‘అందరికీ ఇళ్లు’ అందేదెప్పుడు?

5 May, 2019 04:26 IST|Sakshi

టిడ్‌కో ఇంజినీర్ల దోపిడీతో లబ్ధిదారులకు ఇక్కట్లు 

నిర్మాణ సంస్థలకు అనుకూలంగా వ్యవహరిస్తున్న ఇంజినీర్లు 

ఇళ్ల నిర్మాణాలు సకాలంలో పూర్తిచేయకపోయినా చర్యల్లేవు 

జరిమానా విధించకుండా.. ఒప్పందం గడువు పొడిగింపు  

సాక్షి, అమరావతి:  టౌన్‌షిప్‌ అండ్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌(టిడ్‌కో) ఇంజినీర్ల దోపిడీ కారణంగా ‘అందరికీ ఇళ్లు’ అందుబాటులోకి రావడం లేదు. ఒప్పందం ప్రకారం నిర్మాణ సంస్థలు సకాలంలో ఇళ్లు నిర్మించకపోయినా ఇంజినీర్లు పట్టించుకోవడం లేదు. సరైన కారణం లేకుండా ఇళ్లను సకాలంలో నిర్మించని నిర్మాణ సంస్థలకు జరిమానా విధించాలి. కానీ, టిడ్‌కో ఇంజినీర్లు జరిమానా విధించకుండా నిర్మాణ సంస్థల నుంచి పర్సంటేజీలు దండుకుంటున్నారు. ఇళ్ల నిర్మాణంలో జాప్యం వెనుక నిర్మాణ సంస్థల తప్పు లేదని, భూ సేకరణ పూర్తి కాలేదని, డిజైన్లు ఆమోదం పొందలేదని ప్రభుత్వానికి నివేదికలు పంపుతున్నారు. వీటి ఆధారంగా ఒప్పందం గడువును ప్రభుత్వం పొడిగిస్తోంది.  

రాష్ట్రంలో పట్టణాలు, నగరాల్లో ప్రధానమంత్రి ఆవాస్‌ యోజన పథకం కింద 5.24 లక్షల ఇళ్లు (ఫ్లాట్‌లు) నిర్మించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. నిర్మాణ వ్యయం, విస్తీర్ణాన్ని బట్టి ఇంటి విలువను రూ.7.30 లక్షలు, రూ.8 లక్షలు, రూ.9 లక్షలుగా నిర్ణయించారు. లబ్ధిదారుడి వాటా, బ్యాంకు నుంచి తీసుకున్న రుణాన్ని బట్టి నెలకు రూ.2,500, రూ.2,900, రూ.3,500 వాయిదాగా చెల్లించాల్సి ఉంటుంది. ఎంపిక చేసిన ప్రదేశంలో జీ+3 విధానంలో నిర్మాణాలు జరిపేందుకు రెండేళ్ల క్రితం ప్రభుత్వం ప్రముఖ నిర్మాణ సంస్థలకు బాధ్యతలు అప్పగించింది.  

అవినీతిపై ప్రభుత్వానికి ఫిర్యాదులు  
శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, ఉభయ గోదావరి, కృష్ణా, గుంటూరు, కర్నూలు, కడప, అనంతపురం జిల్లాల్లో పనులు పొందిన నిర్మాణ సంస్థలు ఒప్పందం ప్రకారం సకాలంలో ఇళ్లను నిర్మించలేకపోయాయి. 80,238 ఇళ్లకు గాను ఈ ఏడాది మార్చి నాటికి కేవలం 1,500 ఇళ్లనే నిర్మించాయి. నిర్మాణాలను గడువులోగా పూర్తి చేయని సంస్థలకు ఈపీసీ విధానం ప్రకారం జరిమానా విధించాలి. కానీ, ప్రభుత్వం ఎలాంటి జరిమానా విధించకుండా ఒప్పందం గడువును పలుమార్లు పొడిగించింది. టిడ్‌కో ఇంజినీర్ల అవినీతి కారణంగానే నిర్మాణ సంస్థలు జరిమానా నుంచి తప్పించుకున్నాయన్నది బహిరంగ రహస్యమే. లబ్ధిదారులు నిర్మాణ సంస్థలు, ఇంజినీర్ల అవినీతిపై ప్రభుత్వానికి, విజిలెన్స్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారులకు ఫిర్యాదు చేశారు.  

అదనపు భారం  
రాష్ట్రంలో దాదాపు 65 వేల ఇళ్ల నిర్మాణాలు పూర్తయ్యాయి. అయితే, వాటిలో నాణ్యత అంతంతమాత్రంగానే ఉండడంతో చాలామంది లబ్ధిదారులు ఇంకా గృహప్రవేశం చేయలేదు. సొంత డబ్బులు వెచ్చించి, మరమ్మతులు చేయించుకుంటున్నారు. నాణ్యతా ప్రమాణాలకు అనుగుణంగా ఇళ్ల నిర్మాణాలు జరగలేదని టిడ్‌కోకు చెందిన క్వాలిటీ కంట్రోల్‌ విభాగం నివేదిక పంపినా ప్రభుత్వం ఇప్పటికీ ఎలాంటి చర్యలు తీసుకోలేదు. 

వడ్డీతో సహా రాబట్టుకోవాలట!  
ఇతర ప్రభుత్వ శాఖల నుంచి టిడ్‌కోకు డిప్యూటేషన్‌పై వచ్చిన ఇంజినీర్లు విచ్చలవిడిగా అవినీతికి పాల్పడుతున్నారనే ఫిర్యాదులు వస్తున్నాయి. మూడేళ్ల డిప్యూటేషన్‌పై వచ్చిన ఇంజినీర్లు అందినంత దోచుకునే ప్రయత్నాల్లో ఉన్నారు. ఇక్కడకు రావడానికి పెద్ద మొత్తంలో ఖర్చు పెట్టామని, అదంతా వడ్డీతో సహా తిరిగి రాబట్టుకోవాల్సి ఉందని చెబుతున్నారు.   

మరిన్ని వార్తలు