ఎందుకో ఈ మౌనం.. ఏమిటో ఆ అంతరార్థం

19 Oct, 2018 08:43 IST|Sakshi

 చిన్న పాండూరు శోత్రియ భూముల్లో పుట్టుకొస్తున్న అక్రమ గుడిసెలు

 షికారీల పేరుతో ఇతర ప్రాంతాల వారు ప్రవేశం

 10 నుంచి 200 గుడిసెలు ఏర్పాటు

 మౌనముద్రలో రెవెన్యూ యంత్రాంగం

పేదలు గూడు కోసం ఓ చిన్నపాక వేసుకుంటే హడలెత్తిస్తారు రెవెన్యూ అధికారులు. వరదయ్యపాళెం మండలం చిన్న పాండూరు శోత్రియ భూముల్లో 200కు  పైగా గుడిసెలు అక్రమంగా వేసుకున్నా రెవెన్యూ అధికారులు నోరు మెదపడం లేదు. పైగా అక్కడ గుడిసెలు ఏర్పాటు చేసుకున్న వారందరూ ఈ ప్రాంతానికి చెందిన వారు కాకపోవడం గమనార్హం. షికారీల పేరిట గుడిసెలు ఏర్పాటు చేయడం వెనుక పెద్ద నాటకీయ పరిణామాలే జరుగుతున్నాయి. దీనికి నాయకత్వం వహిస్తున్న మాఫియా లీడర్లు గుడిసెకో రేటు విధించి వసూలు చేస్తున్నారు. పైగా ఇంటి స్థలం మొదలు సాగుభూమి వరకు తీసిస్తామని భరోసా ఇస్తుండడం విమర్శలకు తావిస్తోంది. ఇంత జరుగుతున్నా కట్టడి చేయాల్సిన రెవెన్యూ యంత్రాంగం మౌనముద్రలో ఉండడం పలు అనుమానాలకు తావిస్తోంది.


వరదయ్యపాళెం: జిల్లాలో చిన్న పాండూరు పేరు వింటూనే నూతనంగా నిర్మించే అపోలో టైర్ల పరిశ్రమ, హీరో ద్విచక్ర వాహనాల పరిశ్రమలు గుర్తుకొస్తాయి. దీంతో ప్రస్తుతం రియల్టర్ల చూపంతా ఈ ప్రాంతం వైపే ఉండడంతో భూములకు ఒక్కసారిగా విలువ పెరిగింది. దీన్ని అదునుగా భావించిన అక్రమార్కులు ఎంచక్కా ఇంటి స్థలాల పేరిట వందలాది ఎకరాల ఆక్రమణకు పన్నాగం పన్నుతున్నారు. షికారీలను రంగంలోకి దించి చిన్న పాండూరు శోత్రియ భూముల్లో  ఏడాదిన్నర కాలంలో 200కుపైగా గుడిసెలు ఏర్పాటు చేశారు.

భూముల నేపథ్యమిలా..

చిన్న పాండూరు పంచాయతీ పాదిరికుప్పం రెవెన్యూలో సర్వే నెంబర్లు 1 నుంచి 84లలో 1,060 ఎకరాలు శోత్రియ భూములు ఉన్నాయి. చిన్న పాండూరు, వడ్డిపాళెం, పాదిరికుప్పం, రామలక్ష్మ మ్మకండ్రిగ గ్రామాలకు చెందిన స్థానికులు సంబంధిత భూములను అనధికారికంగా సాగుచేసుకుంటూ అనుభవదారులుగా కొనసాగుతున్నారు. ఈ భూములకు సంబంధించి ప్రభుత్వానికి ప్రైవేటు వ్యక్తులకు మధ్య కోర్టులో వివాదం జరుగుతోంది. గతంలో ప్రభుత్వానికి అనుకూలంగా జాయింట్‌ కలెక్టర్‌ సెటిల్‌మెంట్‌ కోర్టులో తీర్పు వెలువడడంతో సంబంధిత భూములు ప్రభుత్వానికి చెందినవిగా బోర్డులు కూడా రెవెన్యూ శాఖ ఏర్పాటు చేసింది. ప్రైవేటు వ్యక్తులు ఆ తీర్పును వ్యతిరేకిస్తూ మరోసారి కోర్టును ఆశ్రయించడంతో ప్రస్తుతం ఇరువర్గాల మధ్య కేసు కొనసాగుతోంది.

మౌనముద్రలో రెవెన్యూ శాఖ..

శోత్రియ భూముల్లో అక్రమార్కులు గుడిసెలు ఏర్పాటు చేసుకుంటున్నా రెవెన్యూ శాఖ తమకేమీ పట్టనట్లు ఉండడం సర్వత్రా విమర్శలకు దారితీస్తోంది. ఆక్రమించిన వారు ఏకంగా ఆ ప్రాంతా నికి నక్కలమిట్టగా నామకరణం చేయడం, ఆ ప్రాంతంలో మౌలిక వసతులు ఏర్పాటు చేయాలని, ఇంటి పట్టాలు ఇవ్వాలని ప్రతివారమూ తహసీల్దార్‌ కార్యాలయం వద్ద నిరసనలకు దిగడం షరా మామూలుగా మారింది.

ఏడాది క్రితం ఆక్రమణల తొలగింపు..

శోత్రియ భూముల్లో వెలసిన గుడిసెల తొలగింపుకు జిల్లా అధికార యంత్రాంగం ఆదేశాలు జారీ చేయడంతో సరిగ్గా గత ఏడాది సెప్టెంబర్‌ 13న సుమారు 100మంది పోలీసు బలగాలతో డీఎస్పీ స్థాయి అధికారి పర్యవేక్షణలో మండల రెవెన్యూ యంత్రాంగం అక్రమ గుడిసెలను బలవంతంగా తొలగించింది. అయితే ఆక్రమణకు పాల్పడిన వారు మాత్రం ఆ ప్రాంతాన్ని విడిచి వెళ్లకుండా అక్కడే ఉన్నారు. పది రోజుల పాటు ఆ భూములలో ప్రవేశించకుండా రెవెన్యూ యంత్రాంగం కూడా కాపలా ఉంది. ఆపై పర్యవేక్షణ గాలికొదిలేయడంతో సమస్య మళ్లీ మొదటికొచ్చింది. మరో మారు అక్రమ గుడిసెలు ఏర్పాటు కొనసాగుతోంది.

అక్రమ గుడిసెల ఏర్పాటు తగదు..

సంవత్సరాల తరబడి తమ అనుభవంలో ఉన్న భూములలో గుడిసెలు ఏర్పాటు చేయడం తగదని చిన్న పాండూరు ప్రాంత అనుభవదారులు చెబుతున్నారు. ప్రభుత్వం నిర్లక్ష్యధోరణి అవలం బించడం వల్లే గుడిసెలు పుట్టుకొస్తున్నాయంటున్నారు. అడవిగా ఉన్న భూములను సొంత ఖర్చులతో చదును చేసి, సాగులోకి తెచ్చుకున్నామని, ఈ క్రమంలో ఇలాంటి చర్యలకు పాల్పడటం సరైన పద్ధతి కాదని అంటున్నారు. ప్రభుత్వం స్పందించకుంటే ఆందోళన చేయాల్సి వస్తుందని హెచ్చరిస్తున్నారు.

పూర్వీకులు ఇక్కడ ఉండేవారు..

40 సంవత్సరాల క్రితం చిన్నపాండూరు సమీపంలోని శోత్రియ భూముల్లో ఒకచోట తమ పూర్వీకులు పది కుటుంబాల వారు ఉండేవారని ప్రస్తుతం గుడిసెలు ఏర్పాటు చేసుకున్న కొందరు చెబుతున్నారు. ఈ ప్రాంతాన్ని నక్కలమిట్ట అని కూడా అనేవారని పేర్కొంటున్నారు. వివిధ కారణాలతో క్రమేణా వేరే ప్రాంతాలకు తమ పూర్వీకులు వలస వెళ్లారని, వారి కుటుంబ సభ్యులుగా తమకు ఈ ప్రాంతంలో ఇళ్ల స్థలాలు ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు.

మరిన్ని వార్తలు