టార్గెట్‌ 5 లక్షల ఇళ్లు | Sakshi
Sakshi News home page

టార్గెట్‌ 5 లక్షల ఇళ్లు

Published Sat, Nov 4 2023 4:35 AM

The target is 5 lakh houses - Sakshi

సాక్షి, అమరావతి: రాష్ట్రవ్యాప్తంగా ప్రతి పేదింటి అక్కచెల్లెమ్మ సొంతింటి కలను నెరవేర్చాలన్న సంకల్పంతో ఉన్న సీఎం జగన్‌ సర్కార్‌.. వచ్చే సంక్రాంతి నాటికి రాష్ట్రంలో మరో ఐదు లక్షల పేదల ఇళ్ల నిర్మాణాలు పూర్తిచేయాలనే లక్ష్యంతో గృహ నిర్మాణ శాఖ అడుగులు వేస్తోంది. నవరత్నాలు–పేదలందరికీ ఇళ్ల పథకం కింద 30.75 లక్షల మంది పేద మహిళల పేరిట విలువైన ఇంటి స్థలాలను ఉచితంగా పంపిణీ చేసిన విషయం తెలిసిందే.

అంతేకాక.. ఇందులో 22 లక్షల ఇళ్ల నిర్మాణానికి  అనుమతులు కూడా ఇచ్చారు. మొదటి దశ కింద మొన్న ఆగస్టు నెలాఖరు నాటికి ఐదు లక్షల ఇళ్ల నిర్మాణాలను పూర్తిచేశారు. గత నెల 12 నాటికి రెండో దశలోని కొన్ని ఇళ్లతో కలిపి 7.43 లక్షల (5.86 లక్షల సాధారణ + 1.57 లక్షల టిడ్కో) ఇళ్లను లబ్దిదారులకు అందజేశారు.  

శరవేగంగా రెండో దశ ఇళ్ల నిర్మాణం.. 
ఇక రెండో దశలో ఐదు లక్షల ఇళ్ల నిర్మాణం చేయాల్సి ఉండగా ఇప్పటికే  98,308 ఇళ్ల నిర్మాణం పూర్తయింది. మిగిలిన నాలుగు లక్షలకు పైగా ఇళ్లను నిర్దేశించుకున్న లక్ష్యంలోగా పూర్తిచేసి పేదలకు అందించేందుకు గృహ నిర్మాణ శాఖ శరవేగంగా అడుగులు వేస్తోంది. ప్రస్తుతం ముగింపు దశలో 12,479, రూఫ్‌ లెవెల్‌లో 1.03 లక్షలు, పునాది పైదశల్లో 3.94 లక్షల చొప్పున ఇళ్లు నిర్మాణంలో ఉన్నాయి. వీటన్నింటినీ వేగంగా పూర్తిచేయడంపై అధికారులు దృష్టిపెట్టారు.

ఉచితంగా స్థలం.. ఆపై అమిత సాయం 
మరోవైపు.. ఇళ్ల లబ్దిదారులకు ఖరీదైన స్థలాలను ఉచితంగా పంపిణీ చేసిన సీఎం జగన్‌ ప్రభుత్వం అక్కడితో ఆగకుండా ఇంటి నిర్మాణం నిమిత్తం యూనిట్‌కు రూ.1.80 లక్షల బిల్లు మంజూరు చేస్తోంది.  
స్వయం సహాయక బృందాల ద్వారా లబ్దిదారులైన మహిళలకు పావలా వడ్డీకి రూ.35 వేలు రుణసాయం చేస్తోంది.  
ఉచితంగా ఇసుకను పంపిణీ చేయడం ద్వారా రూ.15 వేలు.. స్టీల్, సిమెంట్, ఇలా 12 రకాల నిర్మాణ సామగ్రిని సబ్సిడీపై సరఫరా> చేయడం ద్వారా మరో రూ.40 వేలు చొప్పున మొత్తంగా రూ.2.70 లక్షల చొప్పున అదనంగా లబ్దిచేకూరుస్తోంది.  
అలాగే, జగనన్న కాలనీల్లో ఉచితంగా నీటి, విద్యుత్‌ సరఫరా కనెక్షన్లు ఇవ్వడం, డ్రెయిన్లు, రోడ్లు లాంటి సకల వసతులను సమకూరుస్తోంది.  
ఇలా స్థలం, ఇంటితో కలిపి పేదింటి మహిళల పేరిట రూ.10 లక్షలు, ఆపైన విలువైన స్థిరాస్తిని జగన్‌ సర్కార్‌ సమకూరుస్తోంది.

అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నాం 
పేదల ఇళ్ల నిర్మాణాలు శరవేగంగా కొనసాగుతున్నాయి. సంక్రాంతి నాటికి పూర్తిచేయాల్సిన లక్ష్యాన్ని అధిగమించేందుకు అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నాం. దీపావళి, క్రిస్మస్, జనవరి ఫస్ట్‌ ఇలా వరుస పండుగలు, ప్రత్యేక రోజులు ఉన్నందున.. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన కూలీలు సొంతూళ్లకు వెళ్లే అవకాశం ఉంటుంది. ఈ సమస్యను అధిగమించి పనులు చకచకా పూర్తిచేయడానికి శ్రమిస్తాం.       – అజయ్‌ జైన్, ప్రత్యేక ప్రధాన  కార్యదర్శి, రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ  

Advertisement

తప్పక చదవండి

Advertisement