భర్త శవాన్ని తరలించేందుకు భిక్షాటన..

23 Jul, 2018 09:15 IST|Sakshi
ప్రభుత్వ ఆస్పత్రిలో చనిపోయిన బాబుసాహేబ్, విలపిస్తున్న దౌలత్‌బీ

పేదరాలికి ఆర్థికసాయం అందించిన రోగులు

చిత్తూరు , మదనపల్లె క్రైం: చికిత్స పొందుతూ భర్త చనిపోవడంతో ఆ శవన్ని ఇంటికి తరలించడానికి డబ్బులు లేక ఓ పేద మహిళ ఆస్పత్రిలోని రోగుల చెంత భిక్షాటన చేసింది. వారు ఆర్థిక సాయం అందించడంతో ఆటోలో భర్త మృతదేహాన్ని ఇంటికి తీసుకెళ్లింది. మదనపల్లె ప్రభుత్వ ఆస్పత్రిలో ఆదివారం వెలుగుచూసిన ఈ విషాదకర ఘటనకు సంబం ధించి వివరాలు ఇలా ఉన్నాయి.  పుంగనూరు మండలం బారాడపల్లె పంచాయతీ ఈడిగపల్లెకు చెందిన బాబుసాహేబ్‌(45) భవన నిర్మాణ కార్మి కుడు. ఇతడు గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతుండడంతో అతని భార్య దౌలత్‌బీ ఆదివారం 108లో భర్తను చికిత్స కోసం మదనపల్లె ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకు వచ్చింది.

అత్యవసర విభాగంలో ప్రథమ చికిత్స అందించిన వైద్యులు బాబుసాహేబ్‌ పరిస్థితి విషమంగా ఉందని మెరుగైన వైద్యం కోసం తిరుపతికి తరలించాలని సూచించారు. అయితే దౌలత్‌బీ తన చేతిలో చిల్లిగవ్వ కూడా లేదని డాక్టర్ల వద్ద కన్నీరు పెట్టుకుంది. చేసేది లేక డాక్టర్లు వెంటనే అతన్ని వార్డులో అడ్మిట్‌ చేసి చికిత్స అందించారు. అప్పటికే గొం తు బిగుసుకుపోయిన బాబు సాహేబ్‌ ఊపిరి ఆడ క శ్వాసకోస వ్యాధితో తీవ్ర అస్వస్థతకు గురైæ చని పోయాడు. భర్త మరణించాడని తెలియడంతో దౌలత్‌బీ కన్నీరు మున్నీరైంది. ఇక తనకూ, తన బిడ్డలిద్దరికి దిక్కెవరంటూ రోదించింది. చివరకు 20 కిలోమీటర్ల దూరంలోని తన ఇంటికి భర్త శవాన్ని తీసుకెళ్లడానికి కూడా ఆమె వద్ద డబ్బులు కూడా లేకుండా పోయాయి. దీంతో ఆస్పత్రిలో కనిపించిన వారందరినీ ఆర్థికసాయం అందించామని వేడుకుంది. కరుణించిన కొందరు ఆమెకు కొంత నగదును ఇవ్వడంతో ఆ డబ్బుతో బాడుగ ఆటోలో తన భర్త శవాన్ని స్వగ్రామానికి తీసుకెళ్లింది. ఆటో డ్రైవర్‌ కూడా ఉదారంగా వ్యవహరించి తక్కువ మొత్తంతో  బాబుసాహేబ్‌ మృతదేహాన్ని ఇంటికి తరలించాడు. ఈ విషయం స్థానికంగా కలకలం రేపింది.

మరిన్ని వార్తలు