గిరిసీమల్లో జనబాంధవుడు

22 Nov, 2018 08:00 IST|Sakshi
వైఎస్సార్‌సీపీ అధినేత జగన్‌తో కలసి అడుగులు వేస్తున్న కురుపాం ఎమ్మెల్యే పాముల పుష్పశ్రీవాణి, అరకు పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు పరీక్షిత్‌రాజు, జిల్లాపార్టీ రాజకీయ వ్యవహారాల సమన్వయకర్త మజ్జి శ్రీనివాసరావు, అరకు పార్లమెంటరీ సమన్వయకర్త మాధవి

ఆంధ్రా–ఒడిశా సరిహద్దులో కొనసాగిన జననేత పాదయాత్ర

రాజన్న బిడ్డకు ఆత్మీయ స్వాగతం పలికిన కురుపాం ప్రజలు

దారిపొడవునా పూలబాటలు పరచి... మంగళహారతులు పట్టిన మహిళలు

అపన్నులకు భరోసా కల్పిస్తూ ముందుకు సాగిన జగన్‌

సాక్షి ప్రతినిధి, విజయనగరం: చుట్టూ కొండలు... మధ్యలో పచ్చని పంట పొలాలు.. సుందరమైన ప్రకృతి... ఆ ప్రకృతి ఒడిలో ప్రధాన మార్గాలకు దూరంగా... ఆంధ్రా– ఒడిశా సరిహద్దు ప్రాంతంలో నిశ్శబ్దంగా ఉండే ఆ పల్లెల గుండె గడపకు పండగొచ్చింది. జన హృదయం ఉప్పొగింది. జగమంత అభిమానం వెల్లువెత్తింది. చెరగని చిరునవ్వుతో తమ కష్టాలు వినేందుకు ముంగిటకు వచ్చిన రాజన్న బిడ్డను చూసి ఆనందపారవశ్యమైంది. ప్రజాకంటక పాలనకు చరమగీతం పాడేందుకు వైఎస్సార్‌సీపీ అ«ధినేత వై.ఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి చేపడుతున్న ప్రజా సంకల్పయాత్రకు అడుగడుగునా నీరాజనం లభిస్తోంది. పూలబాటలు వేసి... మహిళలు మంగళహారతులతో ఘన స్వాగతం పలికారు.

ఠీవిగా సాగుతూ...
ప్రజల సమస్యలను తెలుసుకునేందుకు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చేపడుతున్న ప్రజా సంకల్పయాత్ర బుధవారం ఆంధ్రా–ఒడిశా సరిహద్దు ప్రాంతం కురుపాం నియోజకవర్గ కేంద్రం క్రాస్‌ వద్ద ప్రారంభమై దాసరిపేట, తాళ్లడుమ్మ, చినమేరంగి, అల్లువాడ వరకూ సాగింది. అక్కడి నుంచి మధ్యాహ్న భోజనానంతరం పెదతుంబలి, చినతుంబలి, జోగులడుమ్మ మీదుగా శిఖబడి క్రాస్‌ వరకూ చేరుకుని ముగిసింది. మధ్యాహ్న భోజనా నంతరం చినమేరంగి చేరుకున్న జననేతకు అపూ ర్వ రీతిలో అభిమానులు స్వాగతం పలికారు. తమ అభిమాన నాయకుడిని చూసేందుకు ఊరువాడా కదలివచ్చారు. పెద్ద సంఖ్యలో సంఖ్యలో తరలి వచ్చిన మహిళలు మంగళహారతులు పట్టారు. పలువురు గ్రామస్థులు నోట్ల దండలతో స్వాగతం చెప్పగా ఎమ్మెల్యే పుష్పశ్రీవాణి పరీక్షిత్‌రాజు దంపతులు మన్యం వీరుడు అల్లూరి సీతా రామరాజు విగ్రహాన్ని జననేతకు బహూకరించా రు. యాదవులు గొర్రెపిల్లను బహూకరించి జననేతపై తమకున్న అభిమానాన్ని చాటుకున్నారు.

అన్నా మా  వేదనను తీర్చండి: జననేత వద్ద ఆపన్నులు బారులు తీరుతున్నారు. అన్నా... మా వేదన తీర్చండి అంటూ గోడు వెళ్లబోసుకుంటున్నారు. షాదీముబారక్‌ పథకం అమల్లో లోపాలపై ముస్లిం మహిళలు ఫిర్యాదు చేశారు. అర్హులకు ఈ పథకం అందటం లేదని, అప్పులు చేసి పెళ్ళిళ్లు చేసుకోవాల్సి వస్తోందని వాపోయారు. దాసరిపేటలో చినమేరంగి ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు పాఠశాలలోని అసౌకర్యాలను వివరించారు. చినమేరంగిలో పలువురు యువత, విద్యార్థులు బాబు వస్తే జాబు వస్తుందని నమ్మి మోసపోయామన్నారు. అల్లువాడ శివారులో పలువురు గిరిజన రైతులు మహానేత హయాంలో పక్కాగా అమలైన అటవీ హక్కుల చట్టం ఇప్పుడు పూర్తిగా నీరుగారిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. గిరిజన ప్రాంతాల్లోని 36 రకాల వ్యవసాయ ఉత్పత్తులకు మద్దతు ధర కల్పించి, పండించిన పంటను నిల్వ ఉంచుకునేందుకు కోల్డ్‌ స్టోరేజీలు ఏర్పాటు చేయాలని కోరారు. శెట్టిబలిజ కులస్తులు తమకు ప్రత్యేక కార్పొరేషన్‌ ఏర్పాటు చేసి ఆర్ధిక సహాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. అయ్యరకుల సంఘం నాయకులు బీసీ–డీలో ఉన్న తమను బీసీ–ఏలోకి మార్చినా ఎలాంటి ప్రయోజనం లేదన్నారు. తమకు కూడా ప్రత్యేక కార్పొరేషన్‌ ఏర్పాటు చేసి ఆర్థిక సాయం చేయాలన్నారు.

పాదయాత్రలో పార్టీ శ్రేణులు: పాదయాత్రలో వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, విజయనగరం శ్రీకాకుళం జిల్లాల పరిశీలకుడు భూమన కరుణాకరరెడ్డి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ప్రొగ్రామ్స్‌ కమిటీ కో ఆర్డినేటర్‌ తలశిల రఘురాం, కురుపాం, కడప ఎమ్మెల్యేలు పాముల పుష్పశ్రీవాణి, హమ్‌జాత్‌బాషా, మాజీ మంత్రులు మోపిదేవి వెంకటరమణ, పిల్లి సుభాష్‌చంద్రబోస్, రాష్ట్ర ఎస్సీసెల్‌ అధ్యక్షుడు మేరుగు నాగార్జున, పార్టీ జిల్లా రాజకీయ వ్యవహారాల సమన్వయకర్త మజ్జి శ్రీనివాసరావు, అరకు, విజయనగరం పార్లమెంటరీ జిల్లాల అధ్యక్షులు శత్రుచర్ల పరీక్షిత్‌రాజు, బెల్లాన చంద్రశేఖర్, అరుకు పార్లమెంటరీ నియోజకవర్గ సమన్వయకర్త మాధవి, మాజీ ఎమ్మెల్యేలు బొత్స అప్పలనర్సయ్య, బడ్డుకొండ అప్పలనాయుడు, ఎస్‌కోట, పార్వతీపురం, పాతపట్నం నియోజకవర్గాల సమన్వయకర్తలు కడుబండి శ్రీనివాసరావు, అలజంగి జోగారావు, రెడ్డి శాంతి, రాజమండ్రి పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు కావలి శ్రీనివాస్, రాజమండ్రి పార్లమెంటరీ రైతు విభాగం అధ్యక్షుడు బూరుగుపల్లి సుబ్బారావు, పశ్చిమగోదావరి యువజన విభాగం అధ్యక్షుడు యోగేంద్రవర్మ, రాష్ట్ర యువజన విభాగం ప్రధాన కార్యదర్శి భూమిరెడ్డి మహానందరెడ్డి, పార్టీ నాయకులు జమ్మాన ప్రసన్నకుమార్, కురుపాం జెడ్పీటీసీ శెట్టిపద్మావతి, కురుపాం ఎంపీపీ ఇందిరాకుమారి తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు