జసిత్‌ కిడ్నాప్‌.. ఈ ప్రశ్నలకు సమాధానమేది?

25 Jul, 2019 12:03 IST|Sakshi

సాక్షి, మండపేట : మూడు రోజుల క్రితం అపహరణకు గురైన చిన్నారి జసిత్‌ క్షేమంగా తల్లిదండ్రుల వద్దకు చేరిన సంగతి తెలిసిందే. దీంతో జసిత్‌ ఇంటివద్ద పండగ వాతావరణం నెలకొంది. తెలుగు రాష్ట్రాల్లో కలకలం రేపిన ఈ కేసుకు సంబంధించి పలు ప్రశ్నలకు ఇప్పటికీ సమాధానాలు లేకుండానే మిగిలిపోయాయి. కిడ్నాపర్లు జసిత్‌ను ఎందుకు అపహరించాల్సి వచ్చిందనేది తెలియాల్సి ఉంది. జసిత్‌ను ముఖానికి మాస్క్‌లు ధరించి పక్కగా కిడ్నాప్‌ చేసిన దుండగులు.. ఎలాంటి డిమాండ్‌ ఎందుకు చేయలేదనిది అంతు చిక్కడం లేదు. అసలు కిడ్నాపర్లు ఎవరూ.. ఈ మూడు రోజుల పాటు జసిత్‌ను ఎక్కడ దాచారనే దానిపై పోలీసుల ఆధారాలు సేకరించలేకపోయారు.

కిడ్నాపర్లు జసిత్‌ను విడిచి వెళ్లిన అనపర్తి మండలం కుతుకులూరు, మండపేటకు 10 కి.మీ. దూరంలోనే ఉండటం పలు అనుమానాలకు తావిస్తోంది. అనపర్తి మండలం క్రికెట్‌ బెట్టింగ్‌లకు అడ్డగా ఉన్న నేపథ్యంలో కొత్త ప్రశ్నలు తలెత్తున్నాయి. బాలుడ్ని ఆ పరిసరాల్లోనే కిడ్నాపర్లు బంధించారా లేక ఇందులో బయటి వ్యక్తుల ప్రమేయం ఏమైనా ఉందా ప్రశ్నలు ఉత్పన్నమవుతాయి. అలా అయితే స్థానికులు ఎవరైనా కిడ్నాపర్లకు సహకారం అందించారా, లేక స్థానికంగా ఉన్నవారే ఈ పనికి ఒడిగట్టారా అనే ప్రశ్నలకు జవాబు తెలియాల్సి ఉంది. మరోవైపు జషిత్‌ మాత్రం తనను కిడ్నాపర్లు బాగానే చూసుకున్నారని.. ఇడ్లీ కూడా పెట్టారని చెప్పాడు. కిడ్నాప్‌ తరువాత జసిత్‌ ఎలాంటి ఒత్తిడికి లోనుకాకుండా ఉండటం అనుమానాలకు తావిచ్చేలా ఉంది.

పోలీసుల ముమ్మర గాలింపు, మీడియాలో వరుస కథనాలకు భయపడే కిడ్నాపర్లు జషిత్‌ను వదిలేశారని అభిప్రాయం వ్యక్తమవుతోంది. మరోవైపు పోలీసులతో సంబంధం లేకుండా కిడ్నాపర్లకు జసిత్‌ కుటుంబ సభ్యులు కొంత మొత్తంలో చెల్లించడంతోనే వారు బాలుడిని విడిచిపెట్టినట్టుగా కొన్ని వార్తలు వెలువడుతున్నాయి. అవి ఎంతవరకు నిజమో కూడా తెలియాల్సి ఉంది. అయితే పోలీసులు ఈ కేసుకు సంబంధించి ఇప్పటివరకు ఎలాంటి ప్రకటన చేయకపోవడం.. కుటుంబ సభ్యులు ఎవరిపైనా అనుమానాలు వ్యక్తం చేయకపోవడంతో కిడ్నాపర్లు ఎవరనేది మిస్టరీగా మారింది.

చదవండి : జసిత్‌ను వదిలిపెట్టిన కిడ్నాపర్లు..!

               కిడ్నాపర్లు రోజూ ఇడ్లీనే పెట్టారు : జసిత్‌

మరిన్ని వార్తలు