లక్ష ఎకరాలు మాయం చేశారు: బొత్స

8 Jun, 2017 14:33 IST|Sakshi

విశాఖ : విశాఖలో సంచలనం రేపుతున్న భూ కబ్జాలపై వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ  గురువారం రౌండ్‌ టేబుల్‌ సమావేశం నిర్వహించింది. ఈ కార్యక్రమంలో పార్టీ ఎంపీ విజయ సాయిరెడ్డి, బొత్స సత్యనారాయణ, గుడివాడ అమర్నాథ్‌తో పాటు కాంగ్రెస్‌, సీపీఎం, లోక్‌సత్తా, జనసేన, ప్రజసంఘాలు, మేథావులు పాల్గొన్నారు. టీడీపీ పాలనలో జరుగుతున్న భూ కుంభకోణాలు, కబ్జాలపై వారు చర్చించారు.

ఈ సందర్భంగా బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ... ఈ భూ కుంభకోణం వెనుక పెద్దల పాత్ర ఉందని, ప్రభుత్వంపై ఆరోపణలు వస్తే వాటిపై విచారణకు సిద్ధంగా ఉండాలని  అన్నారు. భూ కుంభకోణం జరిగిందని సాక్షాత్తూ మంత్రే చెబుతున్నారు. ఒక మంత్రిపై మరో మంత్రి ఆరోపణలు చేస్తున్నారని, దీనిపై విచారణకు ప్రభుత్వం ఆదేశించాలన్నారు.

విశాఖ భూములపై డేగల్లా వచ్చి వాలిపోతున్నారని బొత్స వ్యాఖ్యానించారు. హుద్‌హుద్‌ తుఫానులో రికార్డులు కొట్టుకు పోయాయని చిన్నపిల్లలకు చెప్పినట్లు కథలు చెప్పడం విడ్డూరమన్నారు. ఈ భూ దందాలపై వీధి పోరాటాలకు దిగాల్సిన అవసరం ఉందని బొత్స సత్యనారాయణ పిలుపు నిచ్చారు. రాష్ట్రంలో పరిస్థితులు బాధాకరంగా ఉన్నాయన్నారు. విశాఖలో లక్ష ఎకరాలు మాయం చేశారని అన్నారు. దసపల్లా బూముల్లో టీడీపీ కార్యాలయం ఎలా కట్టారని ఆయన ప్రశ్నించారు.

ఈ భూ కబ్జాపై సీబీఐ విచారణ జరిగేలా రాజకీయా పార్టీలు పోరాటాలు చేయాలని వైఎస్‌ఆర్‌ సీపీ రాజ్యసభ ఎంపీ విజయ్‌ సాయిరెడ్డి అన్నారు. బహిరంగ విచారణతో  వాస్తవాలు వెలుగులోకి రావన్నారు.  లక్ష ఎకరాల కబ్జా జరిగిందని కలెక్టరే స్వయానా చెప్పారని, అయితే లోకేశ్‌తో మంతనాలతో అనంతరం జిల్లా కలెక్టర్‌ మాట మార్చారన్నారు.

మరిన్ని వార్తలు