అన్నీ తప్పుడు లెక్కలే | Sakshi
Sakshi News home page

అన్నీ తప్పుడు లెక్కలే

Published Fri, Mar 9 2018 2:05 AM

Buggana Rajendranath Reddy on state budgetap - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బడ్జెట్‌ వాస్తవ విరుద్ధంగా ఉందని, ఎçప్పటిలాగే గొప్పలు చెప్పుకునే తప్పుడు లెక్కలే ఉన్నాయని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే, పీఏసీ చైర్మన్‌ బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి దుయ్యబట్టారు. హైదరాబాద్‌లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. బడ్జెట్‌ కేటాయింపుల్లో చిత్తశుద్ధి కన్పించట్లేదని, ప్రభుత్వం చూపించే ఆదాయంలో స్పష్టత కొరవడిందని విమర్శించారు. రాష్ట్ర విభజన సమస్యల వల్ల ఆదాయం రావట్లేదని గత నాలుగేళ్లుగా చెప్పిన మాటనే మళ్లీ చెప్పడం పరిపాటిగా మారిందన్నారు.

పొంతనలేని లెక్కలు: రాష్ట్ర స్థూల ఉత్పత్తి పెరుగుదల జాతీయ ఉత్పత్తినే దాటిపోయిందని చెప్పడం ఎంతవరకు వాస్తవమని ఆయన ప్రశ్నించారు. రాష్ట్రం ఇబ్బందుల్లో ఉందని చంద్రబాబు చెబుతూనే.. బ్రహ్మాండంగా స్థూల ఉత్పత్తి ఉందనడం ఎంతవరకు సమంజసమన్నారు. ‘‘రాష్ట్ర రెవెన్యూ లోటు 2014–15లో రూ.24 వేల కోట్లని, 2015–16లో రూ.7,300 కోట్లని, 2016–17కు రూ.20,250 కోట్లు అని చెప్పారు.

2017–18 సవరించిన రెవెన్యూ లోటు అంచనా రూ.4,018 కోట్లు అని ప్రభుత్వం తెలిపింది. 2018–19కి ఒక్కసారే రెవెన్యూ ఆధిక్యత రూ.5,235 కోట్లు అని చెప్పారు. అసలీ ఆధిక్యత ఎక్కడ్నుంచీ వచ్చింది?’’ అని ఆయన నిలదీశారు. నీటిపారుదల రంగంపై రూ.14,229 కోట్లు పెట్టారని, పోలవరం ప్రాజెక్టుకు మాత్రమే రూ.9 వేల కోట్లు కేటాయిస్తున్నట్టు ప్రచారం చేస్తున్నారని బుగ్గన చెప్పారు.

పోలవరం నిర్మించాల్సిన బాధ్యత కేంద్రానిదే అయినప్పుడు, దాన్ని చేతుల్లోకి తీసుకుని రాష్ట్రాన్ని ఇబ్బందుల్లో పెట్టడం న్యాయమేనా? అని ప్రశ్నించారు. రాజధాని నగర నిర్మాణానికి రూ.7,741 కోట్లు కేటాయింపు అన్నారని, మూడు పంటలు పండే భూముల్ని తీసుకున్నారు తప్ప..అక్కడ చేసిందేమీ లేదని తప్పుపట్టారు.

పెరిగిన అప్పులు: రాష్ట్ర అప్పులు విపరీతంగా పెంచుతున్నారని, రూ.2 లక్షల కోట్లకుపైగా ఇప్పటికే అప్పులు చేశారని, వడ్డీభారం రూ.15 వేల కోట్లకు చేరిందని ఆయన అంటూ.. ఇలాంటి పరిస్థితుల్లో ఆడంబరాలు అవసరమా? అని ప్రశ్నించారు. రైతు రుణమాఫీ హామీని చంద్రబాబు విస్మరించారన్నారు. లెక్కప్రకారం రూ.82 వేల కోట్లు మాఫీ చేయాల్సి ఉండగా, చంద్రబాబు రూ.24 వేల కోట్లకు కుదించారన్నారు. అందులోనూ రూ.17 వేల కోట్లు మాత్రమే ఇంతవరకు పూర్తి చేశారన్నారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement