సంక్షేమ రంగానికి పెద్దపీట వేశాం

9 Mar, 2018 02:01 IST|Sakshi

 ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు

సాక్షి, అమరావతి: సమసమాజ లక్ష్య సాధన కోసం సంక్షేమ రంగానికి పెద్దపీట వేశామని ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు ప్రకటించారు. స్థూల ప్రణాళికలు, సూక్ష్మ అమలు.. అనే విధానంతో తాను ప్రవేశపెట్టే వివిధ పథకాలు తమ ప్రభుత్వ ఉద్దేశాలను ద్విగుణీకృతం చేస్తాయని తనకు గట్టి నమ్మకం ఉందన్నారు. సాధ్యమైన ఆదాయ వనరులను మదింపు చేసి, కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్ర విభజన చట్టం ప్రకారం రావాల్సిన అన్ని బకాయిలు అందుతాయనే ఆకాంక్షతో రెవెన్యూ మిగులు బడ్జెట్‌ను ప్రతిపాదిస్తున్నట్లు చెప్పారు.

ప్రస్తుత పరిస్థితుల్లో అందుబాటులో ఉన్న వనరుల అంచనాలను ప్రాధాన్యాలతో సర్దుబాటు చేయడం కష్టమైన చర్యని పేర్కొన్నారు. అన్ని వర్గాల జీవనాన్ని మెరుగుపర్చడమే ప్రభుత్వ పథకాల ముఖ్యోద్దేశమని ఉద్ఘాటించారు. అనేక సవాళ్ల మధ్య కూడా పట్టుదల, దృఢ చిత్తంతో మనం సాధిస్తున్నపురోగతి ధైర్యాన్ని, విశ్వాసాన్ని కలిగిస్తోందన్నారు.

2018–19 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రూ.1,91,063.61 కోట్లతో రాష్ట్ర బడ్జెట్‌ను మంత్రి యనమల రామకృష్ణుడు గురువారం అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. 2017 –18 ఆర్థిక సంవత్సరంతో పోల్చితే బడ్జెట్‌ 21.70 శాతం పెరిగిందని వివరించారు. మొత్తం 52 పేజీల బడ్జెట్‌ ప్రసంగాన్ని సరిగ్గా మధ్యాహ్నం 11.29 గంటలకు ప్రారంభించి, 12.55కు పూర్తిచేశారు.

రూ.19 వేల కోట్లతో వ్యవసాయ బడ్జెట్‌
వ్యవసాయం, అనుబంధ రంగాలకు వచ్చే ఆర్ధిక సంవత్సరానికి రూ.19,070 కోట్లతో వ్యవసాయ శాఖ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి గురువారం అసెంబ్లీలో బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. ఇందులో రెవెన్యూ వ్యయం రూ.18602.98 కోట్లు కాగా 467.38 కోట్లు పెట్టుబడి వ్యయం. రైతు సంక్షేమం, పంటల ఉత్పాదక పెంపే లక్ష్యంగా ప్రభుత్వం వివిధ కార్యక్రమాలు చేపడుతుందని చెప్పారు.  రుణమాఫీకి రూ.4,100 కోట్లు కేటాయించినట్లు తెలిపారు.

మరిన్ని వార్తలు