277వ రోజు ప్రారంభమైన ప్రజాసంకల్పయాత్ర

3 Oct, 2018 08:20 IST|Sakshi

సాక్షి, విజయనగరం: వైఎస్సార్‌సీపీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి తలపెట్టిన ప్రజాసంకల్పయాత్ర విజయనగరం జిల్లాలో విజయవంతంగా కొనసాగుతోంది. బుధవారం ఉదయం నెల్లిమర్ల నియోజకవర్గంలోని  నెల్లిమర్ల మండలం కొండవెలగాడ నుంచి 277వ రోజు పాదయాత్ర ప్రారంభించారు. వైఎస్‌ జగన్‌ రాకతో పాదయాత్ర సాగుతున్న మార్గంలో పండుగ వాతావరణం నెలకొంది.

దారిపొడవునా సమస్యలు తెలుసుకుంటూ వైఎస్‌ జగన్‌ ముందుకు సాగుతున్నారు. అక్కడి నుంచి జరజాపుపేట, లక్ష్మీదేవిపేట మీదుగా పాదయాత్ర సాగుతుంది. అనంతరం భోజన విరామం తీసుకుని మళ్లీ నెల్లిమర్ల మెయిదా జంక్షన్‌ వరకు పాదయాత్ర కొనసాగిస్తారు. అక్కడ జరిగే భారీ బహిరంగ సభలో వైఎస్‌ జగన్‌ ప్రసంగిస్తారు.

రాజశేఖరరెడ్డి హయాంలోనే సగం పనులు పూర్తయ్యాయి
నెల్లిమర్ల మాజీ ఎమ్మెల్యే బడుకొండ అప్పలనాయుడు పాదయాత్రలో వైఎస్‌ జగన్‌ను కలుసుకున్నారు. అధికార పార్టీ నేతల అరాచకాలకు అడ్డుఅదుపూ లేకుండా పోతోందనీ అన్నారు. చంపావతి నదీతీరంలో ఇసుక అక్రమ రవాణా మొదలుకొని, నీరు చెట్టు పేరుతో చేస్తున్న దోపిడీ వరకు టీడీపీ నేతల ఆగడాలు సాగుతున్నాయని వైఎస్‌ జగన్‌ దృష్టికి తెచ్చారు. నెల్లిమర్ల నగరపంచాయితీ వ్యవహారాలపై ప్రజలు తీవ్ర వ్యతిరేకతతో ఉన్నారని అప్పలనాయుడు చెప్పారు. వైయస్ రాజశేఖరరెడ్డి హయాంలో తారకరామ తీర్ధసాగర్ ప్రాజెక్టు పనులు సగానికి పైగా పూర్తయ్యాయనీ, మిగతా పనులు నేటికీ పూర్తికాలేదని వైఎస్‌ జగన్‌ టీడీపీ పాలనపై విమర్శలు గుప్పించారు.

ప్రజల హర్షం..
నెల్లిమర్ల నగర పంచాయతీ నుంచి తమ గ్రామాన్ని వేరు చేయాలని జర్జాపుపేట గ్రామస్తులు వైఎస్‌ జగన్‌ను కోరారు. తమ గ్రామాన్ని గ్రామ పంచాయతీగా మారుస్తామని ఎన్నికల్లో హామినిచ్చిన టీడీపీ నాయకులు మోసం చేశారని ఆరోపించారు. 5 ఏళ్లుగా ప్రజాప్రతినిధులు లేక గ్రామంలో అభివృద్ధి ఆగిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామస్తుల విజ్ఞప్తిపై వైఎస్‌ జగన్‌ సానుకూలంగా స్పందించడంతో వారు హర్షం వ్యక్తం చేశారు. 

జీవో 343 రద్దుకు వినతి
వైఎస్‌ జగన్‌ను కలిసిన మైదాన మత్య్సకారులు తమ గోడు వెళ్లబోసుకున్నారు. జీవో 343 రద్దు చేయాలని కోరారు. చెరువుల్లో మత్స్స సంపద నష్టపోతే పరిహారం ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. చేపల చెరువులను పంచాయతీలు, మున్సిపాలిటీల నుంచి తప్పించి మత్స్యశాఖకు అప్పగించాలని వినతిపత్రం అందజేశారు.

>
మరిన్ని వార్తలు