రాజధానిలో ఉల్లంఘనలు నిజమే

19 Jul, 2019 03:21 IST|Sakshi

నిర్మాణం పూర్తయితే ప్రజల జీవనోపాధికి, పర్యావరణానికి పెనుముప్పు

అమరావతి నిర్మాణానికి రూ.2,100 కోట్ల రుణం ఇవ్వలేమన్న ప్రపంచ బ్యాంక్‌

ప్రాజెక్ట్‌ నుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటన

సాక్షి, అమరావతి : ‘రాజధాని అమరావతి ప్రాజెక్ట్‌లో అడుగడుగునా నిబంధనల ఉల్లంఘనలు ఉన్నాయి. ఈ ప్రాజెక్ట్‌ అమల్లోకి వస్తే పర్యావరణానికి తీవ్ర ముప్పు ఏర్పడుతుంది. స్థానిక ప్రజల జీవనోపాధితో పాటు పర్యావరణానికి ముప్పు తీసుకొచ్చే ఇటువంటి ప్రాజెక్ట్‌లో మేం భాగస్వాములం కాలేం’ అని ప్రపంచ బ్యాంకు తేల్చి చెప్పింది. సుమారు రూ.5,005 కోట్ల విలువైన అమరావతి క్యాపిటల్‌ సిటీ ప్రాజెక్ట్‌ నుంచి వైదొలుగుతున్నట్లు ప్రపంచ బ్యాంక్‌ గురువారం తన వెబ్‌సైట్‌లో పేర్కొంది. ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించి రూ.2,100 కోట్ల (300 మిలియన్‌ డాలర్లు) రుణ ప్రతిపాదనను ఉపసంహరించుకుంటున్నట్లు వెబ్‌సైట్‌లో వెల్లడించింది. ఈ ప్రాజెక్ట్‌కు రుణం ఇచ్చే అవకాశాన్ని పరిశీలిస్తున్నట్లుగా బుధవారం వరకు వెబ్‌సైట్‌లో కనిపించగా, గురువారం ప్రాజెక్ట్‌ నుంచి వైదొలిగినట్లు ప్రకటించింది.

మేథాపాట్కర్‌ హర్షం
రాజధాని అమరావతి విషయంలో ప్రపంచ బ్యాంక్‌ నిర్ణయంపై పర్యావరణ వేత్తలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. నర్మాదా బచావో ఆందోళన సమితి కార్యకర్త మేథాపాట్కర్, వాటర్‌మ్యాన్‌ రాజేంద్ర సింగ్, రాష్ట్ర మాజీ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావు, అనుమోలు గాంధీ, మల్లెల శేషగిరిరావు వంటి మేధావులు మొదటి నుంచీ అమరావతి రాజధాని నిర్మాణాన్ని వ్యతిరేకిస్తూ వచ్చారు. భూ సమీకరణకు వ్యతిరేకంగా అనేక ఆందోళనలు సైతం నిర్వహించిన సంగతి తెలిసిందే. ఏటా నాలుగైదు పంటలు పండే భూముల్లో, అందునా నదీ పరీవాహక ప్రాంతంలోనే రాజధాని నిర్మాణం చేపట్టడాన్ని వారంతా తప్పుపట్టారు.

ఈ ప్రాజెక్ట్‌ను వ్యతిరేకిస్తూ రైతులు నేరుగా ప్రపంచ బ్యాంకుకే అనేకసార్లు లేఖలు రాశారు. కృష్ణా నది వరదలతో సహజసిద్ధంగా ఏర్పడిన అత్యంత సారవంతమైన భూముల నుంచి రాజధాని నిర్మాణానికి 20 వేల మంది రైతులను బలవంతంగా తరలించడాన్ని వీరు తప్పుపట్టారు. దీనిపై బాధిత రైతులు 2017లో ప్రపంచ బ్యాంక్‌కు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు అందుకున్న బ్యాంక్‌ ప్రతినిధులు అనేకమార్లు రాష్ట్రానికి వచ్చి వాస్తవ పరిస్థితులను పరిశీలించారు. ప్రజాభిప్రాయ సేకరణ సైతం జరిపారు. ఎట్టకేలకు ఈ ప్రాజెక్ట్‌ నుంచి వైదొలిగినట్లు ప్రపంచ బ్యాంక్‌ ప్రకటించడంపై మేథాపాట్కర్‌ స్పందిస్తూ.. దీనిని ప్రజావిజయంగా పేర్కొన్నారు. ఈ మేరకు ఆమె ఒక ప్రకటన చేశారు. పర్యావరణానికి తీవ్ర హాని చేయడంతోపాటు స్థానికుల జీవనోపాధిని దెబ్బతీసే ఈ ప్రాజెక్ట్‌ నుంచి ప్రపంచ బ్యాంక్‌ వైదొలగడాన్ని ఆమె స్వాగతించారు.  

మరిన్ని వార్తలు