‘అన్న’మాట నిలబెట్టుకున్నారు

21 Sep, 2019 08:49 IST|Sakshi

ఇక బాక్సైట్‌ భూతం మాయం !

మన్యంలో బాక్సైట్‌ మైనింగ్‌ లీజును రద్దు చేస్తూ ముఖ్యమంత్రి సంతకం

 వైఎస్‌ జగన్‌ నిర్ణయంపై గిరిజనుల హర్షం

గత టీడీపీ సర్కారు జారీ చేసిన జీవో నంబరు 97 రద్దు

సర్కారుకు ఆదాయం కంటే ప్రజల సంక్షేమమే మిన్న

3,030 ఎకరాల్లో మైనింగ్‌ కార్యకలాపాలు నిలిపివేత

జీవో నంబరు 97... విశాఖపట్నం మన్యంలోని కొండల్లో బాక్సైట్‌ తవ్వకాలకు సంబంధించి ఏపీ ఖనిజాభివృద్ధి సంస్థ (ఏపీఎండీసీ)కి ఇస్తూ గత టీడీపీ ప్రభుత్వం 2015, నవంబరులో ఇచ్చిన ఉత్తర్వులు ఇవి! ప్రతిపక్షంలో ఉన్నప్పుడు బాక్సైట్‌పై యుద్ధం చేస్తానంటూ గిరిజనులను నమ్మించిన చంద్రబాబు 2014 సంవత్సంలో అధికారంలోకి రాగానే ఆ మాట మరచిపోయారు! అందుకే గిరిజనులంతా పెద్ద ఎత్తున ఉద్యమం చేశారు! 

గిరిజనుల సెంటిమెంటుకు గౌరవం.. ఇదీ జనం మనసు ఎరిగిన ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మాట! ‘సర్కారుకు ఆదాయం ఒక్కటే ముఖ్యం కాదు.. గిరిజనుల సెంటిమెంటునూ గౌరవించాల్సిందే’నని విస్పష్టంగా చెప్పిన జన నాయకుడని ఇప్పుడు గిరిజనులు హర్షం వ్యక్తం చేస్తున్నారు!

ఇదీ ఇద్దరు నాయకుల మధ్య తేడా! దశాబ్దాలుగా పలు ఉద్యమాలతో కీలక మలుపులు తిరిగిన బాక్సైట్‌ మైనింగ్‌ వ్యతిరేక ఉద్యమం నేపథ్యంలో వైఎస్సార్‌సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. గిరిజనుల మనసుల్లో గూడుకట్టుకున్న భయాందోళనలకు ముగింపు పలికారు. 3,030 ఎకరాల్లో మైనింగ్‌ కార్యకలాపాలను నిలిపేయాలని నిర్ణయం తీసుకున్నారు. 

సాక్షి, విశాఖపట్నం/పాడేరు:  విశాఖపట్నం, తూర్పుగోదావరి జిల్లాల్లోని రిజర్వు ఫారెస్టు ప్రాంతంలోనున్న అపారమైన బాక్సైట్‌ ఖనిజ సంపదపై కొన్ని దశాబ్దాల క్రితమే బడాబాబులు కన్నేశారు. ఖనిజం కోసం కొండలను తవ్వేస్తే తమ జీవనానికి, సాంస్కృతిక వారసత్వానికే కాదు అటవీ, పర్యావరణానికి విఘాతం కలుగుతుందనే భయాందోళనలతో దాదాపు 50 ఏళ్లుగా గిరిజనులు పోరాటం చేస్తూ వచ్చారు. వారి పక్షాన వైఎస్సార్‌సీపీ అధినేతగా వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నిలిచారు. రాష్ట్ర ప్రతిపక్ష నేత హోదాలో మూడేళ్ల క్రితం చింతపల్లిలో బాక్సైట్‌కు వ్యతిరేకంగా గిరిజనులతో కలిసి భారీ సదస్సు నిర్వహించారు. చంద్రబాబు ప్రభుత్వం జారీ చేసిన జీవో నంబర్‌ 97ను రద్దు చేయాలని డిమాండు చేశారు.

దీంతో చంద్రబాబు ప్రభుత్వం బాక్సైట్‌ తవ్వకాలకు వెనుకంజ వేసినప్పటికీ జీవో 97ను మాత్రం రద్దు చేయలేదు. జీవో నంబరు 97ను రద్దు చేయాలనే డిమాండుతో గిరిజనులు ప్రారంభించిన పోరాటానికి జగన్‌మోహన్‌రెడ్డి సంపూర్ణ మద్దతు ప్రకటించారు. ఏజెన్సీలోని వైఎస్సార్‌సీపీ నాయకులు కూడా బాక్సైట్‌ వ్యతిరేక పోరాటంలో చురుకైన పాత్ర వహించారు. పార్టీ అధికారంలోకి రాగానే బాక్సైట్‌ తవ్వకాల జీవోను పూర్తిగా రద్దు చేసి గిరిజనులకు మేలు చేస్తామని జగన్‌ తన ప్రజాసంకల్పయాత్ర సందర్భంలోనూ పునరుద్ఘాటించారు. తర్వాత ఎన్నికల ప్రచారంలో భాగంగా మార్చి నెలలో పాడేరులో నిర్వహించిన బహిరంగ సభలోనూ గిరిజనులకు అభయమిచ్చారు. అలా ఇచ్చిన మాటను అధికారంలోకి వచ్చిన వెంటనే నిలబెట్టుకున్నారు. గిరిజనుల పక్షాన తాను ఉన్నానని నిరూపించారు. బాక్సైట్‌ తవ్వకాలకు వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం వ్యతిరేకమని, గత ప్రభుత్వాలు జారీ చేసిన బాక్సైట్‌ అనుకూల జీవోలన్నీ రద్దు చేస్తున్నామని సీఎం జగన్‌మోహన్‌రెడ్డి తాజాగా ప్రకటించడంతో విశాఖ ఏజెన్సీలోని అన్ని వర్గాల గిరిజనులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. తమ మనుగడను కాపాడిన ముఖ్యమంత్రి అంటూ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నారు.

బాక్సైట్‌ కొండలిక సురక్షితం... 
అరకులోయ మండలంలోని గాలికొండ, రక్తికొండ, చిత్తంగొంది, చింతపల్లి ప్రాంతంలోని జర్రెల, సప్పర్లతో పాటు తూర్పుగోదావరి జిల్లాలోని గుర్తేడు అటవీ ప్రాంతంలో కలిపి దాదాపు 75 కోట్ల టన్నుల బాక్సైట్‌ ఖనిజ నిక్షేపాలు ఉన్నాయని అంచనా. ఈ రెండు జిల్లాల పరిధిలోని అటవీ ప్రాంతాల్లో 27 కొండల్లో ఈ బాక్సైట్‌ నిక్షిప్తమై ఉందని గుర్తించారు. అయితే ఈ కొండలలో బాక్సైట్‌ తవ్వకాలు జరిపితే 270 గ్రామాలకు చెందిన గిరిజనులు పూర్తిగా నిర్వాసితులవుతారని, వ్యవసాయ భూములు, అటవీ సంపద అంతా నాశనమవుతాయని, భూగర్భ జలాలు అడుగంటిపోవడంతో ఏజెన్సీ ప్రజల మనుగడమే ముప్పు పొంచి ఉదని పర్యావరణవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తూ వచ్చారు. అలాగే మైదాన ప్రాంతాల్లోని సాగునీటి ప్రాజెక్టులపైనా తీవ్ర ప్రభావం చూపుతుందని హెచ్చరికలు చేశారు. దీంతో అప్రమత్తమైన గిరిజనులు దశాబ్దాల క్రితమే ఆందోళనలు ప్రారంభించారు.

 పంచపట్మాలి ప్రత్యక్ష నిదర్శనం..
విశాఖ మన్యానికి సమీపంలోనే ఉన్న ఒడిశా రాష్ట్రంలోని కోరాపుట్‌ జిల్లాలోనున్న పంచపట్మాలి కొండల్లో జరుగుతున్న దాష్టీకం గిరిజనుల్లో ఆందోళనలను మరింత పెంచింది. దమన్‌జోడి వద్ద ఏర్పాటు చేసిన అల్యూమినా రిఫైనరీ కోసం 1985 సంవత్సరం నుంచి అక్కడ బాక్సైట్‌ తవ్వకాలు మొదలుపెట్టారు. కేవలం 48 లక్షల టన్నుల బాక్సైట్‌ ఖనిజం తవ్వకం వల్లే సమీప గ్రామాల గిరిజనులంతా నిర్వాసితులయ్యారు. అటవీ సంపద కనుమరుగైంది. జలవనరులు కలుషితమయ్యాయి. వేలాది ఎకరాల వ్యవసాయ భూములన్నీ నాశనమయ్యాయి. వాటిపై గిరిజనులంతా మనుగడను కోల్పోయారు. ఈ పరిస్థితిని చూసిన పర్యావరణవేత్తలంతా విశాఖ, తూర్పుగోదావరి జిల్లాల్లో 75 కోట్ల టన్నుల బాక్సైట్‌ కోసం చేపట్టిన మైనింగ్‌ కార్యకలాపాలపై ఆందోళన వ్యక్తం చేశారు. 270 గ్రామాలకు చెందిన గిరిజనుల మనుగడనే ప్రశ్నార్థం చేస్తున్న జీవో నంబరు 97ను ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి రద్దు చేయడంపై సర్వత్రా హర్షధ్వానాలు వ్యక్తమవుతున్నాయి. గిరిజన మేధావులు, నాయకులు అభినందనలు తెలుపుతున్నారు. 

బాక్సైట్‌ జీవో 97 రద్దు చారిత్రాత్మకం..
గిరిజనుల పక్షపాతిగా పేరొం దిన సీఎం జగన్‌మోహన్‌రెడ్డి తీసుకున్న   బాక్సైట్‌ అనుకూల జీవో నంబరు 97ను రద్దు నిర్ణయం చారిత్రాత్మకం. గత చంద్రబాబు ప్రభుత్వం బాక్సైట్‌ను తవ్వి గిరిజనులను నాశనం చేసే చర్యల్లో భాగంగానే ఈ జీవోను జారీ చేసింది. ఆ సమయంలో గిరిజనుల పక్షాన జగన్‌మోహన్‌రెడ్డి నిలబడ్డారు. బాక్సైట్‌కు వ్యతిరేకంగా పోరాటం చేశారు. పాదయాత్రలో ఈ బాక్సైట్‌ జీవోను రద్దు చేస్తామని హామీ ఇచ్చారు. అధికారంలోకి రాగానే జీవో 97ను రద్దు చేసేందుకు నిర్ణయించడం సంతోషంగా ఉంది.
– కొట్టగుళ్లి భాగ్యలక్ష్మి, ఎమ్మెల్యే, పాడేరు

గిరిజనుల మనుగడకు భద్రత..
రాష్ట్ర ఖజానాకు వచ్చే రూ. వేల కోట్ల ఆదాయం కన్నా గిరిజనుల ప్రయోజనాలకే ప్రాధాన్యత ఇచ్చారు. బాక్సై ట్‌ జీవో 97ను రద్దు చేసి ముఖ్యమంత్రి జగన్‌ గిరిజను ల హృదయాల్లో చెరగని ముద్ర వేసుకున్నారు. గిరిజనుల పక్షపాతిగా దేశ చరిత్రలో నిలిచారు.
– చెట్టి ఫాల్గుణ, ఎమ్మెల్యే, అరకు 

గిరిజనులకు పండుగ రోజు..
బాక్సైట్‌ తవ్వకాలకు అనుమతి ఇస్తూ గత చంద్రబాబు ప్రభుత్వం జీవో నంబరు 97ను జారీ చేసినప్పుడు మే మంతా పోరాటానికి దిగాం. మా గిరిజనులకు అండగా వైఎస్సార్‌సీపీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డి నాడు అండగా నిలబడ్డారు. మాలో మనోధైర్యాన్ని నింపారు. చింతపల్లిలో గిరిజనులతో సదస్సు నిర్వహించారు. ఇప్పుడు వైఎస్సార్‌సీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే గత చంద్రబాబు ప్రభుత్వం జారీ చేసిన జీవో 97ను రద్దు చేసేందుకు నిర్ణయించారు. ఇది బాక్సైట్‌ ప్రభావిత జర్రెల, గాలికొండ ప్రాంతాల గిరిజనులకు పండుగ రోజు. 
– అడపా విజయకుమారి,జర్రెల మాజీ సర్పంచ్, జీకే వీధి మండలం

బాక్సైట్‌ జీవో రద్దును స్వాగతిస్తున్నాం..
వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం బాక్సైట్‌ జీవో 97 రద్దుకు నిర్ణయించడాన్ని స్వాగతిస్తున్నాం. బాక్సైట్‌కు వ్యతిరేకంగా గిరిజనులు దశాబ్దాల నుంచి ఉద్యమాలు చేస్తున్నారు. చంద్రబాబు ప్రభుత్వం బాక్సైట్‌ దోపిడీకి పూనుకోవడం దుర్మార్గ చర్యగా గిరిజన సంఘం అప్పట్లో ఖండించింది. ఉద్యమం చేసింది. సీఎం జగన్‌మోహన్‌రెడ్డి బాక్సైట్‌ జీవో రద్దుకు నిర్ణయం తీసుకోవడం గిరిజనులకు ఎంతో మేలు చేస్తుంది. 
– పి.బాలదేవ్, గిరిజన సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు, అరకులోయ

ఈ నిర్ణయం చరిత్రలో నిలిచిపోతుంది..
గిరిజనులంతా బాక్సైట్‌ను వ్యతిరేకించి ఉద్యమాలు చేస్తుంటే, గత చంద్రబాబు ప్రభుత్వం గిరిజనులను నాశనం చేసే చర్యలకు పాల్పడింది. జీవో నంబర్‌ 97ను జారీ చేసి గిరిజనులకు అన్యాయం చేయాలని చూసింది. బాక్సైట్‌ ఖనిజ సంపద దోపిడీ చేసి విదేశీ సంస్థలకు ధారాదత్తం చేసేందుకు కుట్రపూరితంగా చంద్రబాబు ప్రభుత్వం వ్యవహరించింది. వైఎస్సార్‌సీపీ అధికారంలోకి వచ్చిన తరువాత సీఎం జగన్‌మోహన్‌రెడ్డి గిరిజనుల ప్రయోజనాలకు అధిక ప్రాధాన్యత ఇచ్చి, జీవో 97ను రద్దు చేసేందుకు నిర్ణయించడం చరిత్రలో నిలిచిపోతుంది.                            
 – పి.రంజిత్‌కుమార్, దండకారణ్య విమోచన సమితి నేత, హుకుంపేట

గిరిజనుల రక్షకుడు జగన్‌మోహన్‌రెడ్డి..
సీఎం జగన్‌మోహన్‌రెడ్డి తన తండ్రి, మహానేత వైఎస్సార్‌ వలే మాటకు కట్టుబడి ఉండే మంచి నేతగా గిరిజనుల్లో గుర్తింపు పొందారు. అధికారంలోకి రాగానే బాక్సైట్‌ అనుకూల జీవో 97ను రద్దు చేస్తానని చింతపల్లి సదస్సులో గిరిజనులకు మాట ఇచ్చారు. ఆ రోజుల్లో గిరిజనుల పక్షాన బాక్సైట్‌ మైనింగ్‌కు వ్యతిరేకంగా చేపట్టిన ఉద్యమంను గిరిజనులు ఇప్పటికి మరువలేదు. ప్రభుత్వానికి ఆదాయం కంటే గిరిజనుల ప్రయోజనాలు, వారి సురక్షిత మనుగడే ముఖ్యమని మహోన్నత ఆశయంతో ఉన్న సీఎం జగన్‌మోహన్‌రెడ్డి బాక్సైట్‌ జీవో 97 రద్దుకు నిర్ణయించి గిరిజనులకు రక్షకుడిగా మారారు. ఆయన నిర్ణయంపై గిరిజనులు సంతోషంగా ఉన్నారు.
– చిట్టపులి శ్రీనివాసపడాల్, గిరిజన సంక్షేమ ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు, పాడేరు  

మరిన్ని వార్తలు