కిరీటంపైనే సొగసరుల గురి

24 Oct, 2015 02:20 IST|Sakshi
కిరీటంపైనే సొగసరుల గురి

* ‘మిస్ రాజమండ్రి’ టైటిల్ కోసం పోటీ పడుతున్న 15 మంది  
* అందానికి ఆత్మవిశ్వాసం తోడు కాగా శిక్షణ పొందుతున్న యువతులు
కంబాలచెరువు (రాజమండ్రి) : మేనిలో మిసమిసలాడే లావణ్యం తొణికిసలాడుతున్న ఆ లలనల మనసుల్లో ఆత్మ విశ్వాసమూ పరవళ్లు తొక్కుతోంది. ‘మిస్ రాజ మండ్రి’ మకుటాన్ని ధరించాలన్న ఆరాటమే కాదు.. ధరించగలమన్న ధీమా కూడా వారిలో వ్యక్తమవుతోంది. ఈనెల 25న రాజమండ్రి షెల్టాన్ హోటల్‌లో జరిగే ‘మిస్ రాజమండ్రి’ పోటీల్లో జిల్లాకు చెందిన 15మంది యువతులు పోటీ పడుతున్నారు.

ప్రాథమిక పోటీలకు 70మంది యువతులు హాజరుకాగా వారిలో 15 మందిని ఫైనల్‌కు ఎన్నుకున్నారు. వీరిలో ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాలను ఎంపిక చేయనున్నారు. ‘మిస్ రాజమండ్రి’ టైటిల్‌ను సొంతం చేసుకునేందుకు వీరంతా ప్రస్తుతం సాధన చేస్తున్నారు.  
 వారికి గత కొద్దిరోజులుగా హోటల్ షెల్టాన్‌లో నిర్వాహకులు గొట్టిముక్కల సాయి, మోడల్ సాధనాసింగ్ శిక్షణ ఇస్తున్నారు. ఇలాంటి పోటీల్లో పాల్గొనడం తమకు ఇదే మొదటిసారని, అరుునా సత్తా నిరూపిస్తామని అంటున్న ఆ అందాలభామల మనోగతాలివి..
 ఏ లలన తలను వరించనుందో..
 మెరిసే ఈ మకుటం!  (మిస్ రాజమండ్రి కిరీటం)

 
సినిమాల్లోకి వెళ్లాలనుంది..
నేనెప్పుడూ ఫ్యాషన్‌షోలో పాల్గొనలేదు. నాకు ఇదే తొలిసారి. గీతం కళాశాలలో బీకాం చదువుతున్నాను. తొలుత ర్యాంప్‌పై నడవడం అంటే చాలా భయమేసింది. ఇప్పుడది పోయింది. మోడల్‌గా రాణించి, సినిమా ఇండస్ట్రీలోకి వెళ్లాలనుంది
 - గీతిక, బీకాం, గీతం కళాశాల
 
మోడలింగ్ అంటే ఇష్టం..
నాకు మోడలింగ్ అంటే చాలా ఇష్టం. మిస్ రాజమండ్రి పోటీలు నాకు ఆ అవకాశం కల్పించాయి. ఖచ్చితంగా టైటిల్ సాధిస్తాననే నమ్మకం ఉంది. మా తల్లిదండ్రుల ప్రోత్సాహం ఉంది. నేను బీబీఎం మూడో సంవత్సరం చదువుతున్నాను.
 - భావ్యసురేఖ, బీబీఎం, ఆదిత్య డిగ్రీ కళాశాల
 
టైటిల్ నాదేనన్న నమ్మకముంది
మహిళలు అన్ని రంగాల్లోనూ ముందంజలో ఉన్నారు. ఈ రంగంలో రాణించాలనుకుంటున్నాను. నా కుటుంబసభ్యులు నాకు ఎంతగానోప్రోత్సాహాన్ని ఇస్తున్నారు. మిస్ రాజమండ్రి పోటీలో గెలుస్తాననే నమ్మకం ఉంది.
 - గాయత్రీ దివ్య, డిగ్రీ విద్యార్థిని, రావులపాలెం
 
నటిగా స్థిరపడాలనుంది
నటిగా స్థిరపడాలని ఉంది. నాకు ఎటువంటి అనుభవం లేదు. ఈ పోటీల్లో తొలిసారి పాల్గొంటున్నాను. ముందుగా భయం వేసినా ప్రస్తుతం పోయింది. దేనికైనా ఆత్మవిశ్వాసం కావాలి. అది ఉంటే ఖచ్చితంగా అనుకున్నది సాధించొచ్చు.
- శ్రీవల్లి, డిగ్రీ విద్యార్థిని, రాజమండ్రి

మరిన్ని వార్తలు