ఏటా రూ. 30 కోట్ల ఐఏపీ నిధులు

27 Feb, 2014 02:37 IST|Sakshi
రాజవొమ్మంగి, న్యూస్‌లైన్ : ఏజెన్సీ అభివృద్ధికి  ఇంటిగ్రేటెడ్ యాక్షన్ ప్లాన్/ స్పెషల్ సెంట్రల్ అసిస్టెన్స్ (ఐఏపీ) క్రింద తూర్పుగోదావరి జిల్లాకు రెండేళ్లుగా ఏడాదికి రూ. 30 కోట్ల చొప్పున కేంద్ర ప్రభుత్వం నిధులు కేటాయిస్తున్నట్టు కేంద్ర గిరిజన వ్యవహారాలు, పంచాయతీ రాజ్ శాఖ  మంత్రి కిశోర్ చంద్రదేవ్ తెలిపారు. రహదారుల అభివృద్ధి, తాగునీరు, భవనాల నిర్మాణానికి మరో ఏడాది కూడా మరో రూ. 30 కోట్ల నిధులు విడుదలయ్యే అవకాశం వుందన్నారు.
 
 కేంద్రమంత్రి కిశోర్‌చంద్రదేవ్ బుధవారం రాజవొమ్మంగి మండలంలో పలు అభివృద్ధి పథకాల శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాల్లో పాల్గొన్నారు. జడ్డంగి జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణ లో సర్పంచ్ కొంగర మురళీ కృష్ణ అధ్యక్షతన ఇందిరాక్రాంతి పథం, ఉపాధిహామీ పథకాలపై సమీక్షాసమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన గిరిజన మహిళలను ఉద్దేశించి మాట్లాడుతూ ఐఏపీ నిధుల కేటాయింపులో అరకు పార్లమెంటు నియోజకవర్గానికి పూర్తి న్యాయం జరిగేలా కృషిచేశానన్నారు. జడ్డంగి నుంచి దోనెలపాలెం తదితర 10 గ్రామాలకు వెళ్లే రహదారిపై గల మడేరు వాగుపై రూ. 2.5 కోట్ల ఐఏపీ నిధులతో నిర్మించనున్న వంతెనకు, 36 గ్రామాలకు తాగునీరు అందించేందుకు రూ. 3.4 కోట్ల తో ఏర్పాటుకానున్న ఆవాస రక్షిత మంచినీటి సరఫరా పథకానికి శంకుస్థాపన చేశారు.
 
 అక్కడే మండలప్రజాపరిషత్ ప్రాథమిక పాఠశాలలో సర్వశిక్షా అభియాన్ నిధులు రూ. 5.3 లక్షలతో నిర్మించిన అదనపు తరగతి గదుల భవనాన్ని ప్రారంభించారు. రాజవొమ్మంగి ఆశ్రమోన్నతపాఠశాల ఆవరణలో రూ. 95 లక్షల నాబార్డు నిధులతో  నిర్మించనున్న అదనపు వసతి గృహానికి భూమి పూజచేశారు.  సూరంపాలెంలో రూ. 15 లక్షలతో రూపుదిద్దుకొన్న రక్షిత మంచినీటి పథకాన్ని ప్రారంభించారు. అక్కడ నుంచి నేరుగా విశాఖపట్నం వైపు వెళ్లారు. ఎమ్మెల్యే కోసూరి కాశీవిశ్వనాథ్, రాజవొమ్మంగి సర్పంచ్ చీడిపల్లి సుభద్రమ్మ, కలెక్టర్ నీతూ ప్రసాద్, ఐటీడీఏ పీఓ గంధం చంద్రుడు, ఆర్‌డీఓ శివశంకర ప్రసాద్, స్థానిక ఎంపీడీఓ సత్యనారాయణ, తహశీల్దార్ రవీంద్రకుమార్, డీఈఈలు వేంకటేశ్వరరావు, జగన్నాథరావు, ఏఎస్పీ విజయరావు తదితరులు పాల్గొన్నారు.
 
>
మరిన్ని వార్తలు