జనాభా నియంత్రణలో కుటుంబ నియంత్రణ అనేది ఒక భాగం. తల్లులు, పిల్లల ఆరోగ్యం విషయంలో జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ ప్రత్యేక చర్యలు తీసుకోవాలి. ఇద్దరు లేదా ముగ్గురు పిల్లల తర్వాత తప్పనిసరిగా కుటుంబ నియంత్రణ ఆపరేషన్‌లు చేయించుకునేందుకు దంపతులను ప్రోత్సహించాలి. చిన్న కుటుంబంతో కలిగే లాభాలను వివరించే అవగాహన సమావేశాలు నిర్వహించాలి.

కార్యక్రమాల్లో చురుగ్గా పనిచేయాల్సిన ‘డెమో’ విభాగం మూలనపడింది. కుటుంబ నియంత్రణ ఆపరేషన్‌లు చేయించుకునేందుకు జిల్లాలో 37 కేంద్రాలు ఏర్పాటు చేశారు. వీటితో పాటు ప్రాథమిక ఆరోగ్యకేంద్రాలు, కమ్యూనిటీ హెల్త్‌సెంటర్లు పనిచేస్తున్నాయి. యర్రగొండపాలెం, గిద్దలూరు, కనిగిరి, మార్కాపురం తదితర నియోజకవర్గాల్లో అక్కడక్కడా తప్ప అధిక చోట్ల ప్రత్యేక శిబిరాల ఊసే లేదు. ఆయాప్రాంతాల్లో కుటుంబ నియంత్రణ ఆపరేషన్‌లు జరగడం లేదు. గైనిక్, అనస్థీషియా (మత్తు) వైద్యులు కొరత కారణంగా తొందరపడి ఆపరేషన్‌ల జోలికి వెళ్లలేకపోతున్నారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో సరైన మౌలిక సదుపాయాలు లేనందున చాలామంది ప్రైవేటు ఆస్పత్రులను ఆశ్రయిస్తున్నారు.

 నెరవేరని లక్ష్యం..
 జిల్లావైద్య, ఆరోగ్యశాఖ 2013-14 సంవత్సరంలో 22 వేల కుటుంబ నియంత్రణ ఆపరేషన్‌లు చేయాలని లక్ష్యంగా నిర్దేశించుకుంది. ఇందుకుగాను కేవలం 7 వేల ఆపరేషన్‌లు మాత్రమే నిర్వహించారు. ప్రభుత్వ ఆస్పత్రులు కంటే ప్రయివేటు ఆస్పత్రుల్లో ఈ ఆపరేషన్‌లు అధికంగా జరిగాయి. పీహెచ్‌సీ, సీహెచ్‌సీలలో వైద్యులు, వైద్య సిబ్బంది అందుబాటులో ఉన్నా కుటుంబ నియంత్రణ ఆపరేషన్‌లకు ముందుకు రావడం లేదని ఫిర్యాదులందుతున్నాయి. ఒంగోలు రిమ్స్‌కు పంపుతూ కొన్ని నియోజకవర్గాల్లో వైద్యసిబ్బంది చేతులు దులుపుకుంటున్నారు. ఈ విషయంలో వైద్య, ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులు పెద్దగా ఆసక్తి చూపకపోవడంతో లక్ష్యం నీరుగారుతోంది.

మరిన్ని వార్తలు