రేపు విజయవాడకు సీఎం జగన్‌

6 Dec, 2023 20:42 IST|Sakshi

సాక్షి, తాడేపల్లి: ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి రేపు(గురువారం) విజయవాడలో పర్యటించనున్నారు. కనకదుర్గమ్మ ఆలయంలో పలు అభివృద్ది పనుల ప్రారంభోత్సవం, భూమి పూజ కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. అనంతరం కనకదుర్గమ్మను సీఎం దర్శించుకోనున్నారు. ఈ సందర్భంగా సీఎం పర్యటన ఏర్పాట్లను దేవాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ, ఆలయ ఈవో, సీపీ కాంతిరానా టాటా పరిశీలించారు.

మంత్రి మాట్లాడుతూ, దుర్గమ్మ గుడిని రూ.225 కోట్లతో సమగ్ర ప్రణాళికతో అభివృద్ధి చేస్తున్నామని పేర్కొన్నారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా అమ్మవారి ఆలయాన్ని తీర్చి దిద్దుతాం. అభివృద్ధి కార్యక్రమాలకు సీఎం జగన్ రేపు ఉదయం శంకుస్థాపన చేస్తారు. ఎన్నికల సమయంలోనూ అభివృద్ధి పనులకు ఎటువంటి ఆటంకం కలుగదు. నాలుగంతస్తుల ఆటోమేటిక్ కార్ పార్కింగ్ సిద్ధం చేస్తున్నాం. ట్రాఫిక్ కష్టాలకు శాశ్వత పరిష్కారం లభిస్తుంది. కొండచరియలు పడకుండా జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నాం. నిరుపయోగంగా వదిలేసిన క్యూలైన్లకు, ర్యాంపు నిర్మించి ఉపయోగంలోకి తెస్తామని తెలిపారు.

‘‘ఎన్నడూ లేని విధంగా ఇంద్రకీలాద్రికి రాష్ట్ర ప్రభుత్వం రూ.70 కోట్ల నిధులు ఇచ్చింది. రాష్ట్ర ప్రభుత్వ నిధులతో పాటు దేవస్థాన నిధులతో మోడరన్ ఇంద్రకీలాద్రిగా మారుతుంది. భక్తులకు ఇబ్బంది లేకుండా తిరుమల తిరుపతి తరహాలో అభివృద్ధి పనులు జరుగు తాయి. మాస్టర్ ప్లాన్ ప్రకారం అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. మళ్లీ కూల్చటాలు ఉండవు. అభివృద్ధి పనులు అయ్యాక పరిస్థితి బట్టి ఘాట్ రోడ్‌పై నిర్ణయం తీసుకుంటాం. రేపు శంకుస్థాపన తర్వాత 18 నెలల్లోపు పనులు పూర్తవుతాయని మంత్రి కొట్టు సత్యనారాయణ వెల్లడించారు.
ఇదీ చదవండి: రామోజీ.. ఇంతకన్నా ఛండాలం ఉంటుందా?

>
మరిన్ని వార్తలు