న్యాయం జరిగే వరకూ కదలనూ

5 Jul, 2019 06:53 IST|Sakshi

భర్త ఇంటి ఎదుట భార్య బైఠాయింపు

పోలీస్‌స్టేషన్‌ చేరిన పంచాయితీ 

సాక్షి, డోన్‌(కర్నూలు) : అగ్నిసాక్షిగా పెళ్లాడిన భర్త.. ఇష్టం లేదని చెప్పడంతో భార్య ఆయన ఇంటి ఎదుట బైఠాయించింది. తనకు న్యాయం జరిగేవరకు ఇక్కడి నుంచి కదలనని భీష్మించింది. బాధితురాలి బంధువులు తెలిపిన వివరాల మేరకు.. కర్ణాటక రాష్ట్రం రాయచూరుకు చెందిన రాజు, వరలక్ష్మి బాయి దంపతుల కుమార్తె ఉమామహేశ్వరిని ఏడాది క్రితం డోన్‌లోని పాతపేటకు చెందిన నారాయణ,దేవిబాయ్‌ కుమారుడైన వీరేష్‌కుమార్‌కు ఇచ్చి వివాహం జరిపించారు. వివాహం సందర్భంగా రూ.2లక్షల నగదుతో పాటు రూ.20తులాల బంగారం కట్న కానుకల కింద అందజేశారు.

ఆరు నెలలు సవ్యంగా సాగిని వీరి సంసారంలో విభేదాలు చోటు చేసుకున్నాయి.  దీంతో భార్య ఉమామహేశ్వరిని భర్త వీరేష్‌కుమార్‌ అరునెలల కిందట పుట్టినింట్లో వదిలొచ్చాడు. కాపురానికి తీసుకువెళ్లేందుకు రాకపోవడంతో పాటు, నీతో సంసారం చేసేందుకు తనకు ఇష్టం లేదని భర్త తెగేసి చెప్పడంతో ఉమామహేశ్వరి తన తల్లిదండ్రులతో పాటు బంధువులను తీసుకొని డోన్‌కు వచ్చింది. అయితే ఆమె ఇంట్లోకి వెళ్లగానే భర్తతో పాటు అత్తామామలు దుస్తులను  పారవేసి ఉమామహేశ్వరిని బయటికి గెంటేశారు. దీంతో ఆమె భర్త ఇంటి ముందు బైఠాయించింది. తనకు న్యాయం జరిగి ఇంట్లోకి రానించేంత వరకు కదలని స్పష్టం చేసింది. స్థానికులు పోలీసులకు సమాచారమివ్వడంతో సీఐ కంబగిరి రాముడు రెండు కుటుంబాలను స్టేషన్‌కు పిలిపించారు.    

మరిన్ని వార్తలు