ఊళ్లు ఉప్పొంగాయి

17 Jul, 2018 08:35 IST|Sakshi
పెద్దాడలో జగన్‌తో పాటు పాదయాత్రలో నడుస్తున్న గ్రామస్తులు

పాదయాత్రకు కదలి వచ్చిన పల్లెలు

పూలు పరిచి, హారతి పట్టిన ప్రజలు

ఎండావానల్ని లెక్క చేయకుండా నడిచిన  జగన్‌

ఆత్మీయనేత వెంట అడుగులేసిన జనం

ఆశల రేడుకు సమస్యలు చెప్పుకొన్న బాధితులు

ఆయన భరోసాతో మార్మోగిన ‘జయహో జగన్‌’ నినాదాలు

సాక్షి ప్రతినిధి, తూర్పుగోదావరి, కాకినాడ : ఉదయం భానుడు తన ప్రతాపం చూపించాడు. మధ్యాహ్నం వరుణుడు పలకరించాడు.. వాతావరణం ఎలా మారినా.. జననేత ఖాతరు చేయలేదు. ఎండవేడినీ, వానజడినీ పట్టించుకోలేదు. కష్టమైనా, నష్టమైనా చెక్కుచెదరని దీక్షాదక్షుడు ముందుకే సాగారు. తడిసి ముద్దవుతున్నా సంకల్పసిద్ధితో ప్రతి క్షణం ప్రజలతో మమేకమయ్యారు. చెంతకు వచ్చిన వారి భుజంపై చేయి వేసి,  చిరునవ్వుతో పలకరిస్తూ,  ఆప్యాయంగా వారి కష్ట సుఖాలను తెలుసుకున్నారు. పరిష్కారానికి భరోసానిస్తూ ముందుకు సాగారు.

జననేతను చూసి పల్లెలు ఉత్సాహంతో ఉప్పొంగిపోయాయి. కష్టాలు తీర్చే ఆశల రేడు వచ్చాడని ప్రజలు సంబర పడ్డారు. ఆయనను.. నాలుగేళ్ల టీడీపీ ప్రజాకంటక పాలన నుంచి విముక్తి కల్పించేందుకు నడిచొస్తున్న నవరత్నంగా చూశారు. దారిపొడవునా    పూలు పరిచి, హారతి పట్టారు. ఆయనతో అడుగులేసేందుకు కదలివచ్చారు. వివిధ వర్గాల వారు ఆయనకు గోడు వెళ్లబోసుకున్నారు. జననేత ఇచ్చిన భరోసాతో ‘జయహో జగన్‌’ అంటూ నినదించారు.  ప్రజా సంకల్ప యాత్రలో ప్రజలు అడుగడుగునా బ్రహ్మరథం పడుతున్నారు. 

పాదయాత్ర సాగిందిలా..
గొల్లల మామిడాడ శివారు నుంచి ప్రారంభమైన 213వ రోజు పాదయాత్ర పెద్దాడ, కైకవోలు, పెదపూడి, దొమ్మాడ మీదుగా కరకుదురు వరకు కొనసాగింది. సోమవారం 9.3 కిలోమీటర్లు నడిచిన జననేత దీంతో 2543.2 కిలోమీటర్ల పాదయాత్ర పూర్తి చేశారు. గొల్లల మామిడాడ శిబిరం వద్ద ప్రారంభమైన పాదయాత్రకు అధిక సంఖ్యలో తరలివచ్చిన అభిమానులు ఘనస్వాగతం పలికారు. ప్రారంభంలోనే ప్రముఖ హాస్యనటుడు పృథ్వీరాజ్‌ హీరోగా నటించిన ‘మై డియర్‌ మార్తాండం’ సినిమా టీజర్‌ను జగన్‌ రిలీజ్‌ చేశారు. బిజీగా ఉన్నప్పటికీ తమ టీజర్‌ను ఆవిష్కరించారని నిర్మాతలు సంతోషాన్ని వ్యక్తం చేశారు.

సమస్యల నివేదన
జననేతకు పలువురు తమ వెతలను, సమస్యలను చెప్పుకొన్నారు. పింఛను రావడం లేదని వృద్ధులు ఆవేదన వ్యక్తం చేశారు. ఉండటానికి ఇళ్లు లేదని కొందరు మొర పెట్టుకున్నారు. తమపై కక్ష సాధింపు చర్యలకు దిగుతున్నారని కొందరు, తమ కుటుంబానికి ఏ ఒక్క మేలు జరగకుండా అడ్డుకుంటున్నారని ఇంకొందరు తమ సమస్యలను వివరించారు. రైతులు, కార్మికులు, విద్యార్థులు, ఉద్యోగులు తమ సమస్యలను, కష్టాలను అభిమాన నేతతో పంచుకున్నారు. గొల్లల మామిడాడలో స్థానిక మహిళలు ప్రభుత్వం ఏ సమస్యల్నీ పట్టించుకోవడం లేదని, ఎన్ని సార్లు చెప్పినా పరిష్కారం కాలేదని వాపోయారు. తాగునీటితో పలు సమస్యల్ని ఎదుర్కొంటున్నట్టు తెలిపారు.

అక్కడి నుంచి పెద్దాడ చేరుకున్న జగన్‌కు పెద్ద ఎత్తున స్వాగతం పలికారు. అభిమాన నేతను చూసేందుకు పోటీ పడ్డారు. అందర్నీ పలకరిస్తూ ముందుకు సాగిన ఆయన  గ్రామంలోని పార్టీ కార్యాలయం వద్ద ఒక మొక్కను నాటారు.

పాదయాత్రలో పార్టీ నేతలు
పార్టీ సీనియర్‌ నాయకులు, మాజీ ఎంపీ  పెద్దిరెడ్డి  రామచంద్రారెడ్డి, ప్రత్యేక హోదా పదవీ త్యాగం చేసిన ఎంపీ మిథున్‌రెడ్డి, మాజీ మంత్రి మోపిదేవి వెంకటరమణ, పార్టీ రాష్ట్ర కో ఆర్డినేటర్‌ తలశిల రఘురామ్, ఎమ్మెల్యే రక్షణ నిధి, రాష్ట్ర యువజన విభాగం అధ్యక్షుడు జక్కంపూడి రాజా, రైతు విభాగం రాష్ట్ర అధ్యక్షుడు నాగిరెడ్డి,   కాకినాడ, రాజమహేంద్రవరం పార్లమెంటరీ జిల్లాల అధ్యక్షులు కురసాల కన్నబాబు, కవురు శ్రీనివాస్, సమన్వయకర్తలు సత్తి సూర్యనారాయణరెడ్డి, ద్వారంపూడి చంద్రశేఖర్‌రెడ్డి,  రౌతు సూర్యప్రకాశరావు, ఆకుల వీర్రాజు, అనంత ఉదయభాస్కర్, రాష్ట్ర రైతు విభాగం ప్రధాన కార్యదర్శి మాకినీడి గాంధీ, రాష్ట్ర సంయుక్త కార్యదర్శి సత్తి సుబ్బిరెడ్డి, రాష్ట్ర యువజన విభాగం కార్యదర్శి నల్లమిల్లి దుర్గా ప్రసాద్‌రెడ్డి, రాష్ట్ర నాయకుడు తాడి విజయభాస్కరరెడ్డి, రాష్ట్ర ఎస్సీ సెల్‌ సంయుక్త కార్యదర్శి మోకా సూరిబాబు, రాష్ట్ర యువజన విభాగం సంయుక్త కార్యదర్శి సత్తి సుబ్బారెడ్డి, జిల్లా అధికార ప్రతినిధి సబ్బెళ్ల కృష్ణారెడ్డి, సినీ హాస్య నటుడు పృథ్వీరాజ్,  కార్యదర్శి కొవ్వూరి త్రినా«థ్‌రెడ్డి,  మేడపాటి షర్మిలారెడ్డి, కర్రి పాపారాయుడు తదితరులు పాల్గొన్నారు.

బాధలు వింటూ, భరోసానిస్తూ..
తమ సర్వీసును పూర్తిగా నీరు గార్చడమే కాకుండా సంస్థను ప్రైవేటు పరం చేశారని 104 ఉద్యోగులు జగన్‌ను కలిసి ఆవేదన వ్యక్తం చేశారు. తమ బతుకులు దీనంగా మారాయని, ప్రభుత్వం తమను రెగ్యులర్‌ లేదా కాంట్రాక్ట్‌  ఉద్యోగులుగా గుర్తించి భద్రత కల్పించాలని వేడుకున్నారు. వారి బాధలు విన్న ఆయన అ«ధికారంలోకి వచ్చాక న్యాయం చేస్తానని హామీ ఇచ్చారు. తనపై, తన కుటుంబంపై పోలీసులు అక్రమ కేసులు పెట్టి నానా రకాలుగా వేధిస్తున్నారని శహపురానికి  చెందిన రాయుడు మురళీకృష్ణ తీవ్ర ఆవేదనతో చెప్పుకున్నాడు. పోలీసుల వేధింపుల వల్ల చివరకు తన తండ్రి కాలువలో దూకి ఆత్మహత్య చేసుకున్నారని బోరుమన్నారు. ఇలా సమస్యలు వింటూ ముందుకు సాగిన జననేతకు పెదపూడిలో ఘన స్వాగతం లభించింది.  ఇక్కడ కాకినాడకు చెందిన నీలా శ్రీనివాస్‌ అనే 30 ఏళ్ల వ్యక్తి  జగన్‌ను కలిశారు. విధి నిర్వహణలో ప్రమాదాకి గురై వెన్నుపూస విరిగి రెండు కాళ్లు చచ్చు పడిపోయాయని అంబులెన్స్‌లో వచ్చి అభిమాన నేత వద్ద బాధలు చెప్పుకొన్నారు.  పెదపూడి నుంచి దొమ్మాడకు వచ్చేసరికి వర్షం ప్రారంభమైంది. అయినా లెక్క చేయకుండా జగన్‌ ముందుకు సాగారు. ప్రజలు కూడా వానలోనే ఆయనను చూసేందుకు తరలివచ్చారు. కరకుదురు వరకు వర్షంలోనే అడుగులో అడుగేశారు.

మరిన్ని వార్తలు