మా రాజువు నువ్వే

3 Sep, 2018 07:33 IST|Sakshi
అశేష జనవాహిని మధ్య జననేత జగన్‌ పాదయాత్ర

మహానేత అడుగు జాడల్లో..

కష్టాలు వింటూ..కన్నీళ్లు తుడుస్తూ..

మాడుగులలో ప్రవేశించిన జననేత పాదయాత్ర

దారిపొడవునా అపూర్వ స్వాగతం

సాక్షి, విశాఖపట్నం: ఆ అడుగులో ఓ విశ్వాసం..ఆ స్పర్శలో ఓ నమ్మకం ..ఆ పలకరింపులో ఆత్మీయత. అందుకే అన్న వస్తున్నాడంటే పల్లెలు ఉరకలెత్తుతున్నాయి. చేతిలో అధికారం లేదని తెలుçసు.. అయినా ప్రజలకు ఆయనంటే ఓ భరోసా. తమ సమస్య సత్వర పరిష్కారానికి నోచుకోదని తెలుసు.. కానీ తమ బాధలు చెప్పుకోవాలన్న తపన. నైరాశ్యపు చీకట్లు కమ్మిన ఆ బతుకుల్లో నవ్యకాంతుల దివిటీలు వెలిగిస్తోంది ప్రజాసంకల్పయాత్ర. చితికిన బతుకుల్లో కొత్త ఆశలు చిగురింపజేస్తోంది. మా రాజువు నువ్వే అంటూ జనం ఆత్మీయంగా అక్కున చేర్చుకుంటున్నారు. నడినెత్తిన భానుడు భగభగమండుతున్నా ఉక్కుసంకల్పంతో ఉరుకుతూ.. ఊరడిస్తూ.. నవరత్నాల సాక్షిగా సాగుతోంది.

చైనావాల్‌ మాదిరి గా దడికట్టినట్టుగా రహదారికిరువైపులా నిటారు న నిల్చొని తలలూపుతున్న తాటి చెట్లు ఓ వైపు.. పుడమిపై పచ్చబొట్లు వేసినట్లు పచ్చని పైరు మరొక వైపు... తీపిని పంచే చెరుకుగెడల ఊగిసలాటలు ఇంకొక వైపు..వీటి మధ్య జననేత నడుస్తుంటే వేలాది మంది అనుసరించారు. మహానేత వైఎస్, ఆయన తనయ షర్మిల పాదయాత్ర చేసిన దారుల్లో సాగిన ప్రజా సంకల్పయాత్రకు అడుగుడుగునా ప్రజలు బ్రహ్మరథం పట్టారు. మహానేత తొమ్మిదో వర్థంతి రోజున కాలినడక వస్తోన్న జననేతను చూసి ఉద్వేగానికి లోనవుతూ చమర్చిన కళ్లతోనే ప్రజలు అపూర్వ స్వాగతం పలికారు. 252వ రోజు ఆదివారం పాదయత్ర సాగిన రహదారుల్లో  జనజాతరను తలపించింది. దారిపొడవునా జోహార్‌ వైఎస్సార్‌..జోహార్‌ వైఎస్సార్‌ అంటూ ఆ మహనీయుడ్ని స్మరించుకుంటూ జననేతకు స్వాగతం పలికారు. తొలుత రాత్రిబస చేసిన అన్నవరం శిబిరం వద్ద మహానేత తొమ్మిదో వర్థంతి సందర్భంగా ఎంపీ విజయసాయిరెడ్డి, పార్టీ నేతలతో కలిసి వైఎస్‌ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.

మండుటెండలో సైతం..
ప్రజాకంటక పాలన అంతమే లక్ష్యంగా వైఎస్సార్‌ సీపీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చేస్తోన్న ప్రజాసకంల్పయాత్ర జిల్లాలో అప్రతిహాతంగా సాగుతోంది. చోడవరం నియోజకవర్గంలో రెండోరోజు అన్నవరం శివారు నుంచి ప్రారంభమైన పాదయాత్ర కండేపల్లి క్రాస్‌ రోడ్డు, లక్కవరం, మారుతీనగర్, గవరవరం, జి.జగన్నాథపురం క్రాస్‌ రోడ్డు మీదుగా వేచలం క్రాస్‌ (చీకటితోట) వద్ద మాడుగుల నియోజకవర్గంలోకి అడుగుపెట్టింది. దేవరాపల్లి మండలంలో వేచలం క్రాస్‌రోడ్, ములకలాపల్లి మీదుగా కొత్తపెంట వరకు సాగింది. ఉదయం నుంచి సాయంత్రం వరకు భానుడు ప్రతాపం చూపినా దారిపొడవున బారులు తీరిన ప్రజలు జననేతను చూసేందుకు బాలురు తీరారు. వారి కష్టాలు వింటూ...కన్నీళ్లు తుడుస్తూ జననేత ముందుకు సాగారు. వ్యవసాయ కూలీలు జననేత రాకను గమనించి పొలంలో నుంచి రోడ్డుపైకి వచ్చి తమ కష్టాలు చెప్పుకున్నారు.

మాడుగులలో బ్రహ్మరథం
చోడవరం నియోజకవర్గంలో ముగించుకుని మాడుగుల నియోజకవర్గంలో అడుగు పెట్టిన జననేత పాదయాత్రకు దేవరాపల్లి మండల ప్రజలు అపూర్వస్వాగతం పలికారు. శాసనసభ ఉపనేత, ఎమ్మెల్యే  బూడి ముత్యాల నాయుడు ఆధ్వర్యంలో వేలాదిమంది ప్రజలు వేచలం క్రాస్‌(చీకటితోట) వద్ద ఎదురేగి స్వాగతం పలికారు. దారిపొడవునా ఫ్లెక్లీలు..స్వాగతద్వారాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.

అడుగడుగునా వినతుల వెల్లువ
బాబూ.. నాకు ముగ్గురు కొడుకులు. డిగ్రీలు చదువుకున్నారు. కొలువుల్లేక కూలీ పనికి పోతున్నారయ్యా అంటూ లక్కవరానికి చెందిన కొప్పి జగన్నాథం లక్కవరం వద్ద వైఎస్‌ జగన్‌ను కలిసి కన్నీటి పర్యంతమైంది. ఎక్కడకు వెళ్లినా లంచాలు అడుగుతున్నారని...లక్షలు పోసి ఉద్యోగాలు కొనుక్కునే స్తోమత మాకు లేదని ఆవేదన వ్యక్తం చేసింది. రాష్ట్రంలో మరెక్కడా లేని విధంగా ఇక్కడ పింఛన్లన్నీ అధికార టీడీపీ నేతలే పంచుకుంటున్నారని, అర్హులైన మాలాంటోళ్లు కోర్టుకెళ్తే కానీ పింఛన్‌ రావడం లేదన్నా అంటూ సియ్యాద్రి దుర్గాప్రాసద్‌ కండేపల్లి క్రాస్‌ వద్ద జగన్‌ను కలిసి వాపోయాడు. ఏళ్లతరబడి పనిచేస్తున్న తమను రోడ్డుపాల్జేసారని సాక్షరభారత్‌ కో ఆర్డి్డనేటర్లు, మా పొట్ట కొట్టేందుకు సిద్ధమయ్యారని మధ్యాహ్నభోజన కార్మికులు మొరపెట్టుకున్నారు.

పాదయాత్రలో జగన్‌ రాజకీయ వ్యవహారా ల కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి, తిరుపతి మాజీ ఎంపీ వి.వరప్రసాద్, పాదయాత్ర ప్రోగ్రా మ్స్‌ కో–ఆర్డినేటర్‌ తలశిల రఘురామ్, శాసనసభ పక్ష ఉపనాయకుడు బూడి ముత్యాలనాయు డు, మాజీ మంత్రి బలిరెడ్డి సత్యారావు, నెల్లూరు జిల్లా ఎమ్మెల్యేలు కాకాణి గోవర్ధనరెడ్డి, అనిల్‌కుమార్‌ యాదవ్, కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి, రామిరెడ్డి ప్రతాప్‌రెడ్డి, జిల్లా ప్రధానకార్యదర్శి జి.ఎస్‌.సుధీర్‌కుమార్‌ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే గూనూరు మిలట్రీ నాయుడు, అనకాపల్లి పార్లమెంట్‌ జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమర్‌నాథ్, పార్లమెంట్‌ సమన్వయకర్త వరుదు కల్యాణి, సమన్వయకర్తలు కరణం ధర్మశ్రీ, పెట్ల ఉమాశంకర గణేష్, విజయనగరం జిల్లా రాజకీయ వ్యవహారాల సమన్వయకర్త మజ్జి శ్రీనివాసరావు, సీఈసీ సభ్యుడు కాకర్లపూడి శ్రీకాంత్, రాష్ట్ర యువజన విభాగం అధికార ప్రతినిధి తుళ్లి చంద్రశేఖర్‌యాదవ్, డీసీసీబీ మాజీ చైర్మన్‌ ఉప్పలపాటి సుకుమార్‌ వర్మ, రాష్ట్ర అధికార ప్రతినిధి తాడి విజయభాస్కరరెడ్డి, రాష్ట్ర అదనపు కార్యదర్శులు పక్కి దివాకర్, రవిరెడ్డి, జిల్లా నాయకులు మళ్ల బుల్లిబాబు, కరణం జయదేవ్, ఎస్‌. ఎస్‌.ఎన్‌.రెడ్డి, కిరణ్‌రాజు, నాగులాపల్లి రాం బాబు, పి.వెంకటేష్, శ్రీరామమూర్తి, చిర్ల నాగి రెడ్డి, ఎం.శంకరరావు, ఎం. శ్రీకాంత్, జి.ఆర్‌.హెచ్‌ ప్రసాద్, గుమ్మడు సత్యదేవ్, తలారి ఆదిమూర్తి, లేగ ఉమ, అల్లం మాధవి, ఎం.వెంకటరమణ, పి. అప్పారావు, గొల్లవిల్లి రామకృష్ణ, డాక్టర్‌ లక్ష్మీకాంత్, వి.శ్రీనివాసరావు, బూరె బాబూరావు, కర్రి సత్యం, గొల్లవిల్లి సంజీవరావు పాల్గొన్నారు.

అదే దారిలోముగ్గురు నేతలు..
2003లో వైఎస్‌ రాజశేఖరరెడ్డి ప్రజాప్రస్థానం పేరిట పాదయాత్రగా ఇదే దారిలో వచ్చారు.ఆ తర్వాత ఆయన తనయ షర్మిల మరో ప్రజాప్రస్థానం పేరిట పాదయాత్రగా వచ్చారు. ఇప్పుడు రాజన్న బిడ్డ వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి వస్తున్నాడని తెలుసుకుని ఆ పల్లెలు పరవశించిపోయాయి. పార్టీ కో ఆర్డినేటర్, మాజీ ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ ఆధ్వర్యంలో లక్కవరం, గవరవరం గ్రామాల్లో అపూర్వ స్వాగతం లభించింది. పాదయాత్ర దారుల్లో పూలు చల్లారు. ప్రజాప్రస్థానంలో మహానేత బస చేసిన ప్రాంతమైన లక్కవరం వద్ద వైఎస్‌ విగ్రహానికి మాజీ ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ పూలమాలలు వేశారు. అదేవిధంగా గవరవరం వద్ద కొత్తగా ఏర్పాటు చేసిన దివంగత వైఎస్‌ విగ్రహాన్ని పార్టీ నేతలు అమర్‌నాథ్, వరుదు కళ్యాణి, ధర్మశ్రీలతో ఆవిష్కరింపజేశారు.

>
మరిన్ని వార్తలు