రామోజీ! ఇంతకన్నా ఛండాలం ఉంటుందా?

6 Dec, 2023 17:16 IST|Sakshi

ఈనాడు అడ్డగోలు రాతలకు అంతూ పొంతూ లేకుండా పోతోంది. ‘జగన్ మార్క్‌ నిరంశకుత్వం’.. అంటూ ఈ మధ్య ఒక పరమ చెత్త కథనాన్ని ప్రచురించింది. ‘ప్రాథమిక హక్కుల్ని కాలరాస్తున్న వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం’.. అంటూ ఏవేవో హెడింగ్‌లు పెట్టేసి జనాన్ని మోసం చేయాలని యత్నించింది. ఇందులో తాలిబన్ల రాజ్యం మొదలు.. ఉత్తర కొరియా కిమ్ వరకు రాసేసి, ముఖ్యమంత్రి  వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిపై వాళ్లకున్న విద్వేషాన్ని వెలిబుచ్చుకుని ఆత్మ సంతృప్తి చెందుతోంది. నిజంగా ఏపీలో నిరంకుశత్వం ఉంటే ఈనాడు మీడియా ఇంతగా బరితెగించి, ఇంత ఛండాలపు వార్తలు రాయగలుగుతుందా?..

.. గతంలో ఏ ముఖ్యమంత్రిపైన లేనంత అక్కసును ఈనాడు మీడియా సీఎం జగన్‌పై ప్రదర్శిస్తోంది. ఈనాడు అధినేత రామోజీరావు ఇంత వృద్దాప్యంలోనూ తన పత్రికను ఇంతగా దిగజార్చడం శోచనీయం!. తనకు మీడియా ఉంది కదా, తమకు ఆయా వ్యవస్థల్ని మేనేజ్ చేయగల శక్తి ఉంది కదా, తమపై కేసులు వచ్చినా ఎవరు ఏమీ చేయలేరనే అహంకారంతో వ్యవహరిస్తున్న తీరు.. ప్రజాస్వామ్య విలువల్ని కాలరాస్తోంది. ఆ మొత్తం వార్తను చదివితే.. నిత్యం వాళ్లు రాస్తున్న స్టోరీలను గమనిస్తే  ఈనాడు మీడియా ఉగ్రవాద మీడియాగా మారిందనే అభిప్రాయం కలగక మానదు. ఎందుకంటే.. తాము అనుకున్నదే జరగాలనుకునే ఉగ్రవాదులకు.. వీరికి తేడా లేకుండా పోతోంది కాబట్టి. 

✍️దేశానికి ఉగ్రవాదం ఎంత ప్రమాదకరమో.. ఈనాడు లాంటి మీడియా సంస్థ కూడా అంతే ప్రమాదకరమని పదే పదే రుజువవుతోంది!. కశ్మీర్‌లో కూడా ప్రజాస్వామ్యం ఉందట. ఏపీలో లేదట. ఎవరైనా నమ్ముతారా?.. దమ్ముంటే ఈనాడు రామోజీరావు కశ్మీర్‌లో ఓ పత్రికనో, ఓ టీవీనో ప్రారంభించి అక్కడి నేతలపై ఇలాంటి విమర్శలు చేసి చూడమనండి. అంతదాకా ఎందుకు తెలంగాణలో బీఆర్ఎస్‌కు మొన్న ప్రభుత్వంలో ఉన్నంతదాకా.. వ్యతిరేకంగా ఒక్క కథనం ఇవ్వడానికి గజగజలాడింది ఈనాడు మీడియా. అలాంటిది ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం నిత్యం అబద్దాలు, ఇలాంటి దారుణమైన వార్తలు రాస్తూ చెలరేగిపోతోంది.

ఏపీలో స్వేచ్ఛ అనేదే లేదట!. నిరంకుశత్వం మాత్రమే ఉందట!!. దానికి ఏవో రెండు మూడు ఘటనలను ఉదాహరణలంటూ పేర్కొంది. ఈనాడులో వచ్చే ఆ కథనాలు ఎలా ఉంటాయంటే..  ఏపీలో ఏ ఇద్దరు వ్యక్తులు గొడవ పడ్డా, వాళ్లలో ఒకరు వైఎస్సార్‌సీపీ వాళ్లే అని రుద్దేసి దానిని ఒక వార్తగా, పైగా ప్రముఖంగా ప్రచురించడం నిత్యకృత్యం అయింది. మరి గతంలో చంద్రబాబు టైంలో కొన్ని ఘటనలు రామోజీ గుర్తు చేసుకుంటే బాగుంటుందేమో!.

✍️ఆనాడు ప్రతిపక్షనేతగా ఉన్న వైఎస్ జగన్ విశాఖలో కొవ్వొత్తుల ర్యాలీ కోసం వెళ్లే.. విమానాశ్రయం నుంచే పోలీసులతో అడ్డుకుని వెనక్కి పంపించేసింది చంద్రబాబు ప్రభుత్వం. అది అత్యంత ప్రజాస్వామ్యయుతంగా ఆనాడు ‘ఈనాడు రామోజీరావు’కు కనిపించింది. ప్రస్తుత మంత్రి  అంబటి రాంబాబు అప్పట్లో ఒక మండల ఎన్నికకు వెళ్తుంటే.. మార్గం మధ్యలోనే పోలీసులు అడ్డుకుంటే.. అది ప్రజాస్వామ్యమని ఈనాడు నమ్మబలికింది. మరి అప్పుడు అది తాలిబన్ల పాలన కాదట!. బాపట్ల ఎంపీ నందిగం సురేష్‌బాబు ఆ రోజుల్లో ఒక కార్యకర్తగా ఉండేవారు. అమరావతి రాజధాని ప్రాంతంలో పంటల దహనం కేసులో అక్రమంగా సురేష్‌ను అరెస్టు చేయడమే కాకుండా.. ఆ కేసులో జగన్ పేరు చెప్పాలంటూ పోలీసులు నానా హింసలు పెట్టారు. అది ఈనాడు రామోజీరావుకు చాలా కమ్మగా అనిపించిందేమో. ఆయన దృష్టిలో అది ఉత్తరకొరియా కిమ్ పాలన కాదన్నమాట!.

✍️రాజధానిలో ఎవరైనా ఆందోళనకు దిగితే వారిపై పెట్టిన కేసులు ఇన్నా!అన్నా!.. చివరికి ప్రభుత్వమే పంటలు తగలబెట్టిందే. అలాంటి అరాచక పరిస్థితి ఇప్పుడు ఎక్కడైనా ఉందా?. కాపు రిజర్వేషన్ ఉద్యమంలో కంచాలు మోగించారన్న కారణంగా కాపు కార్యకర్తలను ఎందరినో టీడీపీ ప్రభుత్వం అరెస్టు చేసిన సంగతి, వేధించిన సంగతి ఈనాడు రామోజీకి తెలియదా?. కాపు నేత ముద్రగడ పద్మనాభం కుటుంబాన్ని నానా బూతులు తిట్టి, జైలులో పెట్టిన చంద్రబాబు ప్రభుత్వం అత్యంత ప్రజాస్వామ్యయుతమైంది. రాయదుర్గంలో మాజీ మంత్రి కాల్వ శ్రీనివాసులు పాదయాత్రకు పోలీసులు అనుమతించలేదట. ఉద్రిక్తతలు తలెత్తుతాయనుకుంటే పోలీసులు అలాగే చేస్తారు. మరి చంద్రబాబు హయాంలో ముద్రగడ పద్మనాభం కాపు ఉద్యమంలో భాగంగా పాదయాత్ర చేపడితే కొన్ని వందల మంది పోలీసులను కిర్లంపూడిలోని ఆయన ఇంటివద్ద మోహరింప చేసి కదలనివ్వలేదే!.. దీనిని ఏమంటారో ఈనాడు వాళ్లు చెప్పాలి. చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డిని పోలీసులు హింసిస్తూ చిత్తూరు జిల్లా అంతటా తిప్పితే అది రామోజీరావుకు ఎంతో ఆనందం కలిగించినవార్త అయింది. ఇప్పుడు అలాంటివి ఏవీ జరగకపోయినా, పోలీసులు ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటేనే చాలా ఘోరం జరిగినట్లు గగ్గోలు పెట్టి, పెడబొబ్బలు పెట్టి ప్రజలను మోసం చేయడానికి విశ్వయత్నం చేస్తున్నారు.

✍️ఇంతకీ ఈనాడు, రామోజీల గోల ఏమిటి?.. వీరేదో పల్నాడులో క్వార్ట్జ్ ఖనిజం తవ్వకాల మీద వార్త రాశారట. వెంటనే తెలుగుదేశం వారు బయల్దేరి హడావుడి చేయాలని అనుకున్నారట. వారికి పోలీసులు అడ్డం పడ్డారట. సోషల్ మీడియాలో ఒక ప్రముఖ విశ్లేషకుడు చెప్పిన విషయం వింటే.. 88 ఏళ్ల రామోజీరావు సిగ్గుతో తలవంచుకోవాలి. టెండర్ పద్దతిలో మైనింగ్ ఇస్తే అదేదో తప్పు జరిగిపోయినట్లు, ప్రభుత్వానికి నష్టం కలిగినట్లు తప్పుడు వార్తలు రాశారని ఆయన పేర్కొన్నారు. ఆ టెండరేదో రామోజీరావే వేసి ఉండవచ్చు కదా! అని ఆయన వ్యాఖ్యానించారు. ప్రతి రోజూ ఇలాంటి తప్పుడు వార్తలు రాసి ప్రజలను వంచించడానికి చూస్తున్నారని ఆయన అభిప్రాయపడ్డారు. దీంతోపాటు అనుమతి లేకుండా ప్రతిపక్షాలు చేసే ఆందోళలను పోలీసులు అడ్డుకుంటే.. అదేదో పెద్ద తప్పు చేసినట్లు రాస్తున్నారు.  ఈనాడు రాతలు ఏ రకంగా తయారయ్యాయంటే.. రేపు ఎప్పుడైనా నిజంగానే తప్పులు జరిగితే, ఆ వార్తను ఈనాడు గనుక ఇస్తే.. జనం నమ్మే పరిస్థితి లేకుండా పోయింది. ప్రభుత్వంపైనా, పోలీసులపైనా ఈనాడు ఇలా ఇష్టారాజ్యంగా రాస్తుందిలే అని ప్రజలు అనుకునే పరిస్థితి సృష్టించుకున్నారు. 

ఈనాడు తీరు ఎలా ఉంటుందంటే.. ఒక రోజు పోలీసులే హత్యలు చేస్తున్నట్లు చిత్రీకరిస్తుంది. ఇంకో రోజు పోలీసులు అధికారపార్టీకి కొమ్ముకాస్తున్నట్లు నిరాధారమైన కథనాలు ఇస్తుంది. ప్రతిపక్షం ఏమి చేసినా దానికి విపరీత ప్రచారం చేస్తుంది. నిజనిర్ధారణ కమిటీల పేరుతో టీడీపీ ఏమి చేస్తుందో రామోజీకి తెలియదా?. అయినా ప్రజాస్వామ్యబద్దంగా పోలీసుల అనుమతి తీసుకుని వెళ్తే తప్పు లేదు. చంద్రబాబు పోలవరం ప్రాజెక్టు వద్దకు జనంతో వెళితే అనుమతించలేదట. మరి అనుమతి తీసుకోకుండా వెళ్తే.. అక్కడ ఎవరైనా చేయకూడని పని చేస్తే ఎవరు బాధ్యత?. అప్పుడు మళ్లీ పోలీసులనే తప్పు పడతారు కదా!  

రోజూ జగన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా  ఎలాగైనా సరే.. కొన్ని వార్తలు వండాలని అక్కడి జర్నలిస్టులకు ఈనాడు యాజమాన్యం ఆదేశించినట్లు స్పష్టంగా కనబడుతోంది. వాటిలో ఒకటి బానర్ గా పెట్టి.. మిగిలినవాటిని  ఇతర పేజీలలో పరుస్తారు. వాటిని మళ్లీ ఈటీవీలోనే చదివి వినిపిస్తారు. బహుశా గత గురువారం నాడు పాపం.. ఈనాడు విలేకరులకు ఏ వార్త దొరికినట్లు లేదు. అందుకే జగన్ మార్క్‌ నిరంకుశత్వం అంటూ వార్త రాసి అచ్చేసుకున్నారు. నిజం చెప్పాలంటే ఈనాడు మీడియా అచ్చోసిన ఆంబోతు మాదిరి వ్యవహరిస్తోంది. ఇక్కడ నిరంకుశత్వం జగన్‌ది కాదు.. తాము ఏది రాస్తే అదే ప్రజలు నమ్మాలనుకుంటున్న, జనాన్ని మోసం చేయాలనుకుంటున్న రామోజీరావుది.  మీడియా స్వేచ్చను దుర్వినియోగం చేయడం, తెలుగుదేశం పార్టీకి బాకా ఊదుతూ.. ఆ పార్టీ కరపత్రాని కంటే హీనంగా పత్రికను మార్చిన రామోజీరావును, వారి సంపాదక బృందాన్ని ఏమనాలి?.. ఇంకా దేనితోనైనా పోల్చవచ్చు కాని సంస్కారం అడ్డు వస్తోంది.


:::కొమ్మినేని శ్రీనివాసరావు, ఏపీ మీడియా అకాడెమీ చైర్మన్

>
మరిన్ని వార్తలు