నిర్మాణాత్మక దిశగా...

31 May, 2014 03:35 IST|Sakshi
నిర్మాణాత్మక దిశగా...

- ఫలితాలపై నేడు వైఎస్సార్ సీపీ
- నిశిత సమీక్ష జిల్లాకొస్తున్న త్రిసభ్య కమిటీ  
- క్షత్రియ కల్యాణ మండపంలో ఉదయం 10 గంటలకు ప్రారంభం
- పార్టీ పటిష్టత కోసం అభిప్రాయ సేకరణ
 సాక్షి ప్రతినిధి, విజయనగరం : సార్వత్రిక ఎన్నికల ఫలితాలపై వైఎస్సార్ సీపీ శనివారం సమీక్షలు నిర్వహించనుంది. పార్టీ అధిష్టానం నియమించిన త్రిసభ్య కమిటీ ఆధ్వర్యంలో స్థానిక క్షత్రియ కల్యాణ మండపంలో నియోజకవర్గాల వారీగా సమీక్షలు జరగనున్నాయి. ఊహించిన విధంగా ఫలితాలు రాకపోవడానికి గల కారణాలను కమిటీ సభ్యులు తెలుసుకోనున్నారు. భవిష్యత్‌లో పార్టీని క్షేత్రస్థాయి నుంచి పటిష్ట పరచడానికి తీసుకోవలసిన చర్యలపై కూడా నేతలు, కార్యకర్తల అభిప్రాయాలను సేకరించనున్నారు. అందరి మనోగతం తెలుసుకుని తదనుగుణంగా  ఓ నివేదికను  పార్టీ అధిష్టానానికి త్రిసభ్య కమిటీ సమర్పించనుంది.

ఉదయం 10 నుంచి రాత్రి ఏడు గంటల వరకూ...
జూన్ మొదటి వారంలో పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి జిల్లాల వారీగా సమీక్ష సమావేశాలు నిర్వహించనున్న దృష్ట్యా సన్నాహకంగా త్రిసభ్య కమిటీ జిల్లా స్థాయిలో నియోజకవర్గాల వారీగా సమీక్ష చేయనుంది. ఈ కమిటీలో మాజీ మంత్రి దాడి వీరభద్రరావు, అరకు ఎమ్మెల్యే సర్వేశ్వరరావు, గాజువాక నియోజకవర్గ నేత తిప్పల నాగిరెడ్డి సభ్యులుగా ఉన్నారు.

జిల్లా పార్టీ అధ్యక్షుడు పెనుమత్స సాంబశివరాజు కూడా సమీక్షలో పాల్గొంటారు. ఉదయం 10 గంటలకు నెల్లిమర్ల నియోజకవర్గంతో సమీక్షలు ప్రారంభం కానున్నాయి. 11 గంటకు గజపతినగరం, 12 గంటలకు ఎస్.కోట, మధ్యాహ్నం ఒంటి గంటకు చీపురుపల్లి, 3 గంటలకు కురుపాం, సాయంత్రం 4 గంటల కు సాలూరు, 5 గంటలకు పార్వతీపురం, 6 గంటలకు బొబ్బిలి నియోజకవర్గాల సమీక్ష జరగనుంది. చివరిగా రాత్రి 7 గంటలకు విజయనగరం నియోజకవర్గాన్ని సమీక్షిం చి జయాపజయాలపై కారణాలు విశ్లేషిస్తారు.

ఫలితాలపై అన్ని కోణాల్లో...  
ఎన్నికల ఫలితాలపై త్రిసభ్య కమిటీ నిశితంగా సమీక్షించనుంది. ప్రచార తీరు, అభ్యర్థుల పనితీరు, ఎన్నికల్లో అనుసరించిన వ్యూహాలు, నాయకుల పనితీరు తదితర అంశాలపై లోతుగా చర్చించనున్నారు. ఏయే విషయాల్లో వెనుకబడ్డాం, ఎక్కడెక్కడ దెబ్బతిన్నాం, పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు ఎవరెవరు పాల్పడ్డారు...తదితర కోణాల్లో కమిటీ ఆరా తీయనుంది. నియోజకవర్గానికి గంట చొప్పున సమీక్ష చేసి తదనంతరం అధిష్టానానికి నివేదిక అందజేస్తారు. ఈ సమీక్షలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ, కౌన్సిలర్ అభ్యర్థులతో పాటు నియోజకవర్గ అభ్యర్థులు, మండల కన్వీనర్లు పాల్గొంటారు. వీరందరి అభిప్రాయాన్ని పరిగణనలోకి తీసుకుంటారు.

పార్టీ పటిష్టతపై...
ఎన్నికల ఫలితాలపైనే కాకుండా పార్టీ పటిష్టతపై కూడా చర్చించనున్నారు. గ్రామస్థాయి నుంచి పార్టీని పటిష్టపరచడానికి తీసుకోవాల్సిన చర్యలపై స్థానిక నేతలతో త్రిసభ్య కమిటీ సభ్యులు చర్చించనున్నారు. పార్టీ నిర్మాణం కోసం సమీక్షకు హాజరైన వారందరి అభిప్రాయాన్ని కోరనున్నారు. వారిచ్చే సూచనలు, సలహాలను ఆధారంగా చేసుకుని త్రిసభ్య కమిటీ సభ్యులు అధిష్టానానికి ఒక నివేదిక ఇవ్వనున్నారు. దాన్ని ఆధారంగా చేసుకుని జూన్ మొదటి వారంలో వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సమీక్షలు చేసి పార్టీ పటిష్టతకు పథక రచన చేయనున్నారు.

సమీక్షకు హాజరుకండి : పెనుమత్స
ఆహ్వానం అందిన నేతలంతా సమీక్షలకు హాజరు కావాలని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు పెనుమత్స సాంబశివరాజు కోరా రు. ఉదయం 10 గంటలకు సమీక్షలు ప్రారంభమవుతాయ ని, ఒక్కొక్క నియోజకవర్గానికి గంట చొప్పున సమయం కేటాయిస్తున్నట్టు చెప్పారు. పార్టీ పటిష్టత కోసం తగు సూచనలు, సలహాలు ఇవ్వాలని కోరారు. నిర్మాణాత్మకంగా వ్యవహరించేందుకు ఇదొక మంచి అవకాశమని తెలిపారు.

మరిన్ని వార్తలు