నీటి ప్రవాహంలో యువకుని గల్లంతు

14 Aug, 2013 04:53 IST|Sakshi

ఖమ్మం, న్యూస్‌లైన్ : ప్రత్యేక రాష్ట్రం కోసం ఆ యువకుడు ఎన్నో కలలు కన్నాడు... ఎట్టకేలకు తెలంగాణ ఏర్పాటుకు గ్రీన్‌సిగ్నల్ రావడంతో నలుగురితో ఆనందాన్ని పంచుకున్నాడు...ఇంతలోనే సీమాంధ్రలో జరుగుతున్న ఆందోళనలు అతనిని కలవరపరిచాయి....మళ్లీ తెలంగాణ ఎక్కడ ఆగిపోతుందోనని తీవ్రంగా మధనపడ్డాడు...ఈమనస్తాపంతోనే సాగర్‌కాల్వలో దూకి గల్లంతయ్యాడు. ఖమ్మం నగర పరిధిలోని టేకులపల్లిలో  తెలంగాణ రాదేమోనని....కాల్వలో దూకాడు
 
 మంగళవారం జరిగిన ఈసంఘటనతో ఆప్రాంతవాసులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. యువకుని కుటుంబసభ్యుల కథనం ప్రకారం...
 
   బయ్యారం మండల కేంద్రానికి చెందిన వెంపటి రామకృష్ణ(25) తల్లిదండ్రులతో సహా  కొద్ది నెలల క్రితం ఖమ్మం నగరానికి వచ్చి టేకులపల్లి లక్ష్మినగర్‌లో నివాసం ఉంటున్నాడు. ఓప్రైవేట్ ఉద్యోగం చేసుకుంటూ తలిదండ్రులను పోషిస్తున్నాడు. ప్రత్యేక రాష్ట్రం కోసం ఎక్కడ ఏ కార్యక్రమం జరిగినా వెళ్లేవాడని అతని మిత్రులు చెబుతున్నారు.  గత నెల 31న యూపీఏ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించడంతో సంతోషపడి అందరికి తెలంగాణ వస్తుందని చెప్పాడని స్థానికులు అంటున్నారు. అయితే గత పదిరోజులుగా తెలంగాణకు వ్యతిరేకంగా సీమాంధ్రలో జరుగుతున్న ఉద్యమం అతనిని మనోవేదనకు గురిచేసింది.  టీవీ ముందు కూర్చొని  మళ్లీ ఏం మార్పు జరుగుతుందోనని, తెలంగాణ పోతుందేమోనని నిత్యం బాధపడేవాడని తల్లి తిరుపతమ్మ, తండ్రి భాస్కర్ చెప్పారు.
 
 మంగళవారం కూడా టీవీలో సీమాంధ్ర ఉద్యమం గురించిన వార్తలు విని తెలంగాణ రాష్ట్రం మళ్ళీ వెనక్కి పోతుందని బాధపడుతూ బయటకు వచ్చాడు. ఇంటి సమీపంలో ఉన్న సాగర్ కాల్వ బ్రిడ్జి ఎక్కి సీమాంధ్రా నాయకులు మళ్లీ తెలంగాణ రాకుండా చేస్తున్నారని, జై తెలంగాణ అంటూ కాల్వలో దూకాడని స్థానికులు చెబుతున్నారు.  ప్రవాహం ఎక్కువగా ఉండడంతో రామకృష్ణ నీటిలో గల్లంతు కాగా, కుటుంబసభ్యులు గాలింపు చర్యలు చేపట్టారు. తెలంగాణకోసమే తన బిడ్డ కాల్వలో దూకి చనిపోవాలనుకున్నాడని తల్లిదండ్రులు విలపిస్తూ చెప్పారు. మంగళవారం రాత్రి వరకూ కూడా రామకృష్ణ ఆచూకీ లభ్యం కాలేదు.  
 

మరిన్ని వార్తలు