పని భారంతో డీలార్లు

2 Jan, 2016 00:55 IST|Sakshi
పని భారంతో డీలార్లు

రేషన్ సరుకు పంపిణీలో సంస్కరణలు ప్రవేశపెట్టి డీలర్లపై పనిభారం పెంచిన ప్రభుత్వం కమీషన్ పెంపుపై మీనమేషాలు లెక్కిస్తోంది. రేషన్ దుకాణాల్లో ఈ-పోస్ విధానం ప్రవేశపెట్టి కమీషన్ చెల్లిస్తామన్న హామీని తుంగలో తొక్కింది. దీనిపై ప్రభుత్వంతో పలు దఫాలుగా రేషన్‌డీలర్లు జరిపిన చర్చల్లో ఆ మేరకు హామీ లభించినా, అమలుకు నోచుకోవడం లేదు. ఆర్‌బీఐ ఎప్పుడో నిషేధించిన పైసాల్లోనే ఇప్పటికీ డీలర్లకు కమీషన్‌గా ఇస్తున్న ప్రభుత్వ నిర్ణయం పరోక్షంగా కొందరు డీలర్ల అవినీతికి కారణమవుతోందనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తం    అవుతోంది.
 
తెనాలి రూరల్ :  గుంటూరు జిల్లాలో 2,716 రేషన్ దుకాణాలు, సుమారు 30 లక్షల వరకు కార్డులు ఉన్నాయి. ఇటీవల ప్రవేశపెట్టిన ఈ-పోస్ విధానం వల్ల రేషన్ దుకాణాల్లో అవినీతి తగ్గినా, పనిభారం విపరీతంగా పెరిగింది. ఒక్కోసారి సర్వర్లు పని చేయక రేయింబవళ్లు సరుకును పంపిణీ చేయాల్సిన పరిస్థితి నెలకొంది. పెరిగిపోతున్న వ్యయానికి తగ్గట్టుగా ఆహార భద్రత చట్టం ప్రకారం కమీషన్‌ను పెంచాలని కేంద్ర ప్రభత్వం సూచించినా, రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోకపోవడంపై డీలర్లు ఆందోళన చెందుతున్నారు. ఈ-పోస్ యంత్రాలకు సాంకేతిక లోపం ఏర్పడినా సంబంధిత డీలర్లే మరమ్మతులు చేరుుంచుకోవాల్సి రావడంతో చేతి చమురు వదులుతోంది. ప్రస్తుతం ప్రభుత్వం అవలంభిస్తున్న విధానాల వల్ల తాము తీవ్రంగా నష్టపోతున్నామని డీలర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
 
కమిషన్ పెంపు కోసం ఎదురు చూపు..
 కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన అమార భద్రత చట్ట ప్రకారం కమీషన్ పెంచుతుందని డీలర్లు ఎదురుచూస్తున్నారు. ప్రభుత్వ పెద్దల నుంచి ఎటువంటి స్పందన లేకపోవడంతో డిసెంబర్ 21వ తేదీ నుంచి సమ్మెకు దిగాలని నిర్ణయించారు. అయితే పండుగల సీజన్ కావడంతో ప్రజలకు తీవ్ర ఇబ్బందులు ఎదురయ్యే పరిస్థితి ఉందని గ్రహించిన రాష్ట్ర ప్రభుత్వం త్వరలోనే సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇవ్వడంతో సమ్మెను డీలర్లు విరమించారు. అయినా ఇప్పటి వరకు దీనిపై స్పష్టత లేదు. సమస్యలను పరిష్కరించకపోతే రేషన్ దుకాణాల నిర్వహణ నుంచి వైదొలిగేందుకు పలువురు సిద్ధపడుతున్నారు. ప్రజా పంపిణీ వ్యవస్థ ప్రారంభమయ్యే రోజులకు, ఇప్పటికీ కమీషన్‌లో పెద్దగా మార్పు లేదు. ప్రస్తుతం రాష్ట్రంలోని 29వేల మంది డీలర్లు నెలకు రూ. 191 కోట్లు పెట్టుబడి పెడుతుంటే, వారికి వస్తున్న కమిషన్ కేవలం రూ. 10.71 కోట్లు మాత్రమే. బియ్యం కేజీకి గతంలో 12 పైసలు ఉండగా ప్రస్తుతం 20 పైసలకు, పంచదార 13 పైసలు నుంచి 16 పైసలు, గోధుమలకు 7 నుంచి 13 పైసలకు కమీషన్‌ను పెంచి ఇస్తున్నారు. కిరోసిన్‌కు మాత్రం ఇప్పటికీ లీటరుకు 25 పైసలే ఇస్తున్నారు. కందిపప్పు విషయంలో డీలర్లకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. రూ.89.45 పెట్టి కిలో కందిపప్పు కొనుగోలు చేస్తే వారికి వచ్చే కమిషన్ కేవలం 55 పైసలు మాత్రమే. ఆహార భద్రత చట్టం ప్రకారం ఈ-పోస్ విధానాన్ని అమలు చేస్తున్న రేషన్ దుకాణాల్లో డీలర్లకు ఇచ్చే కమిషన్‌ను బియ్యానికి 87 పైసలు, పంచదారకు 60పైసలు, గోధుమలకు 70 పైసలు, కిరోసిన్‌కు 75 పైసలు  పెంచాలని కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు వెలువరించి ఏడు నెలలు గడుస్తున్నా, రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. కమిషన్ పెంపు జరుగకపోగా పనిభారం పెరగడంతో డీలర్లు డీలా పడుతున్నారు.
 
జాడలేని ‘కానుక’ల కమీషన్..

గోదాముల నుంచి నేరుగా తీసుకువస్తున్న రేషన్ సరుకుల్లో వస్తున్న విపరీతమైన తరుగు డీలర్లను ఇక్కట్ల పాల్జేస్తోంది. క్షేత్రస్థాయిలో ఎలక్ట్రానిక్ యంత్రాలపై సరుకులను తూచి ఇస్తుండగా, గోదాముల నుంచి బస్తాలను నేరుగా లోడింగ్ చేస్తున్నారు. దీనిపై పలుమార్లు పౌరసరఫరా అధికారులను ప్రశ్నించినా ఫలితం లేకపోయింది. ఇంతే కాక పండుగల సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం గతంలో చంద్రన్న కానుక, చంద్రన్న రంజాన్ తోఫా పేరిట సరుకులను డీలర్ల చేత పంపిణీ  చేయించింది. అయినా వాటికి సంబంధించిన కమీషన్లు ఇప్పటికీ రాలేదు. దీనికి తోడు ప్రస్తుతం క్రిస్మస్, సంక్రాంతి కానుకల పంపిణీ జరుగుతోంది. వీటికి ఎప్పటికి కమీషన్ వస్తోందో తెలీని పరిస్థితి.
 

మరిన్ని వార్తలు