రమ్మీ మాయలో యువత చిత్తు

13 Jun, 2018 07:35 IST|Sakshi

ఆన్‌లైన్‌ జూదంతో జేబులు ఖాళీ

వ్యసనంగా మారుతున్న వైనం

చట్టబద్ధత, పోలీసుల నియంత్రణ కరువు

ఇటీవల తణుకు పట్టణానికి చెందిన కిరణ్‌ అనే యువకుడు ఆన్‌లైన్‌ పేకాటకు అలవాటు పడి పెద్దమొత్తంలో సొమ్ములు పోగొట్టుకున్నాడు. తన సెల్‌ఫోన్‌లో ఉండే ఆల్‌లైన్‌ గేమ్‌లకు అలవాటుపడిన అతను రమ్మీ పేరుతో పేకాటకు ఆకర్షితుడయ్యాడు. ప్రారంభంలో తనఖాతాకు డబ్బులు రావడంతో అత్యాశకుపోయి అదే వ్యాపకంతో ఆడటంతో స్వల్పకాలంలోనే రూ.60 వేలు పోగొట్టుకున్నాడు.

భీమవరం పట్టణానికి చెందిన మరో వ్యక్తి ఉద్యోగ రీత్యా ప్రతిరోజు తణుకు వస్తుంటాడు. మార్గం మధ్యలో కాలక్షేపం కోసం ఆన్‌లైన్‌లో రమ్మీ ఆడటం అలవాటు చేసుకున్నాడు. గతంలో కొంత మేర సొమ్ములు పోగొట్టుకున్నా వాటిని ఎలాగైనా తిరిగి సంపాదించాలని మరోసారి ఆడటం ప్రారంభించాడు. నెల రోజుల వ్యవధిలోనే రూ. 40 వేలు పోగొట్టుకున్నాడు. ఇలా ఎంతోమంది యువత ఆన్‌లైన్‌ జూదం బారినపడి తమ జేబులకు చిల్లు పెట్టుకుంటున్నారు.

తణుకు: ఇంటర్నెట్‌ కేంద్రాలు.. ఇంట్లోనే కంప్యూటర్లు.. అరచేతుల్లో సెల్‌ఫోన్లు.. ప్రయాణాల్లో ల్యాప్‌టాప్‌లు.. ఇలా అందుబాటులో ఉన్న ఇంటర్నెట్‌ సాధనాలను ఉపయోగించుకుని జేబులు ఖాళీ చేసుకునే వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. మెయిల్, ఫేస్‌బుక్, యూట్యూబ్, పలు వెబ్‌సైట్లలోకి వెళ్లినవారికి దర్శనమిచ్చే ప్రకటనలు అన్ని వర్గాలను ప్రలోభాలకు గురిచేస్తున్నాయి. వ్యాపకంగా మొదలయ్యే ఆన్‌లైన్‌ గేమ్‌ల మాయలో పడుతున్న యువత చిత్తవుతున్నారు. వస్తే రూ.వందలు.. పోతే రూ.వేలు అన్న చందంగా తయారైంది. ఇటీవలి కాలంలో ప్రధానంగా రమ్మీ ఆట యువతను ఆకట్టుకుంటోంది. సరదాగా ఆడుతూ జేబులు ఖాళీ చేసుకుంటూ అనేక మంది మౌనంగా లబోదిబోమంటున్నారు. చేతులారా చేసుకుంటున్న తప్పిదం కావడంతో బయటకు చెప్పుకోలేక అంతర్గతంగా మదనపడుతున్నారు.

కాలక్షేపం పేరుతో..
సమాజంలో ఇతర నేరాలకు జవాబుదారీతనం వహించే శాఖలు, విభాగాలు, యంత్రాంగాలు తరహాలో ఇంటర్నెట్‌ మోసాలను నియంత్రించే వ్యవస్థ లేకపోవడంతో నేరాలు పెరుగుతున్నాయి. ప్రధానంగా పెద్ద చేపలను పట్టడానికి చిన్న ఎరవేసిన చందంగా ఆన్‌లైన్‌ రమ్మీ, పేకాట మొదలుపెట్టిన ఆరంభంలో సులభంగా రూ.వందల్లో సంపాదన చూసినవారు ఆ తరువాత రూ.వేలల్లో జేబులు ఖాళీ అవుతున్నా మానుకోలేని దుస్థితి ఎదురవుతోంది. కాలక్షేపం పేరుతో కొందరు.. అలవాటు మానుకోలేక మరికొందరు.. ఇలా ఇంటర్నెట్‌ జూదం మాయాజాలంలో కూరుకుపోతున్నారు. ఇలాంటి బాధితుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతున్నప్పటికీ మానుకోలేక తలలు పట్టుకుంటున్నారు. సామాన్యుల్లో ఉండే ఆశను ఆసరాగా చేసుకుని వల విసిరే ఈ ఆన్‌లైన్‌ రమ్మీ తరహా మోసాలపై ఎవరికి ఫిర్యాదు చేయాలో తెలియని పరిస్థితి ఉంది.

అవగాహన ఏదీ..?
జిల్లాలో ఇటీవల ఇంటర్నెట్‌ వినియోగదారుల సంఖ్య పెరిగింది. టెలికాం సంస్థలు పోటీపడి మరీ ఇంటర్నెట్‌ను తక్కువ ధరకే అందిస్తుండటంతో వినియోగదారులు పెరిగారు. జిల్లాలో సుమారు 10 లక్షల మంది ఇంటర్నెట్‌ వినియోగదారులు ఉన్నట్లు అంచనా. ఇంటర్నెట్‌లో జరిగే అనేక మోసాల తరహాలోనే సాగుతున్న ఈ ఆన్‌లైన్‌ జూదానికి ఎలాంటి చట్టబద్ధత లేకపోయినా యథేచ్ఛగా దాని హవా మాత్రం సాగుతోంది. లెక్కకు మించిన వెబ్‌సైట్లు పేరుతో పుట్టుకొచ్చే ఆన్‌లైన్‌ రమ్మీ ఆకర్షణలు దర్జాగా జేబులు ఖాళీ చేస్తున్నాయి. సొమ్ములు పోగొట్టుకుంటున్నవారు దాన్ని మోసంకాక తమ దురదృష్టంగా భావించడం ఒక కారణమైతే... తమ అత్యాశే ఈ నష్టానికి మూలం కావడం ఈ ఆన్‌లైన్‌పేకాట జోరుకు మరో కారణంగా ఉంది. అత్యాసతో పాటు ఆన్‌లైన్‌ నిబంధనలపై ప్రజలకు అవగాహన లేకపోవడం కూడా ఈ సొమ్ములు గుల్ల చేస్తున్నాయి. ఆన్‌లైన్‌ ద్వారా తమ బ్యాంకు ఖాతాలను అనుసంధానం చేసే ప్రక్రియలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు దాదాపు అధిక సంఖ్యలో ఇంటర్నెట్‌ వినియోగదారులకు తెలియకపోవడంతో నష్టపోతే ఏం చేయాలో తెలియని అయోమయం నెలకొంది.

చట్టబద్ధత లేదు
ఆన్‌లైన్‌లో డబ్బుకు ఆశపడి ఆడే పేకాటకు చట్టబద్ధత లేకపోవడంతోపాటు ఎలాంటి అనుమతులు లేవు. ఇలా ఆన్‌లైన్‌లో పేకాట ఆడటం చట్టరీత్యా నేరం. అత్యాశతో ఆన్‌లైన్‌ రమ్మీ ఆడి సొమ్ములు పోగొట్టుకోకుండా జాగ్రత్త వహించాలి. ఇలాంటి చెడు వ్యసనాలపై యువత మక్కువ పెంచుకోకుండా ఉండాలి. – కేఏ స్వామి, సర్కిల్‌ ఇన్‌స్పెక్టర్, తణుకు

మరిన్ని వార్తలు