భారీ సడలింపులు ఎందుకు?

23 Oct, 2016 03:11 IST|Sakshi
భారీ సడలింపులు ఎందుకు?

- టెట్ అర్హత మార్కుల విషయంలో రాష్ట్రాలు పునరాలోచించాలి
- మినహాయింపులతో ఉన్నత ప్రమాణాలూ సాధ్యం కావు
- రాజస్థాన్ కేసులో సుప్రీంకోర్టు స్పష్టీకరణ
 
 సాక్షి, హైదరాబాద్: ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్)లో కనీస అర్హత మార్కులకు సంబంధించి రిజర్వుడు కేటగిరీలకు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు భారీ సడలింపులు ఇస్తుండటాన్ని సుప్రీంకోర్టు ఆక్షేపించింది. ఈ విషయంలో పునరాలోచన చేయాల్సిన అవసరం ఉందని రాష్ట్ర ప్రభుత్వాలకు స్పష్టం చేసింది. భారీ సడలింపులు ఇవ్వడం ద్వారా నాణ్యమైన విద్యను అందించే విషయంలో రాజీపడినట్లవుతుందని తేల్చి చెప్పింది. పరిమితులకు లోబడే సడలింపులు ఉండాలంది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ ఎ.కె.సిక్రీ, జస్టిస్ ఆర్.కె.అగర్వాల్‌తో కూడిన ధర్మాసనం ఇటీవల తీర్పు వెలువరించింది.

ఒక్క ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో మినహా దేశంలోని ఏ ఇతర రాష్ట్రం కూడా కనీస అర్హత మార్కుల విషయంలో భారీ సడలింపులు ఇవ్వడం లేదని రాజస్థాన్ హైకోర్టు తన తీర్పులో పేర్కొన్న విషయాన్ని సుప్రీంకోర్టు సైతం తన తీర్పులో ప్రస్తావించింది. జాతీయ ఉపాధ్యాయ విద్యా మండలి (ఎన్‌సీటీఈ) మార్గదర్శకాల ప్రకారం టీచర్ పోస్టులను భర్తీ చేసేందుకు రాజస్థాన్ ప్రభుత్వం 2011లో నోటిఫికేషన్ ఇచ్చింది. టెట్ పరీక్షకు కనీస అర్హత మార్కులు 60 శాతం కాగా, జనరల్ కేటగిరీ మహిళలతో సహా మిగిలిన రిజర్వుడు కేటగిరీలకు అర్హత మార్కుల్లో 10 శాతం, విడాకులు పొందిన మహిళలకు, వితంతువులకు 15 శాతం, వికలాంగులకు 20 శాతం సడలింపునిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

2012లో పరీక్ష, ఎంపిక ప్రక్రియ పూర్తి చేసి ఎంపికైన వారికి జాయినింగ్ ఆర్డర్లు కూడా ఇచ్చారు. ఈ సడలింపులను సవాలు చేస్తూ జనరల్ కేటగిరీ అభ్యర్థులు రాజస్థాన్ హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు.  విచారణ జరిపిన సింగిల్ జడ్జి, కనీస అర్హత మార్కుల్లో ప్రభుత్వం ఇచ్చి న సడలింపులు చట్ట ప్రకారం చెల్లవని తేల్చారు. దీనిపై ప్రభుత్వం ధర్మాసనం ముందు అప్పీల్ చేసింది. అలాగే రిజర్వుడు కేటగిరీకి చెందిన పలువురు అభ్యర్థులు సైతం అప్పీళ్లు దాఖలు చేశారు. వీటిపై విచారణ జరిపిన ధర్మాసనం.. సింగిల్‌జడ్జి తీర్పులోని కొన్ని అంశాలతో విభేదిస్తూ అంతిమంగా ప్రభుత్వం, రిజర్వుడు కేటగిరీ అభ్యర్థుల అప్పీళ్లును కొట్టేస్తూ 2013లో తీర్పునిచ్చింది. ఈ తీర్పుపై అటు ప్రభుత్వం, ఇటు అభ్యర్థులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ అప్పీళ్లపై జస్టిస్ సిక్రీ నేతృత్వంలోని సుప్రీం ధర్మాసనం లోతుగా విచారణ జరిపి గత వారం తీర్పు వెలువరించింది.
 
 ఎన్‌సీటీఈ 5 శాతం సడలింపు ఇవ్వడం లేదు
 ఎన్‌సీటీఈ 2011 ఫిబ్రవరిలో జారీ చేసిన సవరణ నోటిఫికేషన్‌లో ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, వికలాంగులకు 5 శాతం సడలింపు ఇవ్వొచ్చునని పేర్కొన్న అంశంపై కూడా సుప్రీంకోర్టు తన తీర్పులో స్పష్టతనిచ్చింది. ఎన్‌సీఈటీ 5 శాతం సడలింపు ఇవ్వలేదని, రిజర్వుడు వర్గాలకు సడలింపు ఇచ్చే విషయాన్ని అది ఆయా రాష్ట్ర ప్రభుత్వాల విచక్షణకే వదిలేసి, రిజర్వేషన్ల విధానం మేరకు ఉండొచ్చునని చెప్పిందని సుప్రీంకోర్టు గుర్తు చేసింది.

మరిన్ని వార్తలు