‘గాడ్సేకు కూడా భారతరత్న ఇస్తారా’

18 Oct, 2019 20:48 IST|Sakshi

న్యూఢిల్లీ : వీరసావర్కర్‌కు భారతరత్న కోసం ప్రయత్నిస్తామన్న బీజేపీ వ్యాఖ్యలపై ఏఐఎంఐఎం అధ్యక్షుడు, ఎంపీ అసదుద్దీన్‌ ఓవైసీ అభ్యంతరం వ్యక్తం చేశారు. హిందుత్వం కోసం పనిచేసిన వీరసావర్కర్‌కు భారతరత్న ఇవ్వదల్చుకున్నప్పుడు నాథూరాం గాడ్సేకు కూడా భారతరత్న ఇవ్వొచ్చుగా అని ఎద్దేవా చేశారు. ‘రెండు జాతుల సిద్ధాంతాన్ని తొలుత సావర్కర్‌ పరిచయం చేశారు. అనంతరం మహ్మద్‌ అలీ జిన్నా అనుసరించారు. ఎవరికైనా భారతరత్న ఇవ్వాలని మీరనుకుంటే గాడ్సేకు కూడా ఇవ్వండి. బీజేపీ హిందుత్వ సిద్ధాంతాలను సావర్కర్‌ రాశారు. సిద్ధాంతాల ప్రాతిపదికన అవార్డులు ఇవ్వడం సరికాదు. అయినా, మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో ప్రధాని మోదీ, సీఎం ఫడ్నవీస్‌ పదేపదే 370 ఆర్టికల్‌ రద్దు అంశాన్ని ఎందుకు తెస్తున్నట్టు’అని ఓవైసీ ప్రశ్నించారు. 
(చదవండి : వీర్‌ సావర్కర్‌కు భారతరత్న!)

మహారాష్ట్ర ప్రజలకిచ్చిన హామీల అమలును విస్మరించిన ప్రభుత్వం, వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికే హిందుత్వ రాజకీయాలకు పాల్పడుతోందని ఓవైసీ విమర్శించారు. దేశవ్యాప్తంగా వేలాదిమంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. ఆ మొత్తం మహారాష్ట్రాలోనే అధికం. ఇవేవీ పట్టించుకోకుండా అవార్డు రాజకీయాలు చేస్తున్నారని విమర్శలు గుప్పించారు. వీటి బదులు రైతుల బాగుకోసం మహారాష్ట్ర బీజేపీ ప్రభుత్వం స్పష్టమైన ప్రకటన చేయొచ్చుకదా అని చురకలంటించారు. దేశవ్యాప్తంగా కోటి ఉద్యోగాలు కల్పిస్తామన్న ప్రధాని మోదీ హామీలేమయ్యాయని ఓవైసీ ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఫ్రీట్రేడ్‌ విధానం వల్ల ఎనిమిది కోట్ల మంది నిరుద్యోగులుగా మారారని ఆవేదన వ్యక్తం చేశారు.

Read latest Politics News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు