ఏపీ గవర్నర్‌ను కలిసిన యార్లగడ్డ

18 Oct, 2019 20:35 IST|Sakshi

సాక్షి, విజయవాడ : గవర్నర్ బిశ్వభూషన్ హరిచందన్‌తో ఆంధ్రప్రదేశ్  హిందీ అకాడమీ, అధికార భాషా సంఘం అధ్యక్షులు అచార్య యార్లగడ్డ లక్ష్మి ప్రసాద్ మర్యాద పూర్వకంగా భేటీ అయ్యారు. శుక్రవారం రాజ్ భవన్‌లో గవర్నర్‌తో సమావేశమైన యార్లగడ్డ తాను రచించి, అనువదించిన సాహితీ సంపుటాలను గవర్నర్‌కు బహుకరించారు. తెలుగు సాహిత్య ప్రక్రియలను హిందీ భాషలోకి అనువదించటం ద్వారా, ఉత్తర భారత దేశానికి దక్షిణాదికి మధ్య సాహిత్య వారధిగా పనిచేస్తున్న క్రమాన్ని యార్లగడ్డ గవర్నర్‌కు వివరించారు. నాటి నన్నయ మొదలు నేటి నారాయణ రెడ్డి (సినారే) వరకు పలువురు ప్రముఖ కవులు రచించిన కావ్యాలతో రూపొందించిన తాళపత్ర గ్రంధ పేటికను యార్లగడ్డ గవర్నర్ కు అందించారు. గవర్నర్ దానిని ఆసక్తిగా పరిశీలించి అలనాటి నుండి నేటి తరం వరకు సాహిత్య సంపదను కాపాడుతూ వస్తున్న కవుల గొప్పతనాన్ని జ్ఞాపకం చేసుకున్నారు. 

ఈ నేపథ్యంలో ఒరిస్సా రాష్ట్రంలోని పలువురు సాహితీ వేత్తలను వీరు గుర్తు చేసుకున్నారు. భారత ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడుతో తనకున్న సాన్నిహిత్యాన్ని తెలిపిన  లక్ష్మి ప్రసాద్ జై ఆంధ్రా ఉద్యమంలో వెంకయ్య నాయుడితో కలిసి జైలు జీవితం గడిపానని వివరించారు. అనంతరం బిశ్వ భూషన్ సైతం గత స్మృతులను మననం చేసుకుంటూ, జైలు జీవితం ఎన్నో పాఠాలను నేర్పుతుందని అన్నారు. అయా ప్రాంతాల భాషా సంస్కృతులను పరిరక్షించుకోవాలని అదే క్రమంలో జాతీయతను మరువకూడదని గవర్నర్ పేర్కొన్నారు. సమావేశంలో గవర్నర్ వారి కార్యదర్శి ముఖేష్ కుమార్ మీనా, రాజ్ భవన్ సంయిక్త కార్యదర్శి అర్జున రావు తదితరులు పాల్గొన్నారు.

అదే విధంగా మాజీ ఐఎఎస్ అధికారి డాక్టర్ డి. శ్రీనివాసులు గవర్నర్ బిశ్వభూషన్ హరిచందన్‌ను రాజ్ భవన్‌లో శుక్రవారం కలిశారు. మర్యాద పూర్వకంగా జరిగిన ఈ భేటీలో శ్రీనివాసులు తాను రచించిన 'ఇప్పచెట్టు నీడలో' పుస్తకం యొక్క ఆంగ్ల భాషా కాపీని గవర్నర్‌కు సమర్పించారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలలో..ప్రత్యేకించి గిరిజన ప్రాంతాలలో ఐఎఎస్ అధికారిగా సేవలు అందించిప్పుడు ఎదురైన అనుభవాలు, జ్ఞాపకాలను గవర్నర్ దృష్టికి తీసుకువచ్చారు. 'ఇప్పచెట్టు నీడలో' పుస్తకాన్ని మధ్యప్రదేశ్ ప్రభుత్వం పాఠ్యపుస్తకంగా ఎంపిక చేసినట్లు శ్రీనివాసులు గవర్నర్‌కు వివరించారు.

మరిన్ని వార్తలు