వామపక్షాల బంద్‌కు వైఎస్‌ఆర్‌సీపీ మద్దతు

6 Feb, 2018 02:05 IST|Sakshi

సాక్షి, అమరావతి : రాష్ట్ర విభజన చట్టంలోని హామీల అమలు కోసం ఈ నెల 8న వామపక్షాలు పిలుపునిచ్చిన రాష్ట్ర బంద్‌కు వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ పూర్తి మద్దతు ప్రకటించింది. రాష్ట్రానికి ప్రత్యేక హోదా, పోలవరం ప్రాజెక్టు, దుగరాజపట్నం పోర్టు, విశాఖ రైల్వే జోన్, కడప ఉక్కు కర్మాగారం ఏర్పాటుతోపాటు విభజన చట్టం ప్రకారం రాష్ట్రానికి రావాల్సిన అన్ని అంశాలపై వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ గడిచిన నాలుగేళ్లుగా అలుపెరగని పోరాటం చేస్తున్నదని, వీటికి మద్దతుగా ఏ పార్టీ ఎలాంటి ఆందోళన కార్యక్రమాలకు పిలుపునిచ్చినా మద్దతు ఇవ్వనున్నట్లు పార్టీ సోమవారం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది.

ఇదిలా ఉంటే, బంద్‌కు కేంద్ర కార్మిక సంఘాలు మద్దతు ప్రకటించాయి. విజయవాడలోని సీపీఐ రాష్ట్ర కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఏఐటీయూసీ, సీఐటీయూసీ, ఐఎఫ్‌టీయూ, ఇతర కార్మిక సంఘాల నేతలు జి.ఓబులేసు, వి.ఉమామహేశ్వరరావు, కె.రామారావు మాట్లాడారు. బంద్‌కు కార్మిక, ఉద్యోగ, వర్తక, వాణిజ్య సంఘాలు మద్దతు పలకాలని విజ్ఞప్తి చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా మద్దతు తెలపాలన్నారు.   

మరిన్ని వార్తలు