ప్రతి పథకం టీడీపీ నేతల మేతకే

21 Jun, 2018 10:13 IST|Sakshi

 వైఎస్సార్‌ సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రెడ్డి శాంతి

పాతపట్నం: గత నాలుగేళ్లుగా రాష్ట్రంలో ఎలాంటి పథకాలు అమలు చేసినా ఆ పథకాలన్నీ తెలుగుదేశం పార్టీ నేతల మేతకే ఉపయోగపడ్డాయని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రెడ్డి శాంతి ఆరోపించారు. పాతపట్నంలోని ఆ పార్టీ కార్యాలయంలో బుధవారం విలేకరులతో మాట్లాడారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మం జూరు చేసే ప్రతి పథకాన్ని టీడీపీ నాయకులు స్వాహా చేస్తున్నారని ఆరోపించారు. జన్మభూమి కమిటీలు, జిల్లా ఇన్‌చార్జి మంత్రి సిఫార్స్‌లు అని రకరకాల వంకలు చూపించి అధికార పార్టీ కార్యకర్తలకు, నాయకులకు పథకాలు అందేలా చూస్తున్నారని మండిపడ్డారు.

 పింఛన్, రేషన్‌ కార్డు, కాలనీ ఇళ్లు, రాయితీ రుణాలు, వంశధార నిర్వాసితులకు ఇచ్చే పలు రకాల ప్యాకేజీలు ఇలా అన్ని అధికార పార్టీ నాయకులే స్వాహా చేస్తున్నారని వివరించారు. ఇటీవల ప్రభుత్వం రైతు రథాలు పేరుతో రాయితీపై మంజూరు చేసిన ట్రాక్టర్లు జన్మభూమి కమిటీ సభ్యులు, సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, అధికార పార్టీ కీలక నేతలు, పార్టీ ప్రధాన కార్యకర్తలు దక్కించుకున్నారని అన్నారు. మెళి యాపుట్టి మండలంలో పలువురు దళితుల పేరుతో మంజూరు చేసిన రైతు రథాలు (ట్రాక్టర్లు) అక్కడి అధికార పార్టీ నేతలే స్వాధీనం చేసుకున్నారని ఆరోపించారు. దళితులకు ప్రభుత్వం ఇచ్చే రాయితీలను పక్కదారి పట్టించి ఇతర కులాలకు చెందిన భూస్వాములు, పెద్దలు అధికార పార్టీ అండతో స్వాహా చేసుకుంటున్నారని అన్నారు.

 రైతులు రథాల కోసం స్థానిక ఎమ్మెల్యే కోటా నుంచి రూ.1.50 లక్షలు రాయితీ ఇస్తుండగా ఇందుకు ప్రభుత్వం మరో రూ.లక్ష రాయితీ చెల్లిస్తుందని అన్నారు. దళితుల పేరున వచ్చే రైతు రథాలకు మొత్తం రూ.2.50లక్షలు రాయితీ ఉంటుందని చెప్పారు. ఇంత పెద్ద మొత్తంలో రైతుల కోసం రాయితీ ఇచ్చే పథకాలు మరేవీ లేవన్నారు. అందుకే ఈ పథకాలపై అధికార పార్టీ పెద్దలు కన్నేసి దారి తప్పిస్తున్నారని ఆరోపించా రు. ఆమెతో పాటు పాతపట్నం, కొత్తూరు వైఎస్సార్‌ సీపీ మండల కన్వీనర్లు రేగేటి సన్ముఖరావు, సారిపల్లి ప్రసాదరావు, జిల్లా ప్రధాన కార్యదర్శి బమ్మిడి ఖగేశ్వరరావు, గిరిజన నాయకుడు సవర సుభాష్, రాష్ట్ర పంచాయతీ రాజ్‌ కార్యదర్శి కొండాల అర్జునుడు, పార్టీ నాయకులు కె.జానకమ్మ, శ్రీకర్ణ, పడాల గోపి, జి.లుట్టిబాబు తదితరులు పాల్గొన్నారు. 

మరిన్ని వార్తలు